చివరకు ఈటీవీ భారత్ కూడా సగటు యూట్యూబ్ చానెల్ అయిపోనట్టు అనిపించింది ఆ వార్త చూశాక… అమిగోస్ అని కల్యాణరామ్ సినిమా ఒకటి వస్తోంది తెలుసు కదా… దానికి ప్రిరిలీజ్ ఈవెంట్… అంతకుముందు జూనియర్ వచ్చి బింబిసార ప్రిరిలీజ్‌లో నాలుగు మంచి మాటలు మాట్లాడాడు కాబట్టి అది సూపర్ హిట్ అయిందనేది ఓ సెంటిమెంట్… సో, నిర్మాతలు మైత్రి మూవీస్ ఈ ప్రిరిలీజ్‌కూ రమ్మన్నారు… కల్యాణరామ్ సినిమాా కాబట్టి కాదనలేడు…
మరోవైపు తారకరత్న చావుబతుకుల్లోనే ఉన్నాడు… ఇంకోవైపు తనకే అనారోగ్యం… దాంతో జూనియర్ అయిష్టంగానైనా, తప్పనిసరై ప్రిరిలీజ్ ఈవెంట్‌లో పాల్గొన్నాడు… ‘నిలబడలేకపోతున్నా, ఎక్కువ మాట్లాడలేను, హెల్త్ బాగాలేదు, కాస్త నన్ను మాట్లాడనివ్వండి’ అని తనే చెప్పుకున్నాడు… ఈ సందర్భంగా తను సీరియస్‌గా ఉన్నాడు… నిజంగానే జూనియర్ ఎన్టీయార్‌లాగా లేడు… ఈలోపు ఫ్యాన్స్ కేకలు, నీ తదుపరి సినిమా ఎప్పుడు చెప్పు, చెప్పు అంటూ…
సుమ హోస్ట్… మామూలుగా ఆమె గెస్టులను, సినిమా ముఖ్యులను హర్ట్ చేయదు… పరిణతి కలిగిన సినిమా హోస్ట్, సినిమా వాళ్ల ఫంక్షన్లలో హై హిపోక్రసీ ఆమెకు తెలుసు కాబట్టి సినిమా ఫంక్షన్లలో ఎలా మాట్లాడాలో తెలుసు… అందుకే ప్రతి సినిమాకు ఆమెనే ప్రిఫర్ చేస్తుంటారు… ఆమె కూడా మీ తరువాత సినిమా గురించి అప్‌డేట్ కావాలట ఫ్యాన్స్‌కు, ఇదుగో తను మాట్లాడుతున్నాడు, తనే అప్‌డేట్ ఇస్తాడు అంటూ మైక్ ఇచ్చింది… అందులో ఆమె చేసిన తప్పేముంది..? అక్కడ ఉన్న మూడ్ అది… మూడ్‌కు తగినట్టు హోస్టింగ్ చేయకపోతేనే తప్పు…
Ads
అసలే జూనియర్ అనారోగ్యంతో, ఈ ఫంక్షన్ మీద అయిష్టంగా ఉన్నాడు కదా… సుమ వైపు ఓసారి సీరియస్ లుక్కు ఇచ్చి, వాళ్లు అడక్కపోయినా నువ్వే చెప్పించేట్టున్నావ్ కదా… అంటూనే తన ప్రసంగంలో రోజురోజుకూ గంటగంటకూ అప్‌డేట్స్ ఏమిస్తాం? ఇవ్వాల్సినవి ఉంటే ముందుగా మా భార్యలకన్నా ముందే మీకు చెబుతాం, మీరు ఒత్తిళ్లు తీసుకురాకండి అని కోరాడు… బాగుంది… అదేసమయంలో ఈనెలలో కొబ్బరికాయ కొట్టి, వచ్చే నెలలో కొత్త సినిమా షూటింగే స్టార్ట్ చేస్తామనీ, వచ్చే సంవత్సరం ఏప్రిల్‌లో రిలీజ్ చేస్తామని వెల్లడించాడు…
మరిక సుమ చేసిన తప్పేముంది..? ఎలాగూ జూనియర్ ఆ అప్‌డేట్ ఇవ్వాలని అనుకున్నదే కదా… ఇదే సందర్భం అని తనే అంటున్నాడు కదా… కానీ ట్యూబర్లు, ఈటీవీ భారత్ సహా అనేకానేక సైట్లు రెచ్చిపోయి… సుమపై జూనియర్ సీరియస్ అంటూ రకరకాల థంబ్ నెయిల్స్ పెట్టేసి వార్తలు కుమ్మేశారు… ఓ వంద వార్తలు కనిపించాయి… అవన్నీ చదివితే ఇక జూనియర్ సుమను జీవితంతో క్షమించడు అన్నట్టుగా ఉన్నాయి… ఈటీవీ వాడయితే స్టేజీ మీదే సుమను ఏదో అంటాడని అందరికీ భయమైంది అని రాసిపారేశాడు…
మరిచిపోతే ఎలా..? సుమ దాదాపు జూనియర్ కుటుంబసభ్యురాలు… అంత చనువు ఉంది జూనియర్‌తో… బామ్మ, ఆంటీ అని జూనియర్ సుమను ఆటపట్టించేంత సాన్నిహిత్యం ఉంది… రాజీవ్ కనకాల జూనియర్‌కు థిక్కెస్ట్ ఫ్రెండ్… సుమపై ఒకవేళ కాస్త సీరియస్‌గా చూసినా పెద్ద ఫరక్ పడదు… మళ్లీ వెంటనే సుమ ఇంటికి వెళ్లి భోజనం చేసి వచ్చేంత తాత్కాలిక కోపాలు అవి… తమ ఇంటి ఆడపడుచుగా భావిస్తాడు ఆమెను… అంతెందుకు, వచ్చే ‘సుమ అడ్డా’ షో ఈ అమిగోస్ సినిమాకు ప్రమోషన్ షో… పైగా అమిగోస్ ప్రిరిలీజ్ ఫంక్షన్‌లో ఆమె ఉద్దేశపూర్వకంగా గానీ, అనాలోచితంగా గానీ తప్పు ఏమీ చేయలేదు… ఏమిటో ఈ వార్తలు..?!
Share this Article