Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

తెగ నవ్విస్తున్న టూప్లస్‌టూ పెళ్లిచూపుల కథ… మార్కెటింగ్ కన్సల్టెన్సీ…

March 22, 2026 by M S R

.

లోకంలో రెండు రకాల మనుషులు ఉంటారు… ఒకటి— కామన్ సెన్స్ ఉన్నవాడు… వీడిని అడిగితే “రెండు రెళ్లు నాలుగు” అని తేల్చేస్తాడు… రెండో రకం— కన్సల్టెంట్ లేదా మార్కెటింగ్ మేధావి… వీడు అదే నాలుగుని “క్వాడ్రపుల్ ఆప్టిమైజేషన్ ఆఫ్ బైనరీ యూనిట్స్” అంటాడు… వినడానికి ఏదో రాకెట్ సైన్సులా ఉంటుంది కానీ, తీరా లోపలికి వెళ్లి చూస్తే మిగిలేది ఆ పాత ‘నాలుగే’!

నిజానికి, విషయం ఎంత చిన్నదైనా దానికి వాడే ‘ఇంగ్లీష్ కోటింగ్’ బట్టే దాని విలువ మారుతుందనేది నేటి కార్పొరేట్ సూత్రం… సరిగ్గా ఇలాంటి మార్కెటింగ్ మాయాజాలాన్నే నమ్ముకున్నాడు మన యాదగిరి కాక (బాబాయ్)… తన కొడుకు చేసే చిన్న వ్యాపారాన్ని ఏకంగా ఒక ‘మల్టీ నేషనల్ స్టార్టప్’ రేంజ్ లో పెళ్లిచూపుల్లో ఎలా ప్రజెంట్ చేశాడో, ఆ ప్రెజెంటేషన్ చూసి అమ్మాయి తండ్రి బడితె ఎందుకు పట్టుకున్నాడో ఈ క్రింది కథ చదివి తెలుసుకోండి…

Ads

2 plus 2



మన దగ్గర అరేంజ్డ్ మ్యారేజ్ అనగానే ముందుగా వచ్చే ప్రశ్న… “అబ్బాయి ఏం చేస్తాడు?” మా యాదగిరి చిచ్చా (కాక, బాబాయ్) కుటుంబం కూడా తమ అబ్బాయికి సంబంధం చూడటానికి అమ్మాయి ఇంటికి వెళ్ళారు…

ఓ స్వీట్, కాస్తా ఖారా మిక్చర్, టీ, బిస్కెట్స్ పెట్టారు.., గోత్రాలు కలిశాయి… కుశలప్రశ్నలు అన్నీ అయిపోయాక, అమ్మాయి తండ్రి నెమ్మదిగా అసలు విషయంఅడగడం మొదలుపెట్టాడు…

ఇంతకీ మీ అబ్బాయి ప్రస్తుతం ఏం చేస్తున్నాడు? యాదగిరి బాబాయ్ కళ్ళద్దాలు సరిచేసుకుని, గొంతు సవరించుకుని, ఇలా చెప్పడం మొదలు పెట్టాడు…

‘‘మా వాడు ప్రస్తుతం ఒక అగ్రో- బేస్డ్ డైరెక్ట్- టు- కన్స్యూమర్ (Agro-based D2C) స్టార్టప్ కి ఫౌండర్, మేనేజింగ్ డైరెక్టర్… మేg ప్రధానంగా ఆర్గానిక్ హెల్త్ అండ్ వెల్నెస్ రంగంలో డీల్ చేస్తున్నాం’’ అన్నాడు…

ఇది వినగానే అమ్మాయి తండ్రి సగం ఇంప్రెస్ అయిపోయాడు… “వావ్! ఇంతకీ మీ ప్రొడక్ట్ ఏంటి?” అన్నాడు…

అప్పుడు మా యాదగిరి బాబాయ్ “మావాడి పోర్ట్‌ఫోలియోలో ప్రధానంగా హై-ప్రోటీన్ రోస్టెడ్ లెగ్యూమ్స్ (Roasted Legumes), కన్వెన్షనల్ కారమెలైజ్డ్ స్వీట్స్ ఉంటాయి… మేము ముడి పదార్థాలను నేరుగా హోల్ సేల్ సప్లై చైన్ నుండి సేకరించి, మా స్వంత థర్మల్ ప్రాసెసింగ్ యూనిట్ లో డ్రై-రోస్ట్ చేస్తాం…

అన్నిటికంటే పెద్ద హైలైట్ ఏంటంటే.. మా ప్యాకేజింగ్ 100% నెట్ జీరో, ఎకో ఫ్రెండ్లీ, బయోడిగ్రేడబుల్!” అన్నాడు… అమ్మాయి కుటుంబ సభ్యులు ఇదంతా విని ఆశ్చర్యపోయారు… వీరిది ఏదో పెద్ద మల్టీనేషనల్ కంపెనీలా అనిపించింది వాళ్లకి!

అమ్మాయి బాబాయ్ విని, బాగా ఇంప్రెస్ అయిపోయి, ఇక తట్టుకోలేక “ఇంతకీ మీ కంపెనీ మెయిన్ ఆఫీస్ ఎక్కడ? ఎంతమంది ఎంప్లాయీస్ ఉన్నారు?” అనడిగాడు చకచకా… యాదగిరి కాక తడుముకోకుండా…  ఇప్పుడు అంతా. ఆధునిక లీన్ స్టార్టప్ (Lean Startup) యుగం… అందుకే షాపు అద్దెలు, కరెంటు బిల్లుల వంటి అనవసర ఖర్చులు మేము చేయం…

మాకు ఒక మొబైల్ రిటైల్ అవుట్‌లెట్ ఉంది.., ట్రాఫిక్, జనం రద్దీని బట్టి అది రోజుకో చోట ఉంటుంది… ఇక ఆపరేషన్స్ అంతా మా అబ్బాయే చూసుకుంటాడు — హి ఈజ్ ఏ సోలోప్రెన్యూర్ (Solopreneur)!” అన్నాడు…

అమ్మాయి తండ్రికి పూర్తిగా మతిపోయింది… ఈ ఇంగ్లీష్ తన బుర్రకి అస్సలు ఎక్కడం లేదు… అయ్యా “నాకీ మార్కెటింగ్ భాష సరిగ్గా అర్థం కావడం లేదు… అసలు అబ్బాయి ఏం చేస్తాడో మామూలు మాటల్లో చెబుతారా?” అన్నాడు…

అప్పుడు అబ్బాయి పక్కనే ఉన్న ప్రాణస్నేహితుడు మెల్లగా నోరు విప్పాడు… తప్పనిసరై… “అంకుల్.. ఆయన చెప్పేది ఏంటంటే.. మా వాడు హైవే పక్కన, బండి మీద ఇసుకలో వేయించిన పల్లీలు అమ్ముతాడు… పెనం మీద ఇసుకలో వేయిస్తాడు (థర్మల్ ప్రాసెసింగ్).. వాటిని పాత న్యూస్ పేపర్ కాగితాల్లో చుట్టి ఇస్తాడు (బయో డిగ్రేడబుల్ ప్యాకేజింగ్)…

అమ్మాయి తండ్రి చేతిలో టీ కప్పు దబాలున నేల మీద పడి ముక్కలైంది… Of course, పెళ్లి చూపులు ఏమై ఉంటాయో మీ అందరికీ తెలుసు కదా… అమ్మాయి తండ్రి ఓ బడితె పట్టుకుని మరీ తరిమాడు బీపీ పెరిగి…

(కొన్నాళ్లుగా వాట్సప్‌లో తెగ చక్కర్లు కొడుతోంది ఇది... దానికి మనదైన పైత్యాన్ని జోడించిన సరదా కథ...)

peanut

సో… రేపు పొద్దున ఎవరైనా “టీ అమ్ముతున్నాను” అని చెప్పడానికి బదులు… “నేను ఒక థర్మల్లీ యాక్టివేటెడ్, పాలీఫెనాల్ రిచ్, హాట్ లిక్విడ్ డిస్పెన్సింగ్ స్టార్టప్ రన్ చేస్తున్నాను” అని చెప్పినా ఆశ్చర్యపోనక్కర్లేదు….

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • మన పెట్రో బిల్లును ఎథనాల్ తగ్గించగలదా..? ఏమేం ప్రయోజనాలు..?!
  • రాజా రమేష్… సినిమా కథగా ఓ నిజ జీవిత థ్రిల్లర్… కానీ..?
  • పునర్జన్మ… మీరు నమ్మరా… పోనీ, ఈ రియల్ స్టోరీ ఓసారి చదవండి…
  • ఆకలి కడుపులకు అన్నపూర్ణ..! నచ్చిన రేవంత్ మరో పథకం..!!
  • CM Ramesh … అద్భుత వశీకరణ శక్తిమంతుడు… జై పాతాళ భైరవీ…
  • NCPI … త్రిపురలోని ఓ విఫల పార్టీ హఠాత్తుగా జాతీయ తెరపై… ‘షా’లిటిక్స్..!!
  • ఎవరి ఊహకూ అందలేదు ..! బెంగాల్ రాజకీయాల్లో ‘మోటా భాయ్’ మాస్టర్ స్ట్రోక్ ..!!
  • యుద్ధం ఒక డ్రామా… ఒక వ్యాపారం… అసలు చేదు నిజాలు ఇవీ…!
  • Peddi Anantha Sriram … రాతలే కాదు, కూతలూ అలాగే ఉన్నయ్…
  • ఏం చేయాలో ఎటూ తేల్చరు… ఏటా కోట్ల మెయింటెనెన్స్ ఖర్చు…

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions