.
మయసభ ఈ వెబ్ సీరీస్ కొన్నాళ్లుగా సోషల్ మీడియాలో బాగా చర్చనీయాంశంగా ఉంది… ఎందుకు..? కులసమరాలు, చంద్రబాబు- వైఎస్‌ల రాజకీయ ప్రస్థానాన్ని గుర్తుచేసే ప్రధాన పాత్రలు, తెలుగు రాజకీయాలు ఎట్సెట్రా ఉన్నాయి కాబట్టి…
చాలామంది చాలారకాల రివ్యూలు రాశారు, కొందరు ఆహా అన్నారు, ఇంకొందరు ఆబ్బే అనే తేలికగా తీసేశారు… కొందరే ఓ న్యూట్రల్ స్టాండ్‌తో భిన్నంగా తమ అభిప్రాయాల్ని వెలువరించినట్టు అనిపించింది… మిత్రుడు Aranya Krishna రివ్యూ డిఫరెంటుగా బాగుంది… అదే ఇదీ…
Ads
అవాస్తవిక కాల్పనిక మయసభ!
సాధారణంగా బయో పిక్ అంటే ఏదో ఒక వ్యక్తి జీవితం మీద ఆధారపడి తీస్తుంటారు. ఐతే ‘మయసభ’లో ఇద్దరు వ్యక్తుల జీవితాలు వుంటాయి. 1995 నుండి 2009లో మరణించే వరకు వైఎస్సార్, ఈ రోజు వరకు చంద్రబాబు ఏదో విధంగా తెలుగు సమాజాన్ని ప్రభావితం చేస్తూనే వున్నారు. వారిద్దరి వ్యక్తిగత, రాజకీయ జీవితాన్ని బేస్ చేసుకొని తీసిన వెబ్ సిరీస్ గా ‘మయసభ’ మన ముందుకొచ్చింది.
అన్ని బయో పిక్స్ ల్లోనూ మొదట్లో వేసినట్లు ఇందులోని పాత్రలు, పాత్రధారులు, సంఘటనలు పూర్తిగా కల్పితాలనే సేఫ్టీ డిస్క్లెయిమర్ ఈ సిరీస్ కి కూడా వేశారు. ఈ బయో వెబ్ సిరీస్ లో నిజం అనేది ఏమైనా వున్నదంటే అది డిస్క్లెయిమర్లో మాత్రమే వుంది.
వైఎస్సార్, చంద్రబాబుల జీవితాల్లో డ్రామా తక్కువ వుందనుకున్నాడేమో దర్శకుడు ఇష్టం వచ్చినట్లు వాళ్ల జీవితాల్ని మార్చిపారేశాడు. 1975 నుండి 1983 వరకు మాత్రమే ప్రధానంగా కవర్ చేసిన ఈ వెబ్ సిరీస్ లో ఆ నాటి ఎమర్జెన్సీ, 1977 ఎన్నికలు, జనతా పార్టీలో అంతర్గత కీచులాటలు, ఆ ప్రభుత్వ పతనం, మళ్లీ ఇందిరా గాంధీ గెలవడం, ఏపీలో టీడీపీ పార్టీ ఆవిర్భావం, అధికారంలోకి రావడం వంటి వాస్తవిక సామాజిక పరిణామాల నేపథ్యంలో వైఎస్సార్, చంద్రబాబుల జీవితాలతో దర్శకుడు ఇష్టం వచ్చినట్లు ఆడుకున్నాడు.
- ఎంత సినిమాటిక్ లిబర్టీ పేరుతో అయినా జనానికి బాగా తెలిసిన, అభిమానించిన ఇద్దరు నాయకుల జీవితాల్ని ఇంతగా వక్రీకరించవచ్చా అనే చిరాకు పుడుతుంది.
ఏపీలో కులం నిత్య సామాజిక జీవితంలోకంటే రాజకీయాల్లో ఎక్కువగా కనబడుతుంటుంది. మరీ ముఖ్యంగా ఎన్నికల సమయంలో కులం తన విరాట్ స్వరూపాన్ని చూపిస్తుంది. ఒక్క రెడ్డి కులం పేరు తప్ప మరే ఇతర కులం పేరు ప్రస్తావించనప్పటికీ దేవా కట్టా ‘మయసభ’లో దాదాపు మొదటి నుండి చివరివరకు కులం అంశాన్ని స్పర్శిస్తూనే వున్నారు.
“ది స్టోరీ ఆఫ్ ఇండియా ఈజ్ ది స్టోరీ ఆఫ్ క్యాస్ట్” అనే క్యాప్షన్ కూడా ఇచ్చారు మొదటి రెండు ఎపిసోడ్లకి. ఇది చెప్పుకోదగ్గ విషయమే అయినప్పటికీ కులం అసలు స్వభావాన్ని పట్టుకోవడంలో, స్వరూపాన్ని చూపించడంలో దారుణంగా విఫలమయ్యాడాయన.
రెండు అగ్ర కులాల మధ్య ఆధిపత్య పోరాటాన్ని చూపించడమే కులం అనే అంశాన్ని డీల్ చేయడం కిందకి రాదు. రాయలసీమలో రెడ్ల ఆధిపత్యం దృష్ట్యా నాయుడు (కమ్మ) సామాజిక వర్గం బాధిత కులంలా, విజయవాడలో చౌదరి (కమ్మ) సామాజిక వర్గం ఆధిపత్యం దృష్ట్యా కాపు సామాజిక వర్గం బాధిత కులంలా చూపించాడు.
- కులం అంటే వ్యవస్థీకృత భావజాలాల ద్వారా అమలయ్యే సాంఘిక వివక్ష అని, కులం పేరుతో ఓ వర్గం సమాజంలోని సంపద, ఉత్పత్తి వనరుల మీద యాజమాన్యం సంపాదించి కింది కులాల ఆర్ధిక, సాంస్కృతిక, శ్రమ దోపిడీ చేయడమేనంత దూరం దర్శకుడు ఆలోచించలేదు.
జనాలకు బాగా తెలిసిన, వారిచే బాగా ఆదరించబడిన, వారి భావోద్వేగ అనుబంధాన్ని గెలుపొందిన ఇద్దరు పాపులర్ పర్సనాలిటీలను చూపిస్తూ సొమ్ము చేసుకుందామన్న ఆలోచన తప్ప కులం వంటి సంక్లిష్టమైన అంశాన్ని డీల్ చేయగల మేథో సంపత్తి దేవా కట్టాలో కనబడదు.
మసిపూసి మారేడుకాయ చేసిన కథని పదునైన దృశ్యాలలోకి అనువదించగల దర్శకుడి సామర్ధ్యం వల్ల మాత్రమే ఈ వెబ్ సిరీస్ ని మొదలు నుండి చివరి వరకు ఆసక్తిగా చూస్తాం.
టీడీపీలో 1995 ఆగస్ట్ సంక్షోభానికి సంబంధించి కొన్ని సన్నివేశాలున్నప్పటికీ 1975 నుండి 1983 వరకు జరిగినట్లుగా చెప్పిన కథే ప్రధానంగా వుంటుంది. 1970ల చివర్లో జరిగిన ఎన్నికల తరువాతే ఒకరికొకరు పరిచయమైన వైఎస్సార్, చంద్రబాబులకు అంతకుముందే పరిచయం, మంచి స్నేహం వున్నట్లు చూపారు.
వారిద్దరి మధ్య అనుబంధం గురించి దర్శకుడు మరీ ఎక్కువగా ఊహించేసుకున్నాడు. ఇద్దరికీ డ్యూయెట్ పెట్టడం ఒక్కటే తక్కువ అనిపించింది. తండ్రికున్న ఫ్యాక్షన్ బాక్ డ్రాప్ నుండి వచ్చిన వైఎస్సార్ పాత్రను ఫ్యాక్షనిజానికి, రాజకీయ నియంతృత్వానికి వ్యతిరేకంగా నిలబడ్డ ధీశాలిగా, ఆలోచనాశీలిగా చూపిస్తే… చంద్రబాబుని కొన్ని ఆదర్శాలున్న వ్యక్తిగా, సమాజం కోసం ఏదో చేయాలన్న ఆరాటమున్న మనిషిగా చూపించినప్పటికీ ఇంట్లోంచి డబ్బులు కొట్టేసిన వాడిగా, రికార్డింగ్ డాన్స్ పార్టీ ప్రోగ్రాం అరేంజ్ చేసినవాడిగా, ఎమర్జెన్సీ సమయంలో సంజయ్ గాంధీ అరాచకంగా చేయించిన కుటుంబ నియనత్రణ ఆపరేషన్లు నిర్వహించడంలో చురుకైన పాత్ర పోషించినవాడిగా చూపించారు.
- అసలు పెళ్లితో సహా చంద్రబాబు జీవితంలో ప్రతి ముఖ్య ఘట్టంలోనూ వైఎస్సార్ చేయి పట్టుకు నడిపించినట్లు ప్రొజెక్ట్ చేశారు. చంద్రబాబుకి నత్తి వున్నట్లు, వైఎస్సార్ అందించిన స్పీచ్ థెరపీతో దాన్ని జయించినట్లు, చివరాఖరికి వైఎస్సార్ చొరవవల్లే ఎన్.టీ.ఆర్. తన కూతురిని చంద్రబాబుకిచ్చి పెళ్లి చేసినట్లు చూపించారు.చివరాఖరికి 1995 ఆగశ్టులో బాబు ఎన్.టీ,ఆర్, మీద తిరుగుబాటు చేసిన వైస్రాయ్ హోటల్ ఉదంతం సమయంలోనూ బాబు వైఎస్సార్ ని సలహా అడుగుతాడు. పాపం చంద్రబాబు అనిపించింది. (ఇప్పుడున్న కేసులు పెట్టే ఊపు చూస్తుంటే కొంపదీసి చంద్రబాబుని తక్కువగా చూపించినందుకు మేకర్స్ మీద కేసు పెట్టరుగా! జస్ట్ కిడ్డింగ్…)
- నేను ‘అయ్యో పాపం’ అనుకున్న పాత్రలలో ఇందిరాగాంధి కూడా వున్నది. ఆమెకి ఐరావతి బసు అనే బెంగాలీ పేరు ఇచ్చారు. ఆమెని ఆల్మోస్ట్ ఒక వ్యాంప్ గా చూపించే ప్రయత్నం చేశాడు దర్శకుదు. చరణ్ సింగ్ పాత్రని పోలిన అమిత్ సింగ్ తో “ఐ లవ్యూ” చెబుతుంది ఐరావతి. పెళ్లి ప్రపోజల్ కూడా చేస్తుంది. దిసీజ్ రియల్లీ దారుణం కదా!
సమాంతరంగా విజయవాడలో వంగవీటి రాధా, వంగవీటి రంగా, దేవినేని బ్రదర్స్ కథని, అనంతపురం జిల్లాలో పరిటాల రవీంద్ర ఫ్యాక్షన్ నాయకుడిగా ఎదిగిన వైనాన్ని చెప్పారు. పరిటాల రవి ఎపిసోడ్ ని పాథటిక్ గా, ఉద్రేకంగా తీశారు.
ఒక డిస్క్లెయిమర్ చూసేవాళ్ల మొహాన పడేసి ఇష్టం వచ్చినట్లు అడ్డగోలుగా తీయడం క్రియేటీవ్ లిబర్టీ కిందకి వస్తుందా? క్రియేటీవ్ లిబర్టీలో కల్పన పేరుతో బాధ్యతారహితంగా సన్నివేశాల్ని చూపించొచ్చా? క్రియేటీవ్ లిబర్టీ సత్యాన్ని, వాస్తవాన్ని బలపరచేటట్లు వుండాలి కానీ సత్యదూరంగా వుండకూడదు కదా!
నటులు అందరూ బాగా చేశారు. ఆది పినిశెట్టి, చైతన్య రావు సీబీఎన్, వైఎస్సార్ గా బాగా సూట్ అయ్యారు. రామోజీరావుగా నాసర్ తమిళ యాసలో తెలుగు మాట్లాడేస్తాడు. నాదెండ్ల భాస్కర్రావుగా శ్రీకాంత్ అయ్యంగార్ చాలా బాగా చేశాడు. పరిటాల రవిగా రవీంద్ర విజయ్ నటన సామాన్య ప్రేక్షకుల్ని కదిలిస్తుంది. వైఎస్ రాజారెడ్డి పాత్రలో శంకర్ మహంతి నటన చాలా సహజంగా వుంది. “ఆ చల్లని సముద్ర గర్భం… దాచిన బడబాలనమెంతో” పాటని సందర్భోచితంగా వాడుకున్నారు.
తొమ్మిది ఎపిసోడ్లనూ ఆసక్తికరంగా తీశారు. వర్షం పడుతుండగా ఒక మనిషి గుండెల్లో గొడ్డలి దించిన అనంతరం అక్కడే శవం పక్కన కుర్చీ వేసుక్కూర్చొని, అనుచరుడు గొడుగు పడుతుండగా, వేడివేడి టీ తాగి, ఆ తరువాత నింపాదిగా సిగరెట్ వెలిగించే సన్నివేశాల్ని సృష్టించే క్రియేటీవ్ లిబర్టీ దర్శకుడికి ఉన్నప్పుడు వెబ్ సిరీస్ ఎందుకు ఆసక్తికరంగా వుండదూ? అన్నట్లు ఇది సీజన్ వన్ మాత్రమే. అసలు కథ నెక్స్ట్ సీజన్ లో వుంటుంది….. అరణ్య కృష్ణ
Share this Article