చెప్పేవాడికి వినేవాడు లోకువ… రాసేవాడికి చదివేవాడు లోకువ… సినిమావాడికి ప్రేక్షకుడు లోకువ… హీరోకు, హీరోయిన్‌కు ప్రజలందరూ లోకువ…… పూజా హెగ్డే అనబడే ఓ పొడుగు కాళ్ల సుందరి తెలుగు సినిమాల్లో కూడా నటిస్తుంటుంది… తెలుసు కదా… అల వైకుంఠపురంలో ఆ కాళ్ల దగ్గరే సిరివెన్నెల, అల్లు అర్జున్, తమన్, త్రివిక్రమ్ పొర్లుదండాలు, పొగడదండలు… దాన్నలా వదిలేస్తే…
నిన్న రాధేశ్యామ్ సినిమా ప్రమోషనల్ ప్రెస్‌మీట్‌లో ఆమె చిలుక పలుకులు ఆశ్చర్యాన్ని, నవ్వును పుట్టించాయి… అఫ్‌కోర్స్, కాసింత జాలి కూడా..! ఆ సినిమాలో ప్రేరణ అనే పాత్ర ఈమెది… బహుశా డబుల్ యాక్షన్ కావచ్చు… ఓ జ్యోతిష్కుడి ప్రియురాలు… సరే, ఆ సినిమా కథ జోలికి వెళ్లే పనిలేదు గానీ… తన పాత్ర గురించి చెబుతూ… ‘‘చాలా భిన్నమైన పాత్ర ఇది… నా నిజజీవితంతో ఏమాత్రం సంబంధం లేని పాత్ర, చాలా షేడ్స్ ఉంటయ్… నాకు నేనే కొత్తగా కనిపించాలి…
అందుకే ప్రేరణ కోసం చాలా రీసెర్చ్ చేశాను… ఆ పాత్రను అర్థం చేసుకోవడానికి చాలా టైం పట్టింది… కొన్ని పుస్తకాల్ని చదివా… నా చుట్టూ ఉన్న అమ్మాయిల్ని, వాళ్ల వేషధారణ, మాట్లాడే విధానం గమనించాను… కథకు, నా పాత్రకు సంబంధం లేని విషయాలపై కూడా దృష్టి పెట్టాను… ఏ రూపంలో అయినా నాకు ప్రేరణ కలిగించే విషయాలు దొరుకుతాయో అన్వేషించాను.. అన్నీ ఆకళింపు చేసుకున్నాకే కెమెరా ముందుకు వచ్చాను…’’
Ads
…. ఇలా సాగిపోయింది ఆమె ధోరణి… అందుకే మనం ముందే చెప్పుకున్నాం కదా… వీళ్లకు సగటు ప్రేక్షకుడు ఎప్పుడూ లోకువే… పాన్ ఇండియా హీరో పక్కన నటిస్తోంది కాబట్టి పాన్ ఇండియా హీరోయిన్ అనిపించుకుంటున్న ఆమెతో ఏమిటేమిటో చెప్పించారు సదరు సినిమా ప్రమోషన్ టీం… నాలుగు గంభీరమైన పదాల్ని వదిలితే చాలు, ఈ ఎడ్డి ప్రేక్షకులకు అర్థమైతే కదా అనుకున్నట్టున్నారు… అసలు ఆమె ఏం చెప్పిందో ఆమెకైనా అర్థమైందా..? ఆ సినిమాలో పాటల కంటెంటులాగే ఉంది ఈ ప్రెస్‌మీట్ కూడా… (తన కెరీర్‌లో ఒక్కటంటే ఒక్కటైనా గుర్తుపెట్టుకోదగిన పాత్ర ఏమైనా చేసిందా ఈమె..? గుర్తురావడం లేదు…)
డాక్టర్‌ను కాబోయి యాక్టర్‌నయ్యాను, ఓ డాన్స్ షోలో చూసి నిర్మాత ఒత్తిడి చేశాడు, కథ డిమాండ్ చేసేసరికి అలా నటించాల్సి వచ్చింది… ఇలాంటి పిచ్చి వ్యాఖ్యల్ని చిన్నప్పటి నుంచీ చదివి నవ్వుకుంటున్నాం… ఇప్పుడు ఇది కొత్తదనం… ఓ సినిమాలో ఓ పాత్ర… ఆ పాత్ర స్వభావమేమిటో రచయిత చెబుతాడు, దర్శకుడు చెబుతాడు… అవసరమైతే నటించి చూపిస్తాడు… ఆమెకు ఎలాగూ తెలుగు రాదు, డబ్బింగ్ చెప్పే పని కూడా లేదు… దానికి రీసెర్చ్ ఏమిటో, పుస్తకాల్ని చదివి వడబోయడం ఏమిటో, చుట్టూ ఉన్న అమ్మాయిల్ని గమనించి నేర్చుకోవడం ఏమిటో…
అదేమైనా చరిత్రలో రికార్డ్ చేయబడిన పాత్రా..? కాదు కదా… ఈ సినిమా కథ కోసం క్రియేట్ చేసిందే కదా… మరి ఏం రీసెర్చ్ చేసినట్టు..? ఏ పుస్తకాల్లో ఆ పాత్ర దొరికినట్టు..? ఏం జీర్ణం చేసుకున్నట్టు..? దీనికి చుట్టూ ఉన్న అమ్మాయిల్ని చదవడం దేనికి..? ఆమె చెప్పింది… ప్రమోషనల్ ప్రెస్‌మీట్ కదా… రాయకతప్పదు, అదేదో పాత్రికేయ బాధ్యత, వృత్తినిబద్ధత అయినట్టుగా… అక్షరమక్షరం అచ్చు గుద్ది పాఠకులపైకి వదిలాయి పత్రికలు… ప్చ్, కొన్నిసార్లు అక్షరశుద్ధి లేని రాజకీయ నాయకులే నయమేమో కాస్త..!! మన ఖర్మకు హీరోలే కాదు, హీరోయిన్లూ తయారయ్యారా…!! అదేదో సినిమాలో ప్రకాష్‌రాజ్ పాపులర్ డైలాగ్ ఉంది… ‘ఇవే… కాస్త తగ్గించుకుంటే మంచిది…’’
Share this Article