అప్పుడెప్పుడో ఓ టీవీ యాంకర్ వంటల షోల గురించి మాట్లాడుతూ…. ‘‘ఛీ యాఖ్, మేమెందుకు రుచిచూస్తాం ఆ వంటల్ని… ఏదో నటిస్తాం, అంతే…’’ అని కుండబద్ధలు కొట్టేసింది… టీవీల్లో వంటల షోలు అలా ఛండాలం చేసేశారు గానీ యూట్యూబ్‌లో టాప్ జానర్లలో కుకరీ కూడా ఉంటుంది… మొన్నామధ్య చెప్పుకున్నాం కదా, పచ్చిపులుసు తయారీ వీడియో కూడా లక్షల వ్యూస్ సంపాదిస్తోంది అని… (కొన్ని కోట్లలో…) నిజంగా నిజం… వంటావార్పూ నేర్చుకోకుండానే పెళ్లి దాకా పెరిగే పిల్లలు తాపీగా యూట్యూబు చూస్తూ పాఠాలు నేర్చుకుంటున్నారు, గరిట పట్టుకుని కొత్త కొత్త వంటల అంతు చూస్తున్నారు… ఇప్పుడు వంటల వీడియోలు చాలా పాపులర్, రెవిన్యూ ఎర్నింగ్ కూడా..! నిజానికి టీవీలు ఇన్నిరోజులూ దాన్ని సరిగ్గా ట్యాప్ చేసుకోలేకపోయాయి… వచ్చే అరకొర కార్యక్రమాలు కూడా ఓ రీతిరివాజు లేకుండా చప్పగా, ఉప్పూకారం లేని కిచిడీలా ఉండి, ప్రేక్షకుల ఆదరణ పొందలేకపోతున్నయ్… ఇప్పుడు జెమిని వాడు అందుకున్నాడు…
నిజానికి సీరియళ్లు, రియాలిటీ షోలే కాదు, జెమిని చాలాకాలంగా కాడి కిందపడేసింది… ఏవో నాలుగు సినిమాలు కొనుక్కోవడం, అవి ప్రసారం చేసుకోవడమే తప్ప అదసలు టీవీల పోటీలోనే లేదు, నాలుగో స్థానంలో పడి ఏడుస్తోంది… అకస్మాత్తుగా ఏ జ్ఞాననేత్రం తెరుచుకుందో ఇటు జూనియర్‌తో మీలో ఎవరు కోటీశ్వరులు స్టార్ట్ చేసింది… మరోవైపు తమన్నా హోస్ట్‌గా మాస్టర్ చెఫ్ ఆరంభించింది… చాలా ఖర్చుతో కూడిన యవ్వారమే… ఆ సెట్లు, హోస్టుల రెమ్యునరేషన్ గట్రా… నిజానికి ఇప్పుడు జెమిని రీచ్ చాలా చాలా తక్కువ, ఈ ఖర్చుకు తగిన రెవిన్యూ రాకపోతే అది మరింత మునిగిపోవడం ఖాయం… (జూనియర్, తమన్నా మాత్రమే కాదు, చాలామంది టీవీల్లోకి రాకతప్పదు… అది మళ్లీ ఎప్పుడైనా చెప్పుకుందాం…) ఐనాసరే, రిస్క్ తీసుకున్నది జెమిని, వోకే… మీలో ఎవరు కోటీశ్వరులు షోలో జూనియర్ తన పొగడ్తలకు చాన్స్ ఇవ్వకుండా, గతంలో బిగ్‌బాస్ తరహాలో హోస్ట్ చేస్తే బాగానే ఉంటుంది… తను మంచి టీవీ హోస్ట్, అందులో డౌట్ లేదు… ఇక మాస్టర్ చెఫ్ గురించి… భారీ సెట్ ఒకటి బెంగుళూరులో వేశారు, క్రియేటివ్‌గా బాగుంది… అసలు ఆ లుక్కే సగం కడుపు నింపేలా ఉంది… ఇది బిగ్‌బాస్ షోలు నిర్మించే ఎండెమాల్ షైన్ వాళ్లదే… మరి అలవాటైన స్టార్ మాటీవీని వదిలి జెమినికి ఎందుకు ఈ షో చాన్స్ ఇచ్చారో తెలియదు… (సేమ్, కౌన్ బనేగా కరోడ్‌పతి షో నిర్మించే బిగ్ సినర్జీకి కూడా గతంలో మాటీవీతో బంధం ఉండేది… వాళ్లు కూడా స్టార్ మాటీవీ వదిలి మీలో ఎవరు కోటీశ్వరులు షోను జెమిని వాళ్లకు ఇచ్చారు…) ప్రమోషన్ కూడా సరిగ్గా లేదు…
Ads
ఈ షో ప్రపంచవ్యాప్తంగా పలు భాషల్లో ప్రసారం అవుతుంది… ఇండియాలో ప్రస్తుతానికి హిందీ, తమిళం, ఇప్పుడు తెలుగు… త్వరలో కన్నడం, మలయాళం… మామూలు వంటల పోటీలతో పోలిస్తే ఈ షో కాస్త డిఫరెంట్… ఇది మనకు జీర్ణం కావడానికి కొద్దిరోజులు పడుతుంది… జడ్జిలుగా తుమ్మ సంజయ్, చలపతిరావు, పడాల మహేష్ వ్యవహరిస్తున్నారు… పేరొందినవాళ్లే కదా, బాగానే చేస్తున్నారు… కానీ తమన్నాయే మరీ ఎండుకుపోయినట్టుగా కళతప్పిపోయింది… పైగా ఆమె తెలుగు సరేసరి… (షో యాడ్‌లోనే కమ్మదనం బదులు కమ్మతనం అని ఆమె పలికిన తీరు నవ్వు పుట్టించింది… పైగా పదే పదే తెలుగు రుచులు అనడం కూడా… ఒకటీరెండు మినహా అన్నీ చిత్రవిచిత్ర సొంత ప్రయోగ పాకాలే అవి…) ఇప్పుడిప్పుడే మొదలైంది కాబట్టి తీర్పులు చెప్పేయలేం, కానీ ఫార్మాట్ వేరు కాబట్టి త్వరగా మింగుడుపడటం లేదు… అంతే… పోటీదారుల ఫీలింగ్స్ ఎప్పటికప్పుడు చెప్పుకోవడం బాగానే ఉంది గానీ… వాళ్లేం వండుతున్నారో, వాటి పేర్లేమిటో, వాటి ఇంగ్రెడియెంట్స్ ఏమిటో కూడా అర్థం కానంత స్పీడ్‌గా వెళ్లిపోతోంది… మరి షో అరిగేదెలా..? పైగా కంటెస్టెంట్ల కన్‌ఫ్యూజన్ కాస్త ఎక్కువ మోతాదులోనే కనిపిస్తోంది ప్రస్తుతానికి… వంట అంటే ఓ యజ్ఞం… లుక్కు బాగుండాలి, ప్లేటింగ్ బాగుండాలి, టేస్ట్ బాగుండాలి, అన్నింటికీ మించి వాసన బాగుండాలి, సింపుల్‌గా ఉండాలి, ఈజీ ఇంగ్రెడియింట్స్ ఉండాలి, న్యూట్రిషియస్ అయి ఉండాలి, తేలికగా తినగలిగేవిగా ఉండాలి ఈజీగా జీర్ణమయ్యేవై ఉండాలి, త్వరగా వండేలా ఉండాలి, పంచ భక్ష్యాలూ ట్రై చేయాలి…. సో, కంటెస్టెంట్ల ఎంపికే కదా ఇప్పటికి జరిగింది, ఇకపై ఎలా ‘‘వండుతారో’’ చూద్దాం… అటు జూనియర్, ఇటు తమన్నా జెమిని TV కి కాస్త కొత్త ఊపిరి ఊదుతారేమో చూద్దాం…!!
Share this Article