మంచి ప్రతిభ కలిగిన నటీనటులు, దర్శకులు, ఇతర టెక్నిషియన్స్… అంతర్జాతీయ స్థాయి వెబ్ ప్లాట్‌ఫారమ్ నెట్‌ఫ్లిక్స్… సంకల్ప్‌రెడ్డి, నందినీరెడ్డి, తరుణ్‌భాస్కర్, నాగ్అశ్విన్ తమను తాము ప్రూవ్ చేసుకున్నవారే, కొత్త ట్రెండ్స్, కొత్త కథాంశాల్ని టచ్ చేసినవాళ్లే… రొటీన్ ఫార్ములాల నుంచి బయటికొచ్చి ఆలోచించగలరు… మంచు లక్ష్మి, శృతిహాసన్, జగపతిబాబు వోకే, కానీ అమలాపాల్ ప్రతిభ కలిగిన నటే… మరి వీళ్లంతా కలిపి వండిన ఓ వెబ్ వంటకం ఎందుకిలా ఏడ్చింది…? ఏ సెన్సార్ పరిమితులూ లేని… ఏ వాణిజ్య పరిమితులూ లేని… ఏ సోకాల్డ్ సభ్య, సంస్కార చట్రాలు లేని విశృంఖల వేదికను అప్పగిస్తే… జస్ట్.., బూతులు, హగ్గులు, కిస్సులు, కామం, కాంక్ష, అక్రమ సంబంధం, అసాధారణ బంధం, బరితెగింపు, లాజిక్ రాహిత్యం దట్టించిన నాలుగు హాట్ బెడ్ కథల్ని అలా చుట్టేసి ప్రేక్షకుల మీదకు వదిలారెందుకు..? ఓహ్, ఇదేనా నెట్‌ఫ్లిక్స్ స్టాండర్డ్, ఓహో, ఓటీటీ ఒరిజినల్ అంటేనే బూతా..? అనే భావనను ప్రేక్షకుల్లో క్రియేట్ చేశారెందుకు..? అసలు ఈ దర్శకుల రియల్ స్టాండర్డ్ ఇదేనా..? అవును, ఈ డిస్కషన్ అంతా నెట్‌ఫ్లిక్స్ విడుదల చేసిన పిట్టకథలు అనే అంథాలజీ సినిమా గురించే…
అసలు అంథాలజీ ప్రయోగం అంటేనే ఒక కథాసంకలనం… ఫీచర్ ఫిలిమ్ అంటే అది ఓ నవల… దానికీ దీనికీ తేడా ఉంటుంది… ఏ కథకు ఆ కథే… కలిపి చూడొద్దు… సేమ్ థ్రెడ్ ఉండాల్సిన అవసరం కూడా లేదు… మరి నాలుగు కలిపి కుట్టడం దేనికి..? ఇదీ ప్రశ్న… ఇదీ విమర్శ… నిజం… ఏ కథకు ఆ కథను విడిగా చెప్పేందుకు ఒక కామన్ పేరుతో వెబ్ సీరిస్లాగా ప్రయత్నించొచ్చు కదా… కానీ ఓటీటీ భాష వేరు… ఓ పెద్ద కథను సీరియల్‌గా పార్టులుపార్టులుగా చెప్పడానికి వెబ్ సీరిస్… నాలుగైదు కథల్ని ఒకేచోట కుట్టేసి చూపించడానికి అంథాలజీ… రెండింట్లోనూ సేమ్… బయట వెండితెర మీద కట్టిపడేసే బంధాల్ని, పరిమితుల్ని వదిలించుకుని… బోల్డ్నెస్ చూపించడం… అలాంటి కథల్నే ఎంపిక చేసుకోవడం… అక్షరాలా వాస్తవం… ఈ నలుగురు దర్శకులూ ఆ భ్రమలో ఉండిపోవడమే ఈ పిట్టకథలు రెట్టలు వేయడానికి ప్రధానకారణం… వాళ్లు తప్పులో కాలేసింది ఇక్కడే… కానీ ప్రేక్షకులు ఊహించింది, అంచనా వేసుకున్నది వేరు… కొత్తతరం దర్శకులు కదా, ఇంకేదో కొత్తదనం ఆశించారు… ఈ సింక్ కుదరలేదు… అందుకే పిట్టకథలు నిరాశపరిచింది…
Ads
నిజానికి ఈ కథల్లో నటనాపరంగా మెరుపుల్లేవ్, దర్శకత్వపరంగా ఛమక్కుల్లేవ్… కథలో లీనం చేసి, ఆసక్తిగా కట్టిపడేసే కథనాల్లేవ్… పాపం శమించుగాక… ఎవరో అసిస్టెంట్లకు తమ బాధ్యతలు అప్పగించేసి, తమ పేర్లను వాడుకోవడానికి దర్శకులు పర్మిషన్ ఇచ్చినట్టుగా ఉంది… ఈ కథలకు, ఈ ట్రెండ్‌కు పేరేదైనా సరే, కనీసం ఆ కథల్నయినా కాస్త కన్విన్సింగుగా చెప్పడానికి ట్రై చేయొచ్చుగా… అదీ లేదు… ఎప్పుడైనా జీ5 యాప్ వాడి యాడ్స్ చూడండి, తమ సీరియళ్లలోని పదీపదిహేను హాట్ సీన్లను కలిపి ఓ పెద్ద ప్రోమో కట్ చేసినట్టుగా… అలాంటివి చూడటానికే మా యాప్ ఉపయోగకరం అని చెబుతున్నట్టుగా ఉంటయ్… మరిక ఈ దర్శకులూ అదే ట్రాపులో పడటంలో ఆశ్చర్యం ఏముంది..? అయితే పూర్తి నిరాశ అక్కర్లేదు… పెదవివిరవాల్సిన పెసిమిజమూ పనికిరాదు… ఇప్పుడే కదా, పెద్ద పెద్ద తారల్నీ వెబ్ ప్లాట్‌ఫారమ్ వాళ్ల ప్రపంచాల నుంచి, థియేటర్ల మాయల నుంచి బయటికి లాక్కొస్తోంది… రాబోయే రోజుల్లో థియేటర్లు ఉండవు… ఆ నిజం అందరికీ అర్థమవుతోంది… లేటయినా సరే ఎవరైనా రావల్సిందే… అందుకే ఇది ఓ సంధి దశ… కాబట్టే ఈ బోల్డ్ ప్రేలాపనలు, హాట్ వేషాలు, చిల్లర్ కథలు… ఒకసారి కుదురుకున్నాక ఇలాంటి చిల్లర్ కథలే కాదు… మనల్ని స్మార్ట్ తెరకు కట్టిపడేసే ఆలోచనాత్మక కథనాలూ పలకరిస్తాయి… స్కోప్ ఉంది, స్పేస్ ఉంది, అవసరం కూడా ఉంది…!
Share this Article