Priyadarshini Krishna…. ఒక బ్యాచ్ ఉంటుంది దేశంలో… ఎక్కడేం జరిగినా దాన్ని పట్టుకొచ్చి మోడీ మెడలో వేసే బ్యాచ్… లేదంటే బీజేపీకి చుట్టడం… బీజేపీ, మోడీ విమర్శలకు అతీతమని కాదు… కానీ అవసరమైన, వాస్తవమైన విషయాల్లో తిడితే ఓ విలువ… కానీ ప్రతి సంఘటనకూ వక్రబాష్యాలు చెబుతూ, అబద్దాలు వ్యాప్తి చేయడం వల్ల ఒరిగేదేముంది..?
ఒకవైపు వాట్సప్ యూనివర్శిటీ అని వెక్కిరిస్తూనే ఉంటారు కాషాయం బ్యాచ్‌ను… మరి యాంటీ వాట్సప్ యూనివర్శిటీ చేసేది ఏమిటి..? అదే పని కదా… కావాలని ఏదో వివాదంలోకి ప్రధానిని, రాష్ట్రపతిని, ఇతర ప్రముఖుల్ని లాగడం… బదనాం చేయడం… ఖాళీగా వున్న సంతకి ప్రతిదీ చర్చే… ప్రతీదీ వివాదమే…..
లేటెస్టుగా రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము పూరి జగన్నాధుని గర్భగుడి గడప బైటనుండే ప్రార్థించుకున్నారనేది వివాదం…. ఈ అజ్ఞానులకు తెలియదు, కనీసం పూరి జగన్నాథుని దర్శించే నియమాలు ఒకసారి చదువుకోరు… తెలుసుకోరు… లేకుంటే అక్కడి పూజారులను ఇంటర్య్వూలు చేసి తెలుసుకొండి తప్ప, ఆమెను అనవసరంగా వివాదంలోకి లాగి వికృతంగా ఆనందపడకండి…
Ads
వాస్తవాల్లోకి వస్తే… విగ్రహాలున్న గర్బగుడిలోకి మామూలు రోజుల్లో అక్కడి అర్చక బ్రాహ్మలైన ‘పాండాలు’ తప్ప ఇతరులకు లోపలికి వెళ్ళే అనుమతి లేదు… చివరకు అనువంశింక పాలకులైన గజపతి రాజుకు కూడా ఆ అనుమతి లేదు. కేవలం ఆషాఢమాసంలో జరిగే రధయాత్రప్పుడు ఉత్సవ ఊరేగింపుకి మూల విరాట్టును బైటకి తెచ్చినప్పుడే ఆ రాజుకైనా స్వామిని తాకే అనుమతి….

అన్నిటికంటే అతి ముఖ్యమైన విషయమేంటంటే- చరిత్ర/ మరియు పూరీజగన్నాథుని స్థలపురాణం ప్రకారం… ఆ జగన్నాథుడు పూరీ పట్టణంలో అవతరించే కంటే ముందే ‘నీలకృష్ణ’గా అప్పటి రాజు కలలోకి వచ్చి, నేను అక్కడ జగన్నాథునిగా ఉండదలిచాను, నన్ను అన్వేషించు అని చెపుతాడు. దాంతో రాజు స్వామి కోసం నలుదిక్కులా వెతుకుతూ ఉంటాడు. కానీ రాజుకు ఎక్కడా స్వామి జాడ కనపడదు.
అలా వెతుకుతూ వెతుకుతూ మయూర్‌బంజ్ ప్రాంతపు అరణ్యానికి వెళతాడు. అక్కడ ఒక అరణ్యవాసికి స్వామి జాడ తెలుసని మనసు చెపుతుంది. వెంటనే అతన్ని ప్రాధేయపడతాడు స్వామిని చూపించమని… కొన్నాళ్ళ తర్వాత స్వామి వున్న గుహకు తీసుకెళ్ళి చూపిస్తాడు అతను… అక్కడ కళ్ళు మిరుమిట్లు గొలిపేలా కనిపించిన దివ్యమంగళ స్వరూపమే జగన్నాధుడు… ఆయన్ని పదిలంగా చూసుకునే ఆ అడవి బిడ్డలే సంతాల్ జాతి ఆదివాసులు.
ఆ సంతాల్ జాతి ఆడబిడ్డే ఇప్పటి మన రాష్ట్రపతి ద్రౌపది… ఆ ఆదివాసీ జనం నుంచి ఈ దేశ అత్యన్నత పదవికి చేరిందామె… చిన్న విషయమేమీ కాదు… మీకు గుర్తుందా..? తనను రాష్ట్రపతి పదవికి బీజేపీ అభ్యర్థిగా ఎంపిక చేసిందనీ, ఎన్నిక కేవలం లాంఛనమే అనీ తెలిశాక ఆమె చేసిన మొదటి పని… తను ఎప్పుడూ వెళ్లే ఓ చిన్న గుడికి వెళ్లి, చీపురు పట్టుకుని, గుడిని శుభ్రం చేసింది… నో అట్టహాసం, నో ఆడంబరం, నో ప్రచారం…
ఆమధ్య పూరి వెళ్లినప్పుడు కూడా కాన్వాయ్ వదిలేసి, ఒక్కతే రెండు కిలోమీటర్లు నడుస్తూ, తోటి భక్తులకు అభివాదం చేస్తూ, ఓ సాధారణ భక్తురాలిలా గుళ్లోకి వెళ్లింది… చిన్నాచితకా నాయకులే వికట పటాటోపాలు చూపించే ఈరోజుల్లో కూడా ఆమె దగ్గరకు అలాంటి లక్షణాలు చేరలేదు… డౌన్ టు ఎర్త్… విజ్ఞత కలిగిన లేడీ…
చివరకు అలాంటి మహిళను కూడా ‘బజారు వివాదం’లోకి లాగి, శుష్క ప్రచారాలకు దిగడం అజ్ఞానమే… ఎవరి దగ్గర నుండి మనం జగన్నాథున్ని తెచ్చుకున్నామో ఆమెకే అంటరానితనం ఆపాదించి చర్చలు పెట్టుకుంటున్నారు అప్రాచ్యులు… అప్పట్లో రాష్ట్రపత్ని అని ఒకరు కించపరిచారు కదా… ఈ చర్చ కూడా అలాంటిదే…
బీజేపీ మంత్రులు ధర్మేంద్ర ప్రదాన్, అశ్విన్ వైష్ణవ్‌లను మాత్రం గర్భగుడిలోకి అనుమతించి, రాష్ట్రపతిని మాత్రం బయటే నిలబెట్టి అవమానించారు అనేది ఈ చర్చల సారాంశం… అయితే దీనికి మంత్రి ధర్మేంద్ర ప్రదాన్ వివరణ ఇచ్చాడు… ‘‘రథయాత్ర బయల్దేరే సమయంలో విశిష్ట అతిథులతో పూజలు చేయిస్తారు… అలా పూజలు చేయించిన అతిథులే గర్భగుడిలో ఆవాహన పూజలకు, దానిలో ప్రవేశించడానికి అక్కడి రూల్స్,ప్రొటోకాల్ అనుమతిస్తాయి…
రాష్ట్రపతి ఆ సమయానికి చేరుకుని ఉంటే ఆమెనూ గర్భగుడిలోకి పిలిచేవాళ్లు… అక్కడికీ ఓ కుర్చీ తెప్పించి, గర్భగుడి వాకిలి దగ్గర కూర్చోవాలని చెప్పాం, ఆమె నిరాకరించింది… బయటే నిలబడి భక్తిగా పూజను చూస్తూ ఉండిపోయింది… అందరికీ తెలుసు కదా, ఆమె పూరి జగన్నాథుడికి పరమ భక్తురాలని, చివరకు ఆమె అల్లం వెల్లుల్లి కూడా తీసుకోదు… అందుకే గర్భగుడి దగ్గర నియమాలను నిష్టగా పాటించింది…’’
Share this Article