.
ఒక కాంతారా… అంతే, కంబాళాను కథలోకి తీసుకొచ్చినా… పంజుర్లి, గుళిగ, భూతకోల దైవశక్తుల్ని చూపించినా సరే… దాన్ని ఓ చిక్కటి స్క్రీన్‌ప్లేలో ఇమిడ్చేసరికి… అది ఎమోషనల్‌గా ఎలివేట్ అయ్యింది… సేమ్, ఆ దైవశక్తుల్నే అలా చూపించేస్తే మరో సినిమా కాంతారా కాలేదు…
బలగం… మనస్పర్థలతో విడిపోయిన కుటుంబసభ్యులను ఓ చావు, కర్మలు ఎలా పశ్చాత్తాపానికి గురిచేస్తాయనేది తెలంగాణ ఆచారాల నేపథ్యంతో తీసిన కథ… అదీ జనాన్ని కనెక్టయింది… వాటిని రిపీట్ చేయడం అంత సులభం కాదు… ఇక విషయంలోకి వెళ్దాం…
Ads
ఒక సినిమా రిలీజ్ అయ్యింది… సినిమా పేరు మారెమ్మ… ఇందులో రవితేజ అన్నయ్య కొడుకు మాధవ్ నటించాడనే ఒక్క హుక్ పాయింట్ తప్ప ఇంకేమీ లేదు… పోనీ, తనైనా ఈ డెబ్యూ మూవీని జనరంజకంగా చేయగలిగాడా..? అదీ లేదు… రవితేజకే ఈ తాజా ఇరుముడికి ముందు బోలెడు ఫ్లాపులు, ఇంకా ఫీల్డులో ఎందుకు ఉన్నాడని విసుక్కునేంతగా…
సోె, హీరోగా రాణించడం అంత వీజీ కాదు… పైగా మాధవ్ రూపురేఖల మాటెలా ఉన్నా, ఉద్వేగ ప్రదర్శన, నటన విషయంలో చాలా దూరంలో ఉండిపోయాడు… కథ పాతది… పాతికేళ్ల క్రితం కథ అన్నమాట… మహిషాపురం అనే ఓ పల్లెటూరిలో మొదలవుతుంది… ఓ దున్నపోతు కథ కదా, ఊరిపేరు కూడా అలాగే పెట్టారు… ఆప్ట్ అనుకున్నటున్నారు పాపం…
ఆ ఊరి దేవత మారెమ్మ… జాతర సమీపిస్తోంది… మారి అనే దున్నపోతును పెంచుతుంటారు, దాన్ని బలి ఇవ్వాలి… అచ్చోసిన ఆబోతు జోలికి ఎవరూ వెళ్లరు కూడా… దాని బాధ్యత ఈ మాధవ్‌ది, పాత్ర పేరు కర్ణి… దాంతో కర్ణికి అనుబంధం ఏర్పడుతుంది… పక్కూరు ధనిక జలంధర్‌కు ఈ కర్ణిపై పగ…
కర్ణి మీద పగతో జలంధరుడు క్షుద్ర పూజలు చేసుకునే ఓ మంత్రగత్తెను తీసుకొస్తాడు, దున్నపోతును కిడ్నాప్ చేయిస్తాడు… కానీ కొద్దిసేపటికే అది పారిపోతుంది… ఎటుపోయిందో తెలియదు, మరోవైపు జాతర వస్తోంది… మారి కోసం వెతుకులాట… దొరికితే ఖతం చేయాలని జలంధరుడి వెతుకులాట…
నిజానికి బలగం సినిమా తరువాత తెలంగాణ నేపథ్యంలో చాలామంది సినిమాలు తీశారు, కొందరు క్లిక్కయ్యారు… దానికి తగిన కథాకథనాలు చాలా అనుకూలించాలి… కేవలం తెలంగాణ నేపథ్యం ఉంటే చాలు, క్లిక్కవుతుంది అనుకోవడం ఓ భ్రమ…
ఇదీ అంతే… మారెమ్మలో హ్యూమన్ ఎమోషన్స్ చాలా తక్కువ… దీనికితోడు బిగి లేని స్క్రీన్‌ప్లే… ఒక్క సీన్ పండలేదు… హై లేదు… కామెడీకి విఫల ప్రయత్నం… దీనికితోడు హీరోహీరోయిన్ల లవ్ ట్రాక్ మరో వీక్ పాయింట్… స్లోగా సాగుతూ ఉంటుంది సినిమా…
హీరోయిన్ దీప బాలు ఉందంటే ఉంది… వినోద్ కుమార్ కూడా పెద్దగా చేయడానికి ఏమీ లేదు… క్షుద్ర పూజారిణి (జారిణి అంటే తప్పు అర్థం వస్తుందేమో) సరే, క్షుద్ర పూజల మంత్రిణి, తాంత్రిణి, మంత్రగత్తె పాత్ర చేసిన రూపలక్ష్మి పర్లేదు… అంత ప్రేమగా చూసుకున్న దున్నపోతును హీరోయే బలి ఇచ్చే సిట్యుయేషన్ పెద్దగా ప్రేక్షకుడికి కనెక్ట్ కాదు…
అఫ్‌కోర్స్, దాన్ని బలి ఇవ్వడానికే పెంచుతున్నామనే విషయం హీరోకూ తెలుసు… కానీ దానికి చివరలో ఎమోషనల్‌గా ఓ మంచి ట్విస్ట్ ఇస్తే బాగుండేదేమో… పైగా అది సామాజిక బాధ్యత తెలిసిన మంచి దున్నపోతు… ప్చ్… కథ రక్తికట్టలేదోయ్ మాధవా..!! ప్రతి కథా ఇరుముడి కాలేదు!!
Share this Article