Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

హమ్మో… ఈ కన్యాశుల్కం తిట్ల వెనుక ఇంతలేసి అర్థాలున్నాయా..?

February 20, 2024 by M S R

కనుమరుగైన ‘కన్యాశుల్కం’ తిట్లు’…… By Jayanthi Chandrasekhararao

“నన్ను సప్త వెధవని చేశావు” అంటాడు రామప్పంతులు మధురవాణితో! ‘సప్త వెధవ’ అనేది సామాజిక చరిత్రకు సంబంధించిన పదం. పురుషుణ్ణి స్త్రీ ఎంచుకుంటుంది కాబట్టి అతనికి వరుడు అనే పేరొచ్చింది. స్త్రీ అలా వరులను ఏడుసార్లు మార్చుకోవచ్చు. ఏడోసారి కూడా స్త్రీ అతణ్ణి వరించకపోతే అతణ్ణి ‘సప్తవెధవ’ అంటారు. ( రాంభట్ల కృష్ణమూర్తి ‘వేల్పుల కథ)

” నీ ఇంట కోడిని కాల్చా” అంటాడు అగ్నిహోత్రవదాన్లు. ‘మీ ఇంట పీనుగెళ్ళా! అనే తిట్టు లాంటిదే ఇది. పూర్వం కొన్ని కుటుంబాల్లో ఎవరైనా చనిపోతే కోడిని శవం చుట్టూ ముమ్మారు తిప్పి ఆ తరువాత కాల్చేవారు. అనంతరం దాని తీసుకుపోయేవారు

“నా సొమ్మంతా ‘ఘటాశ్రాద్ధపు’ వెధవల పాలవుతుంది” అని లుబ్దావధాన్లు, “రేపు ఇంటికి వెళుతూనే ‘ఘటాశ్రాద్ధం’ పెట్టేస్తాను” అని అగ్నిహోత్రావధాన్లు వేరువేరు సందర్భాల్లో తిడతారు. ఘటం అంటే కుండ. శ్రాద్ధం అంటే పితృదేవతలను ఉద్దేశించి చేసే దానం మొ॥ కార్యాలు. శ్రాద్ధకర్మలు మొత్తం 10 . అవి ఏకోద్దిష్ట , నిత్య, దర్శ, మహాలయ, సపిండి లేక సపిండీకరణ, తీర్థ, నాందీ, హిరణ్య, ఆమ, ఘట. చివరిదైన ఘటశ్రాద్ధం గురించి “పతితుడైనవాడుప్రాయశ్చిత్తానికి ఒప్పుకోకపోగా, అతని జ్ఞాతులు బతికి ఉండగానే అతనికి ప్రేతకార్యం జరిపి, ఒక కుండను నీటితో నింపి, దాసితో దానిని తన్నించి నీటిని ఒలకపోయించడం అనే అపరకర్మ. ‘ఘటనినయం’ అని తెలుగు అకాడమీ వివరించింది.

Ads

“దండుముండా’* అని తిడతాడు రామప్పంతులు పూటకూళ్ళమ్మని, ‘దండు’ అంటే ‘సమూహం’ అని అర్ధం. దండుముండ అంటే ‘బజారుముండ’ అని అర్ధం చెప్పాయి కొన్ని నిఘంటువులు.

మధురవాణి “ఏం నంగనాచివే!” అంటుంది ఆడపిల్లవేషంలో ఉన్న కరటకశాస్త్రి శిష్యుడితో. ‘నంగనాచి’ అంటే సామర్థ్యం ఉండి కూడా ఏమీ తెలియనట్టు ఉండటం’ అని కొన్ని నిఘంటువుల్లో ఉంది. కానీ “అందరితోనూ ప్రేమకలాపాలు సాగించే పడుచు” అని తెలుగు అకాడమీ నిఘంటువు సూచిస్తోంది. అసలు ఇది హిందీ నుంచి వచ్చిందని పరిశోధకుల అభిప్రాయం. ‘నంగా’ అంటే ‘నగ్నం’ అనీ, ‘నాచ్‌’ అంటే నృత్యం అనీ అర్ధాలు ఉన్నాయి. సిగ్గు విడిచి నగ్నంగా నృత్యం చేయడం సాహసమే కాబట్టి ‘సిగ్గు విడిచినది’ అని చెప్పే సందర్భంలో ఈ తిట్టు వాడుకలోకి వచ్చి ఉంటుందని సురవరం ప్రతాపరెడ్డి గారు ‘శబ్దాల ముచ్చట’ అనే వ్యాసంలో వివరించారు.

‘ధగిడీకె’ అని కరటక శాస్త్రి నోట వెలువడిన తిట్టు ఉర్దూ పదం. గోదావరి జిల్లాలో ‘గయ్యాళి’ అని తిట్టడానికి ఈ మాట వాడేవారు. నీచస్త్రీ, దుష్టుడు అని ఈ మాటకు అర్ధం. సి.పి.బ్రౌన్‌ కాలం నాటికి కూడా ఈ పదం వాడుకలో ఉందేమో! jade, slut, wretch అనే ఇంగ్లిష్‌ అర్థాలు ఇచ్చాడు తన నిఘంటువులో. కానీ ఈనాడెక్కడా ఈ  పదం వాడుకలో వినిపించదు.

“భష్టాకారిముండా!”* అని తిడతాడు లుబ్ధావధాన్లు తన కూతుర్ని (మీనాక్షిని). ఈ మాటకు రెండర్థాలున్నాయి. “భష్టాకారి’ అనేది భ్రష్ట అనే రూపం నుంచి వచ్చింది. భ్రష్టుడు = వెలివేయబడ్డవాడు అని అర్థం. ఈస్కమ్మునిటెడ్ అన్నాడు బ్రౌన్ . హిందీలో భ్రష్ట అంటే పతిత అనే అర్ధం ఉంది.

వితంతువుని పెళ్ళాడానేమో అని ఆందోళన చెందుతున్న లుబ్ధావధాన్లుతో “ఎందుకీ తంబళ అనుమానం?” అంటుంది మీనాక్షి.  సురవరం ప్రతాపరెడ్డి గారు తంబల జాతి వారు పూర్వం గ్రామాలలో తమలపాకులనిచ్చే వృత్తిలో ఉండేవారని అన్నారు. సి.పి.బ్రౌన్‌ “బ్రాహ్మణ స్త్రీ యందు బ్రాహ్మణునికి దొంగతనం చేత పుట్టి, ఆగమాలు చదివి శివార్చన చేసే ద్విజుడు” అన్నారు. ( A man of mixed caste, descended from a female brahmi, by adultery with a man of the same tribe. A brahmin who officiates in the temple of Sova) “తంబళ అనుమానం” అనేది జాతీయం.

“అభాజనుడా!” అని తిడతాడు రామప్పంతులు లుబ్ధావధాన్లుని. ఈ తిట్టు ఇపుడెక్కడా వాడుకలో వినిపించదు. అయోగ్యుడు. అసమర్ధుడు అని ఈ మాటకి అర్ధం jade, slut, wretch అనే ఇంగ్లిష్ అర్ధాలిచ్చాడు బ్రౌన్.

“ఇలాంటి  ‘చాడీకోర్‌’ కబుర్లు చెప్పడానికి యవడికి గుండె ఉంది” అంటాడు గిరీశం రామప్పంతులుతో. “చారీ ఖోర్‌” అనే ఉర్దూ పదం దీనికి మూలం. salanderer, a tale bearer, కొండెగాడు, చాడీ కత్తె a busy body, a girl that tells tales అని వివరించాడు బ్రౌన్‌.

“మధురవాణి ‘సిగ్గోసిరి’ దాన్ని వదిలేస్తాను” అంటాడు రామప్పంతులు. వీళ్ళమ్మా ‘శిఖాతరగా’ అంటాడు అగ్నిహోత్రావధాన్లు. ఈ రెండు తిట్లూ ఒకటే. నాటకంలో చాలా సందర్భాల్లో వస్తాయి. “దీని సిగతరగా’ అనేది ఈనాటి వ్యవహార రూపం. సిగ్గోసిరి (సిగ+కోసిరి) అన్నా, శిఖ తరగడం అన్నా, సిగతరగా అన్నా శిరోముండనం అనే అర్ధం. అంటే భర్త చనిపోయినపుడు పూర్వకాలం కొన్ని కుటుంబాలలో స్త్రీలకి జరి గేతంతు. ఎదుటి స్త్రీ మీద కోపం వచ్చినపుడు వాడే శాపనార్థంవంటి తిట్టు. కొన్నిసందర్భాలలో ఊతపదంగా కూడా కనిపిస్తుంది.

“వాడు (గుంటూరు శాస్త్రి) ‘పంచాళీ మనిషి’ అనడానికి సందేహం ఏమిటి? అంటాడు రామప్పంతులు లుబ్ధావధాన్లుతో. “పంచాళీ అంటే వదరుబోతు, వాచాలుడు, గయ్యాళి అనే అర్ధాలున్నాయి. ప్రస్తుతం వాడుకలో వినిపించని తిట్టు ఇది.

“ఈ రామప్పంతులు కథ ‘ పైన పటారం లోన లొటారం’ లా కనిపిస్తుంది” అంటుంది స్వగతంగా మధురవాణి. ‘పటారం’అసలు రూపం ‘పటీరం’. చందనం అని దీనికి అర్ధం. ‘లొటారం’ అంటే రంధ్రం, బిలం అనే అర్థాలున్నాయి. పైపై మెరుగులే తప్ప లోపల శూన్యం అనే అర్ధంలో దీన్ని సామెతలా వాడుతుంటారు…

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • జంధ్యాల నెలవంక… చూసింది నేల వంక… ఐననూ ఆదర్శ ప్రయోగమే…
  • బోలెడు క్షుద్ర రాజకీయ వివాదాలు… ఈ మూడే రియల్ గేమ్ చేంజర్స్…
  • గంజాయ్..! ఇదొక వరమూలిక..!! ఇన్నేళ్లూ మనమే కాలదన్నుకున్నాం..!!
  • మహిళకు ఒకరికన్నా ఎక్కువ మొగుళ్లు..! చట్టబద్ధం చేస్తే ఎలా ఉంటుంది..?!
  • పాకిస్థాన్ కకావికలం… ఇప్పటికే చావుదెబ్బ… సిందూరం భగభగ…
  • ఈ యుద్ధంతో అశాంతి కాదు… శాంతి కోసమే ఈ యుద్ధం… ఇలా…
  • అంబానీ కదా… చివరకు యుద్ధ చిహ్నాన్ని కూడా హైజాక్ ప్రయత్నం…
  • యుద్ధమంటే… విజయమో, పరాజయమో మాత్రమే కాదు..!
  • పాకిస్థాన్‌కు కుడిఎడమల వాయింపు… చైనా అమ్మిన సరుకు తుస్సు…
  • విశాఖ గ్యాస్ లీక్‌కు ఐదేళ్లు… ఒక్క జర్నలిస్టయినా ఫాలోఅప్ చేశాడా..?!

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions