.
MaViGun … జగన్ ప్రతిపాదించిన ఈ ఏపీ రాజధాని కొత్త ప్రపోజల్- అలియాస్ ప్లాన్ బీ మీద, ఆ పేరు మీద నిన్నటి నుంచీ విపరీతంగా ట్రోలింగ్ నడుస్తోంది… మీమ్స్, చెణుకులు భారీగా పడుతున్నాయి… అమరావతిని పఢావు పెట్టావు గానీ మరి ఇదే ప్లాన్ నువ్వెందుకు అమలు చేయలేదు అనే ప్రశ్నకు జగన్ క్యాంపు దగ్గర సమాధానం లేదు, ఉండదు… కానీ గ్రీన్‌ఫీల్డ్ కేపిటల్ బదులు, ఆల్రెడీ డెవలప్డ్ ప్రాంతాలను వాడుకోవడం మంచిదేగా అనే అభిప్రాయానికి విలువ ఉంది..!!
తను ఏమంటాడంటే..? ‘‘దేశానికి కేపిటల్ గానీ, రాష్ట్రాలకు కేపిటల్ ఏమిటి..? ఎక్కడ రాసి ఉంది..?’’ అమరావతిపై ఏ చట్టసభ కొత్త చట్టం చేసిందో, అదే సభ మరో చట్టం చేయలేదా అనడిగాడు కూడా… అంటే నేను అధికారంలోకి వస్తే కథ మళ్లీ మొదటికే అని చెప్పేస్తున్నాడు… రెడ్డొచ్చె మొదలాడు… సరే, ఆ డిబేట్ పక్కన పెడితే…
Ads
గతంలో తెనాలి- విజయవాడ- గుంటూరు- మంగళగిరి అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ (VGTM-UDA) ఉండేది… తరువాత ఏపీ కేపిటల్ రీజియన్ డెవలప్‌మెంట్ అథారిటీ (APCRDA) కొత్తగా వచ్చింది… ఢిల్లీ చుట్టుపక్కల ప్రాంతాల్ని కలిపి కూడా నేషనల్ కేపిటల్ రీజియన్ (NCR) ఉంది… అంటే, కారిడార్లు మన అవసరాన్ని బట్టి ఏవైనా ఏర్పాటు చేసుకోవచ్చు, అందులోకి ఏయే పట్టణాలు రావాలనేదీ నిర్ణయం తీసుకోవచ్చు… పట్టణాలే అవసరం లేదు కూడా… గ్రీన్ ఫీల్డ్ రాజధాని కూడా కట్టుకోవచ్చు…
(నిన్నటి బిల్లులో అమరావతి ప్రస్తావన… ఇక్కడ మళ్లీ ఓ యాంబిగ్యూయిటీ… అనగా సందేహ సందిగ్దత… పాత చట్టంలో ‘‘ఓ కొత్త కేపిటల్ అవసరం’’ అని రాసి ఉన్న వాక్యాల స్థానంలో ‘‘అమరావతి కొత్త కేపిటల్’’ అని కొత్త వాక్యం పొందుపరచాలనేది ఈ బిల్లు సారాంశం… అసలు రాష్ట్ర విభజన వేళ ‘అమరావతి’ అనే పేరే వినిపించలేదు కదా… పదేళ్లు హైదరాబాద్ ఉమ్మడి రాజధాని, ఏపీకి ఓ కొత్త కేపిటల్ అన్నారు. అంతే…
పోనీ, ఏపీకి పోలవరం ముంపు మండలాల అప్పగింత బిల్లులాగే… పాత పునర్వ్యవస్థీకరణ చట్టానికి సవరణలు బదులు ఓ కొత్త బిల్లే ప్రవేశపెట్టి ఉండొచ్చు కదానేది మరో ప్రశ్న… ఇక్కడ ఏపీ కూటమి ప్రభుత్వం చాకచక్యంగా వ్యవహరించింది…
ఎలాగంటే… నిజానికి స్టేట్ కేపిటల్ ఎక్కడనేది రాష్ట్రాల ఇష్టం… కేంద్రం తలదూర్చదు… కానీ మళ్లీ జగన్ అధికారంలోకి గనుక వస్తే, కూటమి ఏపీ అసెంబ్లీలో ఏ తీర్మానం పెట్టి పాస్ చేయిచుకున్నా సరే, దాన్ని తిరగడోడతాడు… ఖాయం… నిన్న తను చెప్పిందీ అదే… అందుకని కేవలం ఏపీ అసెంబ్లీ ఆమోదం ఉంటే కేంద్రం పట్టించుకోదు, నాకేం సంబంధం అంటుంది, అందుకని పాత విభజన చట్టానికే సవరణ పేరిట పార్లమెంటులో ప్రవేశపెట్టించారు… అమరావతి రాజధానికి పార్లమెంటు ఆమోదం అనే చెల్లుబాటు కోసం..!!
కానీ దేశానికే కేపిటల్ గానీ, రాష్ట్రాలకు కేపిటల్ ఏమిటీ అంటాడు కదా జగన్… ఒకరకంగా ఇది పాయింటే..? నిన్న లోకసభ సవరించిన, నేడు రాజ్యసభ ఆమోదించనున్న ఏపీ పునర్వ్యవస్థీకరణ సవరణ బిల్లులో (బహుశా 5 సెక్షన్ క్లాజ్ 3 కావచ్చు) కేపిటల్ ఎట్ అమరావతి అని పేర్కొన్నారు… కానీ అసలు కేపిటల్ అంటే నిర్వచనం గానీ, ఎంపికకు ప్రామాణికాలు గానీ ఏమీ లేవు…
కేపిటల్ నిర్వచనం అవసరం లేదు, రాజధాని అంటే రాష్ట్ర పరిపాలన కేంద్రం మా్త్రమే కదా అని కొందరు అంటున్నారు… కానీ మరో యాంబిగ్యూయిటీ ఇక్కడ…స్టేట్ కేపిటల్ అనే పదం రాజ్యాంగ విహితమేనా..? అసలు కేపిటల్ అంటే ఏమిటి..? అక్కడ ఏమేం ఉండాలి..? ఈ నిర్వచనం ఎందుకు అవసరం అంటే..? ఇదే జగన్ గతంలో మూడు రాజధానులు అన్నాడు… ఒకటి న్యాయ రాజధాని, రెండు పాలన రాజధాని, మూడు రాజకీయ రాజధాని… అందుకే స్థూలంగా వాటీజ్ ఏ కేపిటల్ అనే డెఫినిషన్ ఈ బిల్లులో చెప్పి ఉండాల్సింది… ఆ శూన్యం అలాగే ఉంచేశారు… కారణం తెలియదు… మళ్లీ ఆ మీమాంసలోకి కూటమి ప్రభుత్వం అడుగుపెట్ట దలుచుకోలేదన్నమాట…
మరో కీలకాంశం… ఈ రాజధాని బిల్లుకు తెలంగాణకు సంబంధం..!! ఈ సవరణ బిల్లు మొత్తం ఏకపక్షంగా సాగిపోతోంది… ఏపీ పునర్వ్యవస్థీకరణ సవరణ బిల్లు అన్నప్పుడు… అందులో ప్రధాన పార్టీ కదా తెలంగాణ, మరి తెలంగాణకు ఏ సమాచారం లేకుండా… యూనిలేటరల్ ప్రొసీజర్ నడిపించడం ఏమిటి..? వీళ్లు అడగడం, కేంద్రం సరేనని ఆమోదముద్ర వేయడం…
ఎహె, తెలంగాణకు ఏం సంబంధం..? ఏపీ ఇష్యూ ఇది, ఏపీకి మాత్రమే పరిమితం అంటారు కొందరు… కానీ ఏపీ పునర్వ్యస్థీకరణ చట్టం (ఉమ్మడి చట్టం) అంటేనే ఏపీ, తెలంగాణ రాష్ట్రాల ఏర్పాటు గురించి..! దాని సవరణతో రెండు రాష్ట్రాల ప్రయోజనాలు ముడిపడి ఉంటాయి… ఈ రాజధాని నిర్ణయంతో తెలంగాణ ఎఫెక్టెడ్ పార్టీ కాకపోవచ్చు, కానీ పార్ట్ ఆఫ్ దట్ యాక్ట్ కదా అంటారు మరికొందరు…
ఎలాగూ కేంద్రం పాత చట్టానికే సవరణ ప్రతిపాదిస్తున్నప్పుడు… మా తెలంగాణ ఇష్యూస్ కూడా బోలెడు పెండింగ్ ఉన్నాయి, అవీ మేం ప్రస్తావించేవాళ్లం కదా, ప్రత్యేకించి 9, 10 షెడ్యూళ్ల ఆస్తుల పంపిణీ, పాత హామీల అమలు వంటివి ఇదే సందర్భంగా మేమూ లేవనెత్తేవాళ్లం అనేది తెలంగాణ నాయకుల వాదన… అంతేకదా మరి..!!
ఇక్కడ మరో ప్రశ్న ఉంది… పోలవరం ముంపు మండలాల్ని ఏపీకి బదలాయించినప్పుడు తెలంగాణను అడిగారా..? ఆమోదం తీసుకున్నారా..? ఇదీ ప్రశ్న… కానీ మోడీ ప్రభుత్వం ఏర్పాటు కాగానే, అప్పటికి తనకు పార్లమెంటు ప్రొసీజర్స్ మీద అవగాహన లేదు… వెంకయ్యనాయుడు చెప్పగానే పోలవరం మండలాల అప్పగింతకు కూడా ఆ పాత విభజన బిల్లుకే సవరణ చేసి (మోడీ రాగానే ఫస్ట్ బిల్లు) ప్రవేశపెట్టేసి వోకే అనిపించేశారు… అంటే అమరావతి బిల్లు ఆ పాత చట్టానికి రెండో సవరణ అన్నమాట… (అప్పుడూ, ఇప్పుడూ అంతా చంద్రబాబు కోరుకున్న సవరణలే)…
(ఇక్కడ మరో క్లారిటీ… పోలవరం ముంపు మండలాల మీద ఫస్ట్ మే 28 న ఆర్డినెన్స్ జారీ చేశారు… అంటే అప్పటికి రాష్ట్రాలు విడిపోలేదు,.. జూన్ 2 అపాయింటెడ్ డే… అంటే అధికారిక విభజన తేదీ… ఈ ఆర్డినెన్స్ వచ్చేటానికి రెండు రాష్ట్రాల్లేవు, ఉమ్మడి రాష్ట్రమే… రాష్ట్రపతిపాలనలో ఉన్నాయి… జూలైలో బిల్లు పాస్ చేశారు, సెప్టెంబరులో అప్పగింత పూర్తి…)
మరి ఇప్పుడు..? ఆ బిల్లును తెలంగాణకు పంపిస్తారా..? ఇదీ మరో చిక్కుముడి వంటి ప్రశ్న… ఇదే సందర్భాన్ని వాడుకుని తెలంగాణ పెండింగ్ ఇష్యూస్ లేవనెత్తే అవకాశం వస్తుంది… రేవంత్ రెడ్డి ప్రభుత్వం న్యాయనిపుణుల సలహాలు, అభిప్రాయాలు తీసుకోవాలేమో ఇప్పుడు… ఏపీలో, కేంద్రంలో ఎన్డీయే ప్రభుత్వాలు కాబట్టి చంద్రబాబు చెప్పినట్టే నడుస్తోంది… తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం కాబట్టి చెప్పకుండా వదిలేశారా..? అసలు చెప్పాల్సిన అవసరం లేదనే న్యాయసలహా తీసుకున్నారా..? ఈ జవాబులు కూడా అవసరమే…
( డిస్‌క్లెయిమర్... స్థూలంగా పైపైన చూస్తే ఇవన్నీ పెద్ద ఇష్యూస్ కాకపోవచ్చు... కానీ ప్రతిదానికీ ఓ ప్రొసీజర్ ఉంటుంది... అవి పాటించబడ్డాయా అనేదే ప్రశ్న... పైన చెప్పినవి పొలిటికల్, బ్యూరోక్రటిక్, మీడియా సర్కిళ్లలో సాగుతున్న రకరకాల వాదనలు, చర్చలు, అభిప్రాయాలు...వాటి సారాంశమే ఈ కథనం... )
(AI Image)
Share this Article