ప్రతి అంశంలోనూ ప్రధాని నరేంద్రమోడీకి మద్దతుగా ఉండే పార్టీ వైెఎస్సార్సీపీ… ఆ పార్టీ అధికార పత్రిక, పార్టీ అధినేత సొంత పత్రిక సాక్షి… దానికి అనుబంధంగా ఓ న్యూస్ వెబ్‌సైట్… కానీ అందులో ఏం రాస్తున్నారో, ఏం కంటెంట్ వస్తున్నదో చూసుకునేవాళ్లు లేకుండా పోయారు… ఫాఫం జగన్… విషయం ఏమిటంటే… ఓ వార్త వేశారు… ‘‘ఏడాదిలో భారీగా పెరిగిన ప్రధాని మోడీ ఆస్తులు’’ దాని హెడింగ్ ఇదే… వీటినే దిక్కుమాలిన వార్తలు అంటుంటారు…
మోడీ కార్పొరేట్ ప్రియుడు, కార్పొరేట్ కంపెనీల కోసం ఏ విధానమైనా సరే తీసుకురాగలడు… అది అందరికీ తెలుసు… కానీ తన వ్యక్తిగత జీవితానికి వచ్చేసరికి తనను వంకపెట్టడానికి పెద్దగా ఏమీ ఉండదు… భార్యను చిన్నప్పుడే వదిలేయడం అనే ఆ ఒక్క మరక తప్ప… అదీ పూర్తిగా వ్యక్తిగతం… ప్రజల కోణంలో దానికి పెద్ద ప్రాముఖ్యత లేదు…
సొంత అన్నదమ్ములు కాదు కదా, ఒక్క బంధువునూ తన అధికార పరిధిలోకి రానివ్వడు… తన పేరును ఎవరూ వాడుకున్నా ఊరుకోడు… పబ్లిసిటీ, ఫోటోలు, ఖరీదైన దుస్తులు తప్ప తనమీద వ్యక్తిగత బురద జల్లడానికి ఏమీదొరకదు తన ప్రత్యర్థులకు… తనకు అప్పుల్లేవు… స్థిరాస్తుల్లేవు… ఉన్న ఓ రెసిడెన్షియల్ ప్లాటునూ విరాళం ఇచ్చేశాడు… వాహనాల్లేవు… ఇల్లు లేదు… వచ్చిన జీతం వచ్చినట్టు పోస్టాఫీసు నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్లు, ప్రభుత్వ రంగ బ్యాంకు డిపాజిట్లలో పెట్టేస్తాడు… వాటిపై వడ్డీ ప్లస్ నెలనెలా జీతంతో సమకూరిన ఆస్తే మోడీ ఆస్తి… కనీసం ఏ కార్పొరేట్ కంపెనీలో కూడా షేర్లు కొనలేదు… వేరే పెట్టుబడుల్లేవు…
Ads
ఏడాదిలో తన మొత్తం ఆస్తి 1.97 కోట్ల నుంచి 2.23 కోట్లకు పెరిగింది… అంటే 26 లక్షలు పెరిగింది… తన వేతనమే 34 లక్షల వరకూ ఉంటుంది, డిపాజిట్లపై వడ్డీలు కూడా కలిపితే నిజానికి పెరిగి ఉండాలి… ఐనా 26 లక్షలు పెరుగుదలలో భారీతనం కనిపించింది సాక్షికి… దీన్ని చదివి వన్ ఇండియా, ఎన్టీవీ సైట్లు కూడా అలాగే గీకిపడేశాయి… గొప్పలు చెప్పుకునే ఏబీఎన్ వాడయితే ‘‘మోదీ ఆస్తులు తెలిస్తే షాక్ తింటారు’’ అని ఓ మురికి హెడ్డింగ్ పెట్టి ఏదో వీడియో కొట్టింది… అసలు బుర్రల్ని పనిచేయనిస్తే కదా… సాక్షి వాడిది మరీ ఎంత పైత్యమంటే… ఏడాదిలో 26 లక్షల నుంచి 2 కోట్లకు పెరిగిపోయాయ్ ఆస్తులు అని సబ్‌హెడింగ్ కూడా పెట్టేశాడు…
13 ఏళ్లు గుజరాత్ వంటి ధనిక రాష్ట్రానికి ముఖ్యమంత్రి, ఎనిమిదేళ్లుగా ఈ దేశానికి ప్రధాని… 71 ఏళ్ల వయస్సులో తన అధికారిక ఆస్తి ప్రస్తుతం 2.23 కోట్లు… ఒక హెడింగ్ పెట్టేటప్పుడు, తన ఆస్తుల వివరాలు రాస్తున్నప్పుడు ఈ అంశాలైనా మననంలో ఉంచుకోవాలి కదా… సాక్షి పత్రికలో వచ్చిన వార్త కాస్త నయం… మరీ వెబ్‌సైట్ స్థాయిలో అరాచకంగా ఏమీ లేదు… కానీ వార్తలో ఒకటీరెండు అంశాలు మరీ నవ్వొచ్చేలా ఉన్నయ్…
గత ఏడాదితో పోల్చి చూస్తే తన చేతిలో ఉన్న డబ్బులు తగ్గిపోయాయట… అదేమిటయ్యా అంటే… గత ఏడాది తన దగ్గర 36,900 రూపాయలు ఉండగా, ఇప్పుడు జస్ట్, 32,250 రూపాయలే ఉన్నాయట… హహహ… వారెవ్వా, ఏం ప్రొఫెషనలిజం సారూ..?! దిప్రింట్ వాడైతే ప్రధానికి ఒక్కొక్కటీ 45 గ్రాముల చొప్పున నాలుగు ఉంగరాలున్నాయి, వాటి మొత్తం విలువ 1.48 లక్షల నుంచి 1.73 లక్షలకు, అంటే 16 శాతం పెరిగిందని రాశాడు… అవేం రాతలో..!
నిజానికి నాలుగు ఉంగరాలు కలిపి మొత్తం బరువు 45 గ్రాములు… అంటే 4.5 తులాలు… ప్రజెంట్ రేట్ల ప్రకారం 1.73 లక్షలుగా చూపించారు… కానీ ఒక్కొక్కటీ 45 గ్రాములు అంటే మొత్తం 18 తులాలు… అంటే కనీసం 9 లక్షలు… 1.73 లక్షలకు 9 లక్షలకు నడుమ ఎంత తేడా..? చివరగా… ఒక వ్యక్తి ఆస్తి కోటి రూపాయల నుంచి కోటిన్నరకు పెరిగితే అది ఏకంగా 50 శాతం పెరుగుదల… మరో వ్యక్తి ఆస్తి 100 కోట్ల నుంచి 110 కోట్లకు పెరిగితే జస్ట్, 10 శాతం మాత్రమే పెరుగుదల… ఆస్తి పెరుగుదలను శాతాల్లో చూద్దామా..? స్థూల విలువలో చూద్దామా..?!
Share this Article