సముద్రంలో పెళ్లికి మునగడానికి వస్తారా?
————————
సంసారం ఒక సముద్రం. ఎంత ఈదినా ఇంకా ఈదాల్సింది ఎంతో మిగిలి ఉంటుంది. ఎంత మునిగినా ఇంకా మునగాల్సిన లోతు ఎంతో మిగిలే ఉంటుంది. అందుకే సంసార సాగరం అన్నారు. జీవితం కొందరికి తెరచాప తెగిన నావలా ఎటుపడితే అటు కొట్టుకుపోతూ ఉంటుంది. కొందరికి చుక్కాని లేని నావలా గమ్యం తెలియని పయనంగా సాగిపోతూ ఉంటుంది. కొందరి సంసారంలో ఎప్పుడూ ఆటు పోట్లే. కొందరికి ఎప్పుడూ సుడి గుండంలో మునుగుతున్నట్లే ఉంటుంది. కొందరి జీవితంలో కష్టాల అలలు ఎగసి ఎగసి పడుతుంటాయి. కొందరి కంట్లో కన్నీళ్లు సముద్రం కంటే ఎక్కువగా ఉంటాయి. మొత్తంమీద మన సంసార సాగరాలకు- అసలు సముద్రాలకు ప్రత్యక్ష పరోక్ష అంతర్గత సంబంధాలున్నాయి.
Ads
ఆ సంబంధాలకు మరింత ప్రతీకాత్మకంగా చెన్నైలో సముద్రం సాక్షిగా, సముద్ర గర్భంలో ఒక జంట శాస్త్రోక్తంగా పెళ్లి చేసుకున్నారు. పెళ్లికి ముందు గజ ఈత విద్య నేర్చుకున్నారు. ఆక్సిజెన్ సిలిండర్లు భుజానికి కట్టుకున్నారు. మొహానికి గ్లాస్ మాస్క్ పెట్టుకున్నారు. ఆ చల్లని సముద్ర గర్భం అడుగున ఒక పూల పందిరి గుచ్చారు. ఆ పందిరి కింద మాంగళ్య ధారణ జరిగింది. దండలు మార్చుకున్నారు. సముద్ర జలచరాలు ఆనంద బాష్పాలతో ఈ జంటను ఆశీర్వదించాయి. చిరు చేపల కనుపాపలు ముసి ముసిగా నవ్వి దీవించాయి. సొర చేపలు తోకలు ఊపి అభినందించాయి. తిమింగలాలు నింపాదిగా జలగీతాలు పాడాయి. మొసళ్లు అసలు సిసలు మొసలి కన్నీళ్లను చిలకరించాయి. వీరి సంసార సాగరం ఎలాంటి ఆటుపోట్లు లేకుండా సాఫీగా సాగాలని బంగాళా సముద్రుడు మనస్ఫూర్తిగా దీవించాడు.
———————–
పెళ్లి ఒక సాహసం. అదెంత సాహసమో ఈ జంటకు తెలిసినంతగా మరెవరికీ తెలియకపోవచ్చు. తాళి కట్టడం ఎంత తెగింపో వీరు ప్రపంచానికి తెలియజేశారు. సంసార సాగరంలో మునగడమే కానీ- తేలడం ఉండదని ఇరవై ఐదేళ్లు దాటకుండానే జ్ఞానోదయం అయిన ఈ జంట నిజంగా అభినందనీయులు. ఇంకా నయం- మా పెళ్లికి వచ్చి నిండా మునగండి. మునిగి మమ్మల్ను ఆశీర్వదించండి- అని వారు మనల్ను అడగలేదు. సముద్రాంతర్గత వివాహ శుభ కార్యానికి సాక్ష్యం ఉండాలి కాబట్టి- ఒక్క వీడియో, స్టిల్ ఫోటోగ్రాఫర్ ను మాత్రం వీరు తమతో పాటు ముంచి తేల్చారు.
సముద్ర గర్భంలో తాళి కట్టి, దండలు మార్చుకున్న ఈ జంట కలకాలం చిలకా గోరింకల్లా ఉండాలి. వారి ధైర్యం ముందు సముద్రమే చిన్నబోవాలి.
ఆ చల్లని సముద్ర గర్భం వేసిన పందిరి ఎంతో?
ఆ బంగాళాఖాతం చల్లిన అక్షింతలు ఎన్నో?……………. By…. -పమిడికాల్వ మధుసూదన్
Share this Article