అవును… కేసీయార్ బిడ్డ లగ్గమే… కేసీయార్ దత్తత తీసుకున్న బిడ్డ… పేరు ప్రత్యూష… సవతి తల్లి చిత్రహింసలకు ఒళ్లంతా గాయాలై, దాదాపు కొలాప్స్ అయ్యే స్థితిలో… అప్పట్లో 2015లో బాలల హక్కుల సంఘం నాయకుడు అచ్యుతరావు చొరవతో కాపాడబడిన బాధితురాలు… ఆమె పెళ్లి ఇప్పుడు జరగనుంది… ఈనెల 28న పెళ్లి… మహిళాభివృద్ధి, శిశుసంక్షేమ శాఖ ఆధ్వర్యంలో… రంగారెడ్డి జిల్లా, కేశంపేట మండలం, అల్వాల్ పాటిగడ్డ గ్రామంలోని లూర్దు మాత దేవాలయంలో క్రైస్తవ సంప్రదాయంలో పెళ్లి వేడుకలు జరగనున్నట్టు నమస్తే తెలంగాణ ఓ వార్తను పబ్లిష్ చేసింది… మంచి వార్త… ఆమెకు ఓ కొత్త జీవితం… ఆల్ ది బెస్ట్ ప్రత్యూషా…
పెండ్లి పత్రికను తన కాబోయే అత్తతో కలిసి మంత్రి సత్యవతి రాథోడ్‌కు ఇస్తున్న ఫోటో ఇది… ఈ పెళ్లికి రావాలని సీఎం కేసీయార్‌ను కూడా ఈ మంత్రిత్వ శాఖ ఆహ్వానించారు… పెళ్లి కానుకగా ప్రత్యూషకు నిమ్స్‌లో ఉద్యోగం ఇస్తానని సీఎం హామీ ఇచ్చినట్టు ఆ శాఖ అధికారులు చెబుతున్నారు… ఆమె నర్సింగ్ కోర్సు పూర్తి చేసింది…
Ads
ఈ ఫోటో గుర్తుంది కదా… అయిదేళ్ల క్రితం సవతి తల్లి చేతుల్లో చిత్రహింసలకు గురై, దాదాపు చావు అంచుల దాకా వెళ్లిన ప్రత్యూష… ఆమె దగ్గరకు భార్య, బిడ్డ, అధికారులతో వెళ్లి, పరామర్శించి, ఆమె దుస్థితి చూసి చలించిన సీఎం కేసీయార్ ఆమెను దత్తత తీసుకుంటున్నట్టు ప్రకటించి, తానే పెళ్లి చేస్తానని కూడా హామీ ఇచ్చాడు… అన్నట్టుగానే ఆమె మొత్తం బాధ్యతలు స్వీకరించాడు…
ఇంటికి పిలిచి, భోజనం పెట్టి, భరోసా కల్పించి… ఆమె చదువు బాధ్యతల్ని మహిళాభివృద్ధి, శిశుసంక్షేమ శాఖకు అప్పగించాడు… ఆబిడ్స్‌లోని ఓ మెటర్నిటీ హాస్పిటల్ ఆమెను నర్సింగ్ కోర్సులో చేర్చుకుంది… మధ్యలో ఎవరో ఓ యువకుడు ఆమెను పెళ్లి చేసుకోవడానికి ముందుకొస్తే… ఆమె చదువు అయిపోయేవరకు పెళ్లి వద్దని కేసీయార్ తిరస్కరించి, చదువు మీద కాన్సంట్రేట్ చేయాలని సూచించాడు…
రెండు నెలల క్రితం తనను పెళ్లి చేసుకోవడానికి ఓ యువకుడు ముందుకొచ్చాడు… తన వివరాలన్నీ తెలుసుకున్నాక అధికారులు కూడా ఓకే అన్నారు… సీఎం కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు… ఓ హోటల్లో నిశ్చితార్థం జరిగిన ఫోటో ఇది… ఇప్పుడిక పెళ్లి… కొన్ని వార్తలు మనసు నిండా ఆనందాన్ని నింపుతాయి… అలాంటిదే ఈ వార్త కూడా… సీఎం కేసీయార్‌కు ‘ముచ్చట’ సంపూర్ణమైన అభినందనలు…
ఇదేరోజు నమస్తే ప్రచురించిన మరో వార్త కూడా ఆనందాన్ని కలిగించేదే… ఇది హరీష్ రావుకు సంబంధించిన వార్త… సిద్దిపేట జిల్లా, చినకోడూరు మండలం, కస్తూరిపల్లికి చెందిన భాగ్య… కొన్నేళ్ల క్రితం తల్లిదండ్రులను కోల్పోయి అనాథ అయ్యింది… హరీష్ రావు స్పందించి ఆమె మొత్తం బాధ్యతల్ని మనం చేపడదామని కలెక్టర్‌కు సూచించాడు… 2017 నుంచీ బాలసదనంలో ఆమెకు వసతి కల్పించారు… బాగోగులన్నీ ప్రభుత్వ బాధ్యతే… ఇంటర్, తరువాత డీఎడ్ పూర్తి చేసి, ఇప్పుడు ఎంఎస్‌డబ్ల్యూ చేస్తోంది… 2018లోనే ఓ కొలువు కూడా ఇచ్చారు… ఇబ్రహీంనగర్‌కు చెందిన రాజు సౌదీ అరేబియాలో కొన్నాళ్లు డ్రైవర్‌గా చేసి, తిరిగి వచ్చి సొంతంగా ఓ టిఫిన్ సెంటర్ నడిపించుకుంటున్నాడు… భాగ్య, రాజులకు గురువారం సిద్దిపేట టీటీసీ భవనంలో పెళ్లి జరిగింది… హరీష్, కలెక్టర్, ఇతర అధికారులు హాజరై అక్షింతలు చల్లారు… ఈ ఫోటో అదే… ఒకేరోజు ఒకే పేజీలో పక్కపక్కనే వచ్చిన ఈ రెండు వార్తలూ అభినందనీయం… ఆనందదాయకం…!
Share this Article