Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

వెలుతురు మేఘాల్ని ప్రయోగించి నీ తాపం తగ్గించేస్తాం… సూర్యుడికే సవాల్…

April 11, 2024 by M S R

సూర్యుడి వేడిని తగ్గించేందుకు అమెరికా మేఘమథనం

వాల్మీకి రామాయణం యుద్ధ కాండ. మొదటి రోజు రాముడు ప్రత్యక్షంగా రావణాసురుడితో తల పడ్డాడు. రాముడు నేల మీద నిలుచుని బాణాలు వేస్తూ ధర్మ యుద్ధం చేస్తున్నాడు. రావణుడేమో నేల మీద, ఆకాశంలో, రథం కనిపించకుండా అదృశ్య రూపంలో రాక్షస మాయలన్నీ పన్ని చిత్ర విచిత్రమయిన యుద్ధం చేస్తున్నాడు. అయినా సరే రామ బాణం గురి తప్పలేదు. రావణుడి రథం ముక్కలై కింద పడింది. కిరీటం ఎగిరిపోయింది. చావు దప్పి కన్ను లొట్టబోయి…నేల మీద ఆయాసపడుతున్నాడు. నిరాయుధుడిని, దీనంగా పడి ఉన్నవాడిని రాముడు కొట్టడు.

పో! ఈరోజుకు ఇంటికెళ్లి…గాయాలకు మందు పూసుకుని…వాపులకు ఆవిరి కాపడం పెట్టించుకుని…బలమయిన పోషకాహారం తిని…తేరుకుని…రేపు సూర్యోదయం తరువాత మళ్లీ రా! తేల్చుకుందాం! అన్నాడు రాముడు. ఈ మాటకే రావణుడు చచ్చిపోయాడు అని మిగతా రామాయణాలు అన్నాయి.

Ads

సూర్యోదయం అయ్యింది. స్నానాలు, ఉపాహారాలు అయ్యాయి. మరి కాసేపట్లో రెండో రోజు రామ- రావణ యుద్ధం జరగబోతోంది. ఒక రాతి గుండు మీద రాముడు కొంచెం దిగులుగా ఒంటరిగా కూర్చుని ఉన్నాడు. నిన్న జరిగిన యుద్ధంలో రావణుడి మాయలన్నీ ఒకసారి రాముడికి గుర్తుకొచ్చాయి. రావణుడిని గెలవగలనా? అనే సందేహం కూడా మదిలో మెదిలినట్లుంది.

…అంతే. ఆ క్షణంలో అగస్త్య మహా ముని ఆకాశం నుండి నేలకు దిగాడు. రాముడి భుజం తట్టాడు. రాముడు రెండు చేతులు జోడించి అగస్త్యుడికి నమస్కరించి…ఆయన కూర్చున్న తరువాత తను కూర్చున్నాడు. అగస్త్యుడు రాముడికి ఆదిత్య హృదయం చెప్పాడు. ఆ ఆదిత్య హృదయాన్ని జపించి…సూర్యుడి శక్తిని పొంది…తక్షణమే రావణుడిని వధించు! అని మాయమైపోయాడు. రాముడు అలాగే చేశాడు. రావణ సంహారం జరిగింది.

అదే రామాయణంలో కొంచెం ముందు- సూర్యుడి రథసారథి అనూరుడి కొడుకులు జటాయువు- సంపాతి ఇద్దరూ ఒక రోజు సూర్య మండలం దాకా ముందు ఎవరు వెళ్లి వస్తారో చూద్దామా! అని సరదాగా పోటీ పెట్టుకుని లక్షల కిలో మీటర్లు పైకి…పైపైకి ఎగురుతూనే ఉన్నారు. దాదాపు సూర్య మండలం దగ్గరవుతోంది. వేడి పెరుగుతోంది. జటాయువు కొంచెం ముందు ఉండడంతో కళ్లు బైర్లు కమ్మి స్పృహదప్పి పడి పోయే స్థితి. కిందున్న సంపాతి గమనించి రెక్కల వేగం పెంచి జటాయువు మీద తన రెక్కలను కప్పి రక్షించాడు. ఒక్క క్షణంలో సంపాతి రెక్కలు మాడి మసై కింద ఎక్కడో తమిళనాడు దగ్గర పడ్డాడు. రెక్కలు కాలకపోయినా స్పృహ దప్పి జటాయువు దండకారణ్యంలో పడ్డాడు. ఇద్దరూ రామకార్యం కోసం వేచి ఉంటారు. జటాయువు రావణుడి కత్తి వేటుకు రెక్కలు తెగి…రాముడి ఒడిలో మరణిస్తాడు. సంపాతి హనుమ బృందానికి సీత జాడ చెప్పడంతో పోయిన రెక్కలు వచ్చి గాల్లోకి ఎగురుతాడు.

ఇంకొంచెం ముందు కెళితే ఆంజనేయుడు రోజుల పిల్లాడిగా ఉయ్యాల్లో ఉండగా…పైన ఎర్రగా ఉన్న సూర్యుడిని చూసి…తినే పండనుకుని సూర్యుడి దాకా ఎగురుతాడు. అదే సమయానికి సూర్యుడిని మింగాల్సిన రాహువు వస్తుంటాడు. ఎర్ర పండు కంటే ఈ నల్ల పండు బాగుందే అని రాహువును పట్టుకోబోతాడు. రాహువు ఇంద్రుడిని శరణు వేడితే…ఇంద్రుడు రాగానే ఈ తెల్ల పండు ఇంకా బాగుందే అనుకుని అటు వెళతాడు. ఇక లాభం లేదనుకుని ఇంద్రుడు తన వజ్రాయుధంతో కొడితే ఆంజనేయుడు అంతెత్తు నుండి కింద పడతాడు. దెబ్బకు పిల్లాడి మూతి కొద్దిగా వాచింది. పిల్లాడికి ఇంకేమీ కాలేదు కానీ…పిల్లాడు పడ్డ చోట కొండ పిండి అయ్యింది. తండ్రిగా వాయుదేవుడు అలగడం, దెబ్బకు లోకాల ఊపిరి కాసేపు ఆగిపోవడం…చివరకు బ్రహ్మ కలుగజేసుకుని పరిస్థితిని చక్కదిద్దడం అంతా పెద్ద పంచాయతీ. మహా అల్లరి పిల్లాడు హనుమకు చదువు చెప్పడానికి పెద్ద పెద్ద బృహస్పతులు వణికిపోతే సూర్యుడు ఒప్పుకుంటాడు. తూర్పు మీద ఒక కాలు…పడమర మీద ఒక కాలు పెట్టి…సూర్యుడు ఎటు వెళితే అటు ఆయనకు ఎదురుగా నిలుచుని హనుమ సకల శాస్త్రాలను విద్యార్థిగా, బుద్ధిగా నేర్చుకుంటాడు.

సూర్యుడి కొడుకు యముడు. కూతురు యమున.

సూర్యుడి నుండి బయలుదేరిన కిరణాల గుంపులో వెయ్యి రకాల కిరణాలుంటాయంటుంది సూర్యారాధన స్తోత్రం. ఒక్కో కిరణం ఒక్కో పని చేయాలి. మంచును కరిగించే కిరణాలు కొన్ని. చెట్లకు పత్రహరితాన్ని ప్రసాదించే కిరణాలు కొన్ని. నీళ్లను ఆవిరి చేసి మేఘాలకు చేర్చే కిరణాలు కొన్ని. వేడినిచ్చే కిరణాలు కొన్ని. వెలుగులు పంచే కిరణాలు కొన్ని. శక్తినిచ్చే కిరణాలు కొన్ని. ఆరోగ్యాన్ని ప్రసాదించే కిరణాలు కొన్ని. లేత కిరణాలు కొన్ని. ముదురు కిరణాలు కొన్ని. ఎరుపు రంగు కిరణాలు కొన్ని. పసుపు రంగు కిరణాలు కొన్ని. బంగారు రంగు కిరణాలు కొన్ని. నీలపు రంగు కిరణాలు కొన్ని. అతి నీలలోహిత కిరణాలు కొన్ని.

“ఓం భూర్భువస్వః
తత్స వితుర్వరేణ్యం
భర్గో దేవస్య ధీమహి
ధియోయోనఃప్రచోదయాత్”

గాయత్రీ మంత్ర రహస్యమే సూర్యుడి కిరణం. సూర్యుడి కిరణమే గాయత్రీ దేవి నివాసం. అంటే వెలుగే దైవం. వెలుగే చైతన్యం. వెలుగే జ్ఞానం. వెలుగే శక్తి. వెలుగే సర్వస్వం.

సూర్యుడు లేకపోతే అంతా చీకటి. చిమ్మ చీకటి.

శ్లోకం:-
ఆరోగ్యం భాస్కరా దిచ్ఛేత్.
ధన మిచ్ఛే ద్ధుతాశనః.
జ్ఞానం మహేశ్వరా దిచ్ఛేత్.
మోక్ష మిచ్ఛే జ్జనార్దనః.

పద్యం:-
సూర్యు డారోగ్యమిచ్చును సుజనులార!
సంపదలనగ్ని యొసగును సరసులార!
జ్ఞాన మీశ్వరుడిచ్చును జ్ఞానులార!
మోక్షమిచ్చు జనార్దనుండక్షయముగ-
అని మన రుషుల వాక్కు.

విష్ణువు రెండు కళ్లు సూర్య- చంద్రులు అంటుంది విష్ణు సహస్రనామం.

సూర్యుడు లేకపోతే అంతా శూన్యం. పంట లేదు. వంట లేదు. బతుకే లేదు. కానీ అదే సూర్యుడు కొంచెం వేడిని పెంచితే తట్టుకోలేము. యూరోప్, అమెరికా, రష్యా లాంటి అతి శీతల ప్రాంతాల్లో ఉష్ణోగ్రత 30 డిగ్రీలు దాటితే మహా ప్రళయం వచ్చినట్లే. తట్టుకోలేరు. మనదగ్గర 40-45 డిగ్రీల వేడితో సలసల కాగుతున్నా వేడి వేడి టీ కాఫీలు కోరి కోరి తాగుతాం. వేడి వేడి మిర్చీ బజ్జీలు తింటాం. మండే ఎండల్లో బీడీలు, సిగరెట్లు తాగి పొగను సూర్యుడి మీదికే వదులుతాం.

sun

మేఘాల్లో కృత్రిమంగా వెలుతురును తయారు చేసి…సూర్యుడి కిరణాలను పైనే వికర్షించేలా అమెరికాలో ప్రయోగాలు జరుగుతున్నాయి. “మెరైన్ క్లౌడ్ బ్రైటెనింగ్” అనే ఈ శాస్త్రీయ ప్రక్రియలో సముద్రంపై మేఘాల కింది భాగంలో సముద్రపు ఉప్పును స్ప్రే చేస్తారు. దాంతో మేఘాలు మరింత ప్రకాశవంతమవుతాయి. దీనివల్ల సూర్యుడి కిరణాల వేడి పైనే ఉండిపోతుంది. భూమ్మీద ఉష్ణోగ్రతలు తగ్గించడానికి కొంతవరకు ఇది ఉపయోగపడుతుంది కానీ…దీర్ఘకాలంలో దీనివల్ల భూమికి నష్టమే జరుగుతుందని ఈరంగంలో నిపుణులు పెదవి విరుస్తున్నారు.

“అరచేతిని అడ్డుపెట్టి సూర్యుడిని ఆపగలరా?” అని సామెత.
ఏమో! అమెరికా ప్రయోగం విజయవంతమైతే పిడికెడు ఉప్పును ఉఫ్ఫని సముద్రం మీద ఊదితే…భగ భగ మండే సూర్యుడు నిలువెల్లా వణికి…చలిజ్వరంతో రగ్గుల మీద రగ్గులు కప్పుకుంటాడేమో!

-పమిడికాల్వ మధుసూదన్
9989090018

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • జామ ఆకులు తెగ తింటున్నారు… పచ్చి, ఎండు, పొడి… అన్నీ…
  • ఆంధ్రాబాబు బుర్రలో బనకచర్ల పురుగు మెసులుతూనే ఉంది..!!
  • పొంగులేటి పొగ..! సిస్టం, పార్టీ, సర్కారు… అన్నింటికీ ఓ కొత్త థ్రెట్..!!
  • సార్, మా కరెంటు కనెక్షన్ తీసుకుంటారా..? బోలెడు ఆఫర్లున్నాయి..!!
  • Amitabh Bachchan: The Timeless Titan of Indian Branding
  • ఈ వయస్సులోనూ అత్యంత విలువైన బ్రాండ్ ప్రమోటర్… బిగ్ బీ..!!
  • The Cremator: One Woman’s Sacred Mission to Honor 4,000 Souls
  • భయాన్ని దహనం చేసిన మహిళ — 4 వేల శవాలకు అంత్యక్రియలు…
  • కొడుక్కి ఓ హిట్ కోసం… అల్లుడు నిర్మాతగా… అక్కినేని తెరప్రయత్నం…
  • శవాన్ని ఓవెన్‌లోకి తోశారు… ఏదో కాలుతున్న ధ్వని… ఖాళీ స్ట్రెచర్ బయటికి వచ్చింది…

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions