కొందరు పీఠాధిపతుల తీరు చూశాం కదా… ఎంతసేపూ రాజకీయ బురద ఒంటికి దట్టంగా పూసుకుంటూ, తమ ధార్మికవ్యాప్తి విధిని ఏమాత్రం పట్టించుకోకుండా గడిపే తీరును… కొంతమందికి సంపాదనే పరమావధి… ఇంకా..? ఇంకా..?
ఓ మిత్రుడు పంపించిన వార్త బాగనిపించింది… అదేమిటంటే..? ‘‘అమెరికాలోని చికాగో నగరంలో నౌ ఎరినా స్టేడియం వేదికగా పది వేల మందికి పైగా భగవద్గీతను కంఠస్థం చేసిన భక్తులు ఒకే కంఠంతో సంపూర్ణ భగవద్గీత పారాయణం చేశారు… భక్తులతో పాటు ఇల్లునాయిస్ గవర్నర్ జూలియానా స్టార్టోన్ , స్టేట్ సెక్రెటరీ అలెక్సీ గియానౌలియాస్, సెనేటర్ క్రిష్టినా కాస్ట్రో, స్టేట్ సెనేటర్ అరియన్ జాన్సన్, మేయర్ బిల్ తో పాటు అనేక నగరాల మేయర్లు, నగర ప్రముఖులు స్వామీజీ పిలుపు మేరకు హాజరయ్యారు…’’
Ads
అమెరికన్‌ను పెళ్లాడినా తన ధర్మాన్ని వదలక పాటించే ఉషా వాన్స్ ఆ దేశ సెకండ్ లేడీ అయ్యే అవకాశాలు కనిపిస్తుండటం… ఇండియన్ ఆరిజిన్ కమలా హారిస్ కు ఏకంగా అధ్యక్ష పదవే దక్కే పరిస్థితులు వస్తుండటం… వివేక్ రామస్వామి, తులసి గబార్డ్ వంటి నేతలు అమెరికన్ రాజకీయాల్లో వెలుగుతూ ఉండటం… అమెరికన్ రాజకీయాలు ఇండియన్- హిందూ వోట్ల కోసం ప్రయత్నాలు చేస్తుండటం… ఇలాంటి వార్తల నడుమ ఈ సామూహిక గీతాపఠనం వార్త కూడా ఆసక్తికరం అనిపించింది…
ఎక్కడో సుదూరంగా ఉన్న ఆ దేశానికి వెళ్లిన వేలాది మంది భక్తిగా తమ అస్థిత్వ పునాదుల్ని పదిలంగా కాపాడుకోవడం బాగనిపించింది… ఆధ్యాత్మికత సరే, తమ రూట్స్‌కు ప్రవాస భారతీయులు ఇస్తున్న విలువ ఆ వేలాది మంది భక్తులు గీతాపఠనం చేస్తున్న ఫోటోల్లో కనిపించింది… ఇది ఆర్గనైజ్ చేసింది గణపతి సచ్చిదానంద స్వామీ… ఆయన ఆధ్వర్యంలోని అవధూత దత్తపీఠం 1966లో ఏర్పడిన నాటి నుంచీ అవిశ్రాంతంగా ధార్మిక వ్యాప్తిని కొనసాగిస్తూనే ఉంది…
అంతర్జాతీయంగా ఆధ్యాత్మిక, సాంస్కృతిక, సాంఘిక సంక్షేమ సంస్థగా పీఠం యోగా, ధ్యానం, సంగీత చికిత్స, సామాజిక సేవా కార్యక్రమాల్ని నిర్వహిస్తోంది… గీత విలువైన సందేశాన్ని ప్రచారం చేసే లక్ష్యంతో SGS గీత ఫౌండేషన్ స్థాపించి అనేక కార్యక్రమాల్ని ఏర్పాటు చేస్తోంది పీఠం… 2022లో స్వామి నిర్వహించిన టెక్సాస్‌లోని అలెన్‌లో వేలాది మంది భగవద్గీతను పఠించే కార్యక్రమం గిన్నిస్ వరల్డ్ రికార్డుల్లోకి ఎక్కింది…
అమెరికాలోని భారతీయులు ఇలాంటి కార్యక్రమాలకు భారీగా హాజరవుతున్నారు… కల్చరల్, స్పిరిట్యువల్ సోయి ఇక్కడికన్నా అక్కడే ఎక్కువ… అందుకే మనవాళ్లు ఓ మోస్తరుగా ఉన్న ప్రదేశాల్లో కూడా గుళ్లు వెలిశాయి… మన దేశంలోనేమో మన పండుగల మీద, మన దేవుళ్ల మీద తెల్లారిలేస్తే ద్వేష విషం చిమ్మబడుతోంది… ఈ స్థితిలో ఇలాంటి పీఠాలు ఇలాంటి కార్యక్రమాలతో నిజమైన ధర్మవ్యాప్తిని విశ్వవ్యాప్తంగా నిరంతరమూ కొనసాగిస్తుండటమే ఇక్కడ చెప్పదలిచిన సారాంశం…
Share this Article