.
తోట భావనారాయణ… (99599 40194)…. ఇబ్బంది పెట్టిన ఎన్టీఆర్ మాట
రాజకీయ నాయకులు పత్రికల వాళ్ళతో మాట్లాడుతూ ఒక మాట చెప్పి మళ్ళీ మాట మార్చటం కొత్తేమీ కాదు. టీవీలేని రోజుల్లో అది చాలా పెద్ద సమస్య. అందులోనూ ముఖ్యమంత్రిగా ఉండగా ఎన్టీరామారావు లాంటి నాయకుడు చెప్పిన మాట పతాక శీర్షిక అయ్యాక ఆయనలా అనలేదంటే ఆ రిపోర్టర్ పరిస్థితేంటి?
Ads
మిగతా తెలుగు పత్రికల్లో రాకుండా ఒక పత్రికలోనే వస్తే ఆ రిపోర్టర్ ను ఎడిటర్ నమ్ముతారా? అలాంటి ఇబ్బందికరమైన పరిస్థితి ఎందుకొచ్చింది? ఎలా బైటపడ్డాను అనే విషయాలు చెప్పటానికే ఈ పోస్ట్…
1983, 1985 ఎన్నికల్లో గెలిచిన తెలుగుదేశం 1989 లో ఓడిపోయింది. అయితే, 1994 చివర్లో జరిగిన ఎలక్షన్స్ లో మళ్ళీ భారీ విజయం సొంతం చేసుకుంది. ఆ ప్రచారంలో ఎన్టీఆర్ వెంట లక్ష్మీ పార్వతి కూడా ఉన్నారు. మూడో సారి ఎన్నికల్లో గెలిచిన తెలుగుదేశం ముఖ్యమంత్రిగా 1995 జనవరిలో ఎన్టీ రామారావు ప్రమాణం చేశారు.
చాలా చోట్ల ఘనంగా సన్మానాలు జరిగాయి. లక్ష్మీ పార్వతి ఈ సన్మానాలను బాగా ఆస్వాదిస్తున్నారు. ఆమె సంతోషం ఎన్టీఆర్ ను మరింత సంతోషపరుస్తోంది. ఆ సమయంలో తమిళనాడు ముఖ్యమంత్రి, ఒకప్పడు ఎన్టీఆర్ సరసన హిట్ పెయిర్ గా పేరుబడ్డ జయలలిత నుంచి వీళ్ళకు ఆహ్వానం అందింది.
నిజానికి అప్పుడు మళ్లీ గెలిచి ఉండటంతో జాతీయ రాజకీయాల్లో కూడా ఎన్టీఆర్ ప్రాధాన్యం బాగా పెరిగింది. ఇంకో ఏడాదిలో లోక్ సభ ఎలక్షన్స్ జరగాల్సి ఉండటం, ఎన్టీఆర్ నేషనల్ ఫ్రంట్ ఛైర్మన్ గా ఉండటం కూడా అందుకు కారణాలు.
జయలలిత ఆహ్వానాన్ని మన్నించి మద్రాసు రావటానికి అసలు కారణం ఆమెను కూడా ఫ్రంట్ లోకి ఆహ్వానించవచ్చునని. డీఎంకే అప్పటికే ఫ్రంట్ లో ఉండగా ఒకే ఒరలో రెండు కత్తులు ఇమడటం మీద సహజంగానే జర్నలిస్టులకు ఆసక్తి ఉంటుంది. ఆ ప్రశ్న అడగటం చాలా సహజం కూడా.
జయలలిత ఆహ్వానం మీద మద్రాసు వచ్చిన ఎన్టీఆర్ లక్ష్మీ పార్వతి అక్కడి చేపాక్ లో ఉన్న గవర్నమెంట్ గెస్ట్ హౌస్ లో బస చేశారు. ఉదయం ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టారు. జర్నలిస్టులు చాలామంది హాజరయ్యారు. ఎన్టీఆర్, లక్ష్మీ పార్వతి ఒక పెద్ద సోఫాలో, పక్కనే ఇంకో సింగిల్ సోఫాలో చంద్రబాబు కూర్చున్నారు.
ఎన్టీఆర్ ఎక్కువగా జాతీయ రాజకీయాలు, గవర్నర్ పాత్ర గురించి మాట్లాడారు. అక్కడ లక్ష్మీపార్వతి స్పెషల్ అట్రాక్షన్ అయ్యారు. ప్రెస్ తో ఎన్టీఆర్ మాట్లాడటం దాదాపు పూర్తయిందనిపించగానే తెలుగు రిపోర్టర్లు ఇద్దరు లక్ష్మీ పార్వతి దగ్గరికి వెళ్లారు.
ఆమె స్పెషల్ ఇంటర్వ్యూ కోసం అడుగుతున్నారు. చంద్రబాబు నాయుడి ముఖంలో కొంత అసహనం కనబడుతూనే ఉంది. అప్పుడు తమిళ రిపోర్టర్లు ఒక ప్రశ్న అడగటం, ఎన్టీఆర్ జవాబివ్వటం వెంటనే జరిగిపోయాయి.
ప్రెస్ కాన్ఫరెన్స్ పూర్తయిందన్న సంకేతమిస్తూ చంద్రబాబు ముందుగా లేచి బైటికి అడుగులు వేస్తున్న సమయంలో మా ఫోటోగ్రాఫర్ ఏఎంఆర్ కణ్ణన్ (ఇండియన్ ఎక్స్ ప్రెస్ తరువాత ది హిందూలో చేరి, ఆ తరువాత అమెరికన్ యూనివర్సిటీలో ఎమ్మెస్, పీ ఎచ్డీ పూర్తి చేసి అక్కడే ప్రొఫెసర్ అయ్యాడు) ఆయనను చూపిస్తూ, ఎవరని అడిగాడు.
‘కాబోయే ముఖ్యమంత్రి’ అని నేననగానే ఆయన ఫోటోలు ప్రత్యేకంగా తీయటం మొదలుపెట్టాడు. నా మాట విని చంద్రబాబు నా వైపు చూసి ఒక అరుదైన నవ్వు నవ్వి భుజం తట్టారు. ఈలోపు తమిళ జర్నలిస్టులు ఆ రోజుకు పతాక శీర్షిక దొరికిందన్న ఆనందంలో బయలుదేరి వెళ్ళిపోయారు.
మరునాడు ఉదయం ఈ బృందం హైదరాబాద్ చేరుకుంది. ఆంధ్రప్రభలో వచ్చిన వార్త ముందుగా చంద్రబాబు నాయుడు చూశారు.
ఫ్రంట్ గెలిస్తే ప్రధాని నేనే: ఎన్టీఆర్
ఈ పతాక శీర్షిక చూసి ఉలిక్కిపడ్డారు. ఇలా ఆయన చెప్పుకోవటం ఫ్రంట్ కి మంచిది కాదనేది చంద్రబాబు ఉద్దేశం. అయినా, ఒక పత్రికలోనే ఇలా రావటమేంటి? అసలెప్పుడన్నారబ్బా అని ఆయనే ఆశ్చర్యపోయారు. అదే మాట మా హైదరాబాద్ బ్యూరోలో వాకబు చేశారు.
మద్రాసు నుంచి వచ్చిన వార్త యథాతథంగా వేశామని చంద్రబాబుకు చెప్పిన వాళ్ళు ఊరుకోకుండా, చంద్రబాబు అడిగిన సంగతి ఎడిటర్ వాసుదేవ దీక్షితులు గారి చెవిన వేశారు. పది గంటలకల్లా ఆయన ఫోన్ చేశారు.
“ఏంటి బ్రదర్! ఎన్టీఆర్ అలా అన్నారా, మీకలా అర్థమైందా?” అని అడిగారు. అన్నారని చెప్పా. “మీరు సరిగానే విన్నారా?” అని మళ్ళీ అడిగారు. అవునని చెప్పా. “ఇది మన పత్రిక క్రెడిబిలిటీకీ సంబంధించిన విషయం మరి. సరే, చూద్దాం” అంటూ ఫోన్ పెట్టేశారు.
ఆ వార్తలో శీర్షికతోబాటు లీడ్ లో కూడా ఎన్టీఆర్ మాటలే ఉన్నాయి. వార్త లోపల ఆయన మాట్లాడిన క్రమం ప్రస్తావిస్తూ, “కాంగ్రెస్ కు నేషనల్ ఫ్రంట్ మాత్రమే ప్రత్యామ్నాయమని ఎన్టీరామారావు వ్యాఖ్యానించినప్పుడు ‘మరి ప్రధాని ఎవరు?’ అంటూ విలేఖరులు అడిగిన ప్రశ్నకు ఆయన ఏ మాత్రం తడుముకోకుండా “నేనే” నని సమాధానమిచ్చారు. ఫ్రంట్ ఛైర్మన్ గా తానే కాబోయే ప్రధానినని వివరణ ఇచ్చారు” అని రాశా.
ఈలోపు చంద్రబాబు నాయుడు తాను చేయాల్సిన ఎక్సర్ సైజ్ పూర్తి చేశారు. తమిళ పత్రికలన్నిటిలో కూడా అదే పతాక శీర్షిక అని తెలియటంతో విషయం అర్థమైంది. ఆయన యథాలాపంగా అని ఉండకపోతే వచ్చి ఉండదు కదా అని తనకు తాను సమాధానపరచుకున్నారు. డామేజ్ కంట్రోల్ అవసరమనిపించింది.
ఎన్టీయార్ కి ఈ వ్యవహారమంతా వివరించి జాగ్రత్తగా ఖండన ఇవ్వాలని నచ్చజెప్పారు. ఇదంతా ఆంధ్రప్రభ టీడీపీ బీట్ చూసే సీనియర్ రిపోర్టర్ తో చంద్రబాబు మాట్లాడినట్టు ఆ తరువాత నాకు తెలిసింది. మొత్తానికి ఎన్టీఆర్ తో జర్నలిస్టుల భేటీ ఏర్పాటైంది.
నిజానికి అది రెగ్యులర్ ప్రెస్ కాన్ఫరెన్స్ కాదు. పిచ్చాపాటీ మాట్లాడుతూ.. రిపోర్టర్లు ఆ ప్రస్తావన తెస్తే వివరణ ఇప్పించాలన్నది చంద్రబాబు ఆలోచన. మొత్తానికి ఆ ప్రశ్నతోనే భేటీ మొదలయింది. ఎన్టీఆర్ కి కోపమొచ్చింది. కానీ తాను అనలేదని మాత్రం చెప్పలేకపోయారు.
“మీరు అడిగే ప్రశ్నను బట్టి నా సమాధానం ఉంటుంది. నేషనల్ ఫ్రంట్ అధికారంలోకి వస్తే మీరే ప్రధానమంత్రి అవుతారా అని అడిగితే అవునని చెప్పా. “ అని ఒప్పుకుంటూనే “ప్రధాన మంత్రి ఎవరో నిర్ణయించటానికి ఒక పద్ధతి ఉంది. ఎన్నికల్లో నేషనల్ ఫ్రంట్ గెలవాలి, గెలిచిన భాగస్వామ్య పక్షాలన్నీ నిర్ణయించుకోవాలి. నేనే ప్రధానమంత్రిని అని ఎలా చెబుతాను” అని గందరగోళపు వివరణ ఇచ్చారు. నేరుగా చెప్పినా, ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పినా ఒకటే కదా! మా టీడీపీ బీట్ రిపోర్టర్ ఇచ్చిన వార్త చూశాక ఎడిటర్ గారు శాంతించారు.
ఆరోజు “వారు అడిగారు, నేను చెప్పాను” భవిష్యత్ ప్రధాని వ్యాఖ్యలకు ఎన్టీఆర్ వివరణ అంటూ పతాక శీర్షికగా ప్రచురించింది ఆంధ్రప్రభ.
ఏమైనా, ఆ తరువాత కొద్ది కాలానికే ఎన్టీఆర్ ముఖ్యమంత్రి పదవి నుంచి తప్పుకోవాల్సిన పరిస్థితులొచ్చాయి. నేషనల్ ఫ్రంట్ లో కూడా చంద్రబాబే కీలకమయ్యారు. 1995 ఏప్రిల్ 30 న ఎన్టీఆర్ మద్రాసులో ప్రెస్ తో మాట్లాడినప్పుడు “కాబోయే ముఖ్యమంత్రి” అని చంద్రబాబు నాయుడి గురించి నేను అనటం, సరిగ్గా నాలుగు నెలలకే సెప్టెంబర్ 1న ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణం చేయటం మాత్రం యాదృచ్ఛికం…
Share this Article