Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

అనువాద పాటలకు అర్థం…? సింపుల్..! ఏ అర్థమూ లేని పైత్యమే…!!

August 9, 2025 by M S R

.

తెలుగు సినిమా పాటల్లో సాహిత్యం, పైత్యం ఎట్సెట్రా మాట్లాడుకుంటున్నాం కదా తరచూ… ఆమధ్య వచ్చిన ధనుష్ సినిమాలో ఓ పాట గురించీ చెప్పుకుందాం… ఏదో సెర్చింగులో హఠాత్తుగా కనిపించింది…

పాముల్లోనా విషముంది…
పువ్వులోన విషముంది…
పూలను తల్లో పెడతారే!
పామును చూస్తే కొడతారే!

Ads

…. హఠాత్తుగా చదివితే కవిత్వమో, పైత్యమో అర్థం గాక.., అరె, ఇది రాసింది ఎవడుర భయ్ అని ఆ మనిషి కోసం అర్జెంటుగా వెతకాలనిపిస్తదా లేదా..? పాముల్లోనా విషముంటది, పువ్వులోన విషముంది అట… పూలను తల్లో పెడతారు, పామును చూస్తే కొడతారేమిటోయ్ అని గట్టిగా నిలదీస్తున్నాడు ఈ కవి…

ఫాఫం, చంద్రబోస్… గతంలో ఏం రాశాడో, ఇప్పుడెందుకు ఇలా తయారయ్యాడో మనం జుత్తు పీక్కోనవసరం లేదు… తనెప్పుడూ అంతే… ఏం రాస్తాడో తనకే తెలియదు చాలాసార్లు… క్లిక్కయితే తన ఘనత… తను రాసిన ఈ పాట కూడా అలాగే అనిపించడం లేదా..? అసలు స్ట్రెయిట్ గీతాలే గమ్మత్ ఉంటయ్… ఇక అనువాద గీతాలు..? ఇదుగో ఇలాగే ఉంటయ్…

ఏవో ట్యూన్లలో నాలుగు తెలుగు పదాలను ఇరికిస్తే, ఆ వాయిద్యాల మోతలో ఈ వాక్యాలు వినేవాడు ఎవడు..? అర్థాలు వెతికేవాడు ఎవడు..? సబ్ కుచ్ చల్తా… కనీసం మనకు కూడు పెడుతున్న భాషకు, పాటకు మర్యాద, గౌరవం ఇవ్వాలి కదా అంటారా..? భలేవారే, సినిమా ఇండస్ట్రీలో అలా ఆలోచిస్తే ఒక్కరోజు కూడా ఎవరూ ఒక్కపాట కూడా రాయలేడు…

పువ్వులు అనగానే పరిమళం గుర్తుకురావాలి, మకరందం గుర్తుకురావాలి… పువ్వు అనేదే పుప్పొడిని మోసుకొచ్చే జీవులను ఆకర్షించే ఒక సౌందర్యం… సృష్టికార్యానికి ముందుగానే ముస్తాబయ్యే ఏర్పాటు పూలసొగసు… మరి ఈ అస్కారుడేమిటి, పువ్వుల్లోనా విషముంది అంటాడు…? లింక్ 

పామును, పువ్వును పోలుస్తాడేమిటి..? రెండూ విషపూరితాలే అంటాడేమిటి..? కొంపదీసి కవిత్వంలో ఎవరికీ అర్థంగానంత మార్మిక ఎత్తులకు ఎదిగిపోయాడా చంద్రబోస్..? అరె, చెప్పనేలేదు కదూ… సినిమా పేరు ‘నేనే వస్తున్నా’…

సోకాల్డ్ భారీ పాన్ ఇండియా సినిమా ‘పొన్నయిన్ సెల్వన్’కు ఒకరోజు ముందే రిలీజయ్యాడు ధనుష్ ఈ సినిమాతో… తమిళ హీరోలందరి సినిమాల్ని తెలుగు ప్రేక్షకుల మీద కూడా రుద్దడం ఆనవాయితీ కదా… సో, చకచకా డబ్బింగ్ చేసిపారేసి, మన మీదకు వదులుతుంటారు… అదుగో ఆ సినిమాలోనిదే ఈ పాట…

‘నానే వరువెన్’ (Naane Varuven Movie) అనేది ఒరిజినల్ తమిళ సినిమా…. దీనికి సెల్వ రాఘవన్ దర్శకత్వం… సంగీత దర్శకత్వం యువన్ శంకర్ రాజా… ఇద్దరికీ తెలుగు రాదు… ఇంకేముంది..? గీత రచయిత ఏది రాస్తే అదే తెలుగు…

‘ఒకే ఒక ఊరిలోనా…
రాజులు ఏమో ఇద్దరంటా!
ఒక్కడేమో మంచోడంట…
ఇంకోడేమో చెడ్డోడంట!
చిక్కని చీకటి లేకుంటే…
చంద్రుని వెలుగే తెలియదులే!
రక్కసుడు ఒక్కడు లేకుంటే…
దేవుని విలువే తెలియదులే!

బాగుంది, చిన్నపిల్లలకు నీతికథ చెబుతున్నట్టుగా… మొదట్లో రెండుమూడు వాక్యాలు సరళంగా… పర్లేదు… చీకటి లేకపోతే చంద్రుడి విలువ ఏం తెలుస్తుంది..? రాక్షసుడు లేకపోతే దేవుడి విలువ ఎలా తెలిసేది..? అంటున్నాడు… పర్లేదు… ఎటొచ్చీ… ఆ తరువాతే చంద్రబోస్ ఎటెటో వెళ్లిపోయాడు… అంతేలే, తమిళం నుంచి తెలుగుకు దాదాపు ప్రతి పాటా ఇదే రీతి… పైగా చంద్రబోస్… ఇంకేముంది..? ఇదే గతి…

మనిషిలో మృగమే దాగుంది…
మృగములో మానవత ఉంటుంది!’

మనిషిలో మృగమే దాగుంది… నిజమే… మనిషే ఒక మృగం అనుకుందాం… మళ్లీ దానిలో మానవత దాగి ఉండటమేంటి..? మనకు మనమే సమాధానం చెప్పుకోవాలి ఇక… ఆ కథానాయకుడి తత్వాన్ని చెబుతున్నాడేమో అని..! హీరోలో మృగం ఉంది, కానీ దాంట్లో మానవత ఉందీ అని…! ఇదెక్కడి పైత్యంరా బాబూ అనిపిస్తోందా..?

అనువాద భూతాల్ని ఆదరిస్తున్నాం కదా… అరవ జనానికి అలా అలుసైపోయాం… ఇదీ అంతే… అనుభవిద్దాం… ఆస్వాదిద్దాం…!! యూట్యూబ్‌లో సరిగమ కంపెనీవాడు ఈ వీడియో పెట్టాక ఇప్పటికి 9.65 లక్షల మంది దేకారు ఈ వీడియోను… !!

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • ‘‘ఒక్క పోలీసు లేకుండా ఆర్ట్స్ కాలేజీకి వస్తా… నాకు ధైర్యం ఉంది…’’
  • సీన్ ఛేంజ్..! నాడు ఎంట్రీపై నిరసన… నేడు సీఎం హోదాలో ఘన స్వాగతం…
  • నో తుర్కియే, నో అజర్‌బైజాన్… ఇప్పుడిదే ట్రెండ్… ఎందుకంటే..?!
  • కంగాళీ వెన్నెల..! బాపు చేతులెత్తేశాడు… కెమెరా వీఎస్ఆర్ స్వామి ఫ్లాప్…!!
  • తెలంగాణ ప్రజల చెవుల్లో కేంద్ర బీజేపీ ప్రభుత్వం క్యాబేజీ పూలు..!!
  • జీవనపోరాటం… మానవ సంబంధాలన్నీ జస్ట్, మనీబంధాలే…
  • పాపం బమ్మెర పోతన ప్రాజెక్టు… ఎక్కడికక్కడ ఆగి ఏడుస్తోంది…
  • ప్రకృతి సౌందర్యానికి ప్రతీక… సముద్రపు ఒడిలో తేలియాడే గ్రామం..!
  • ఓ చిక్కు ప్రశ్న… పీటముడి… మీరేమైనా విప్పగలరా..? చెప్పగలరా..?
  • ఓహ్… కేటీయార్ ప్రేమించిన కంచె ఐలయ్య కాంగ్రెస్ సలహాదారా..?!

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions