‘నెరవేరిన కల’ అనే సినిమా తీసిన దర్శకుడు, నిర్మాత సయ్యద్ రఫీ ఆవేదన తన కోణం నుంచే సాగింది… మన సెన్సారోళ్ల ఘనతలు తెలిసినవే కాబట్టి… చూసీచూడనట్టు ఉండటానికి, వదిలేయడానికి ఏం కథలు పడతారో ఇండస్ట్రీలో చాలామందికి తెలుసు కాబట్టి… సభ్యులుగా ఎంపిక కావడానికి అర్హతలంటూ ఏమీ ఉండవు కాబట్టి…
అసలు సృజన, కళ అనే పదాలకు అర్థాలు కూడా తెలియని వాళ్లు, భాష కూడా తెలియనివాళ్లు కత్తెర్లు పట్టుకుని రెడీగా ఉంటారు కాబట్టి… ఈ నిర్మాత దర్శకుడు చెబుతున్న వాదన నిజమనే నమ్ముదాం కాసేపు… సరే, సదరు సెన్సార్ వాడు నేను చెప్పిందంతా కట్ చేసి పడెయ్ అంటాడు కటువుగా… అందులో హేతువు ఉండదు, జ్ఞానం ఉండదు, కామన్ సెన్స్ అసలే ఉండదు…
పోనీ, అప్పీల్ వెళ్లాలి… అక్కడా ఈ శుద్ధపూసలే కదా… పోనీ, కోర్టుకు పోతే… జాప్యం, వాదనలు, ఖర్చులు… అసలే రోజురోజుకూ తెచ్చిన అప్పుల మీద వడ్డీల భారం, తడిసిమోపెడు… సాహసించి సినిమా తీస్తే ప్రేక్షకుడు ఇచ్చే తీర్పు పక్కన పెట్టండి, అసలు రిలీజుకు ముందే ఉరిపెట్టుకునేలా వేధించే సాధించే ఈ వ్యవస్థల్ని ఎవరు మార్చాలి… ప్రతి చిన్న నిర్మాత మదిలో ఉన్న ప్రశ్నే… గుడ్డి ప్రభుత్వాలు కాబట్టి వాటికి చీమకుట్టినట్టు కూడా ఉండదు…
Ads
అసలు స్క్రీనింగ్‌కు రావడమే లేటు, పరిశీలనలో కొర్రీలు, కాదంటే కత్తెర్లు… సెన్సారోడిది ఏం పోయింది..? కాలిపోయేది నిర్మాతే కదా…
– సామాజిక, రాజకీయ, సాంస్కృతిక, చారిత్రక, ఆర్థిక, సాంఘిక రంగాల్లో పటిష్టమైన అవగాహన లేక సినిమా సెన్సార్‌కి కట్ మీద కట్ చెబితే.. సినిమాకు, సినిమా తీసిన వాడి పరిస్థితి ఏమిటి? ఇది నిర్మాత ప్రశ్న… అక్షరాలా నిజం…
– సెన్సార్ బోర్డ్ ఆఫ్ ఫిలిం సర్టిఫికేషన్ అప్లికేషన్ ఫామ్ దాఖలు చేసి, స్క్రీనింగ్ కోసం క్యూలో మా సినిమాను నిలబెట్టినాము. సుమారు 7 వారాల తర్వాత మే 8వ తారీకు నాడు మా సినిమా సెన్సార్ స్క్రీనింగ్ జరిగింది… ఇది నిర్మాత అభియోగం… ఈ బాధ సహేతుకం…
– స్క్రీనింగ్ కమిటీకి చైర్మన్‌గా వ్యవహరిస్తున్న రీజనల్ ఆఫీసర్ బెంగళూరు నుంచి వచ్చినారు. తెలుగు రాదని ఒక సభ్యుడు చెప్పడంతో నేను ఇంగ్లీషులో చెప్పాను, తెలుగు రానివారు తెలుగు సినిమాను ఎలా అర్థం చేసుకుంటారు..?… నిజం.,. అసలు హిందీ, ఇంగ్లిష్ రాని నిర్మాతలో, దర్శకులో తమ వాదనను ఇలాంటి భాషేతరుల ఎదుట ఎలా వినిపించాలి..? పోనీ, ఇక్కడా లాయర్ల సిస్టం పెట్టండి…
– ఒక అభ్యర్థి తరపున మందు సరఫరా చేసే సన్నివేశంలో ఏదో ఒక బాటిల్‌పై బ్రాండ్ పేరు కనపడిందట, బ్రాండ్ పేరును బ్లర్ చేయమని చెప్పారు… ఇది నిర్మాత చెప్పింది… నిజమే, తప్పేముంది..? బ్రాండ్ల పేర్లు ప్రదర్శించడంపై ఏం రూల్స్ ఉన్నాయో గానీ అవన్నీ అబ్సర్డ్… ఒకాయన పేపర్ చదువుతుంటాడు, దానిపై ఈనాడు అని కనిపిస్తుంటుంది, అది బ్రాండ్ ప్రమోషన్ అవుతుందా..? ఐనా బ్రాండ్ల పేరు ప్రమోట్ చేస్తే తప్పేమిటట… సెన్సార్‌కొచ్చిన నొప్పేమిటట…
– గ్రామీణ స్త్రీలు తను మానాన్ని రక్షించుకోవడానికి ఒక బావిలో దూకినప్పుడు రజాకార్లు ‘డూప్ కే మార్గయి సాలీ సబ్’ అనేది ఓ ఫ్లాష్ బ్యాక్‌లో పదం… ‘సాలి’ పదాన్ని తొలగించమన్నారట… అక్కడ అసభ్యంగా కొంత ధ్వనించవచ్చిందేమో గానీ అదేమీ అశ్లీలం కాదు, బూతు కాదు, పైగా సీన్ ఇంటెన్సిటీని పెంచుతుంది అది…
– సినిమా మొత్తంలో ‘నక్సలైట్’ పదం ఎక్కడున్నా తొలగించమన్నారు… నక్సలైట్ అనే పదం ఏమైనా బూతా..? అదొక పోరాటం, రోజూ కొన్ని వేల వార్తలు ఆ పదంతో వస్తుంటాయి… ఆ పదం వాడితే అది యాంటీ నేషనల్ ఎలాా అవుతుంది..? మీ బుర్రలకు దండాలురా బాబూ…
– సగటు ప్రభుత్వ వ్యవస్థలాగా… ఎన్ని కొర్రీలు వేస్తే, ఎంత సతాయిస్తే అంతగా డబ్బులు రాలతాయి అనే ధోరణా ఇదా..? సినిమాల నిర్మాణానికి, ప్రదర్శనలకు, షూటింగ్ అనుకూల వాతావరణానికి ప్రభుత్వాలు ప్రత్యేకంగా ప్రోత్సాహకాలు ఇవ్వాల్సిన పని లేదు… ఇదుగో ఇలాంటి దిక్కుమాలిన సెన్సారింగ్ వ్యవస్థల్ని ప్రక్షాళన చేస్తే సరి… ఐనా ప్రభుత్వాలు- ప్రక్షాళన అనే పదాలే పెద్ద బూతులు కదా ఈరోజుల్లో..!!
Share this Article