.
‘మా కోడలు నీళ్లు పోసుకుంది… పోవాలె…’ ఆ ఖంగుమన్న మాటలు వెంటనే కనెక్టయిపోయి పక్క క్యూ వైపు చూశాను… అది హైదరాబాద్ ఎయిర్‌పోర్టు ఇమిగ్రేషన్ క్యూ… పోతున్నది ఖతర్ ఎయిర్‌లైన్స్‌లో… పోయేది అమెరికా… సో, ఇమిగ్రేషన్…
తెలిసినవాళ్లు ఆమెను గేటు దగ్గర దింపిపోయారు… పోర్టర్‌ను పిలిచింది, లగేజీ అప్పగించింది… గేటు దగ్గర పాస్‌పోర్టు, టికెట్ ప్రింటవుటు చూపించడంతో ఆమె జర్నీ స్టార్టయింది… ఎయిర్‌లైన్స్ కౌంటర్‌లోని ఎవరో అమ్మాయి అచ్చ తెలుగులో మాట్లాడింది ఆమెతో…
Ads
చెక్ ఇన్ బ్యాగుల్లో ఏం ఉన్నాయని అడిగింది… ‘ఏది పడితే అది తీసుకురానివ్వరు’ అని చెప్పింది… ‘ఫోన్‌లో నా కొడుకు చెప్పిండు, ఏం ఉండొద్దో… గసుంటియి ఏం పెట్టలేదు బిడ్డా, కారపప్పాలు, బట్టలు, చేత్తో కుట్టిన ఖుల్లాలు, కొన్ని ఇప్ప లడ్లు, రెండు తొక్కులు, ఇంకేమీ లెవ్వు’ అని బదులిచ్చింది ఈమె…
కాస్త పైకి ఎగువగట్టిన ఇందిరమ్మ చీరె, సింపుల్ జాకెట్, బొట్టు లేదు, గాజుల్లేవు, కాళ్లకు కాస్త మందంగా ఉన్న పట్టీలు, మెడలో ఓ సన్నని గొలుసు, కాళ్లకు షూస్, కొత్తగా కొన్నట్టుంది… అంతే, అచ్చ తెలంగాణ అమ్మలా రూపం…
ఇమిగ్రేషన్ దగ్గర… ‘గిట్లనే పోతవా?’ మన పిల్లాడిలాగే ఉన్నాడు… ‘పోత, ఏమైతది?’ అందీమె… ఒక్కదానివే ఎట్ల పోతవు?… నీ వయస్సు ఆడోళ్లు అతియార్లు పట్టుకుని ఇమానాల్లో ఎగురుకుంట యుద్ధం చేస్తున్నరు, నేను అమెరికా పోయి రాలేనా?’ ధాటిగా బదులిచ్చింది…
తనూ సరదాగానే ‘అమెరికాలకు రానియ్యకపోతే ఎట్ల మల్ల? నీకు ఇంగ్లిష్ రాదాయె, చదువుకోనట్టు కనిపిస్తున్నవ్’ అన్నాడు… ‘ఏమైతది? వాపస్ పంపిస్తరు, గంతేగదా, ఉరేయరు కదా, చాలామంది గిట్ల పోతున్రు, వస్తున్రట కదా… ‘సరేగనీ, ఎందుకు పోతున్నవు, ఏం చూస్తనని బయల్దేరినవ్?’
‘ఏం లేదు సారు, నా కోడలు నీళ్లు పోసుకుంది, దేశం కాని దేశం. ఎవ్వలు సాయం లేకపోతెే ఎట్ల సారూ? పోత…’ అని చెప్పిందామె… అక్కడ కనెక్టయింది నాకు, గమనిస్తున్నాను, నిజమే, వీల్ చైర్ ఫెసిలిటీ వాడుకుంటూ చాలామంది ఒంటరి మహిళలు, ప్రత్యేకించి అంతకుముందు ఫ్లయిట్ల మొహం చూడనివాళ్లు కూడా అమెరికా, బ్రిటన్ వెళ్లొస్తున్నారు…
ఈమె భాష, ఈమె మాట, ఈమె రూపం… ఆమె మాటల్లో ధ్వనించే పట్టుదల, ధైర్యం భలే నచ్చేశాయి… బోర్డింగ్ దగ్గర వెయిటింగ్ కుర్చీల్లో ఎవరితోనో మాటలు కలుపుతూ మళ్లీ కనిపించింది… ‘ఎవలన్నా తెలుగు తెలిసినోళ్లు దొరుకుతరేమో అని చూస్తన్న, ఉర్దూ సమజైతది, ఇంకెవలూ దొరకలే’ అని చెప్పింది నాతో…
‘నువ్వు గూడ అమెరికాకేనా సారూ’ అనడిగింది… ‘అక్కడికే, కానీ దోహ వరకే మనిద్దరం ఒక్క విమానంలో, తరువాత నీ విమానం వేరు’ అని చెప్పాను… ‘ఏ ఊరు మీది’ అనడిగా… ప్యూర్ తెలంగాణ అని తెలుస్తూనే ఉంది… ‘మేడారం తెలుసు కదా, సమ్మక్క జాతర, దాని పక్కన చిన్న ఊరు, అడివిల ఉంటది’ అని చెప్పింది…
వావ్… భాష తెలియదు, రూపం మారలేదు, ఆదివాసీ, దేశం కాని దేశం, ఒక్కతే బయల్దేరింది… దండకారణ్యపు మహిళాప్రతీక… పేరు సమ్మక్క అట, కొడుకు జంపన్న… మొగుడు సారయ్య చనిపోయి పదేళ్లయింది… అందరిలెక్క మనం, మనకేం తక్కువ, ఇక్కడ కాదు, అమెరికల కొలువు చేయాలె అని పోయిండట కొడుకు…
నీతాన గంతఘనం పైసలున్నయా, కొడుకును అమెరికాల చదివించేంత? అనడిగాను… స్కాలర్ షిప్పులు, ఫీజు రీయింబర్స్‌మెంట్లతోనే ఏదో హన్మకొండ కాలేజీలో ఇంజినీరింగ్ చదివాడట… ఎవరో తెలిసిన టీచర్, ఈమె జమానత్ ఇస్తే బ్యాంకోళ్లు లోన్ ఇచ్చారట, కొంత సర్కారు సాయం చేసింది, అదేదో స్కీమ్ ఉందట… చదువుతుంటూనే ఏదో కంపెనీలో కొలువొచ్చిందట… చెప్పుకొచ్చింది ఆమె…
చదువుకునేటప్పుడే ఎవరో అమ్మాయితో ప్రేమ, అమెరికాలో కూడా ఒకే దగ్గర చదువుకున్నారట… ‘కొత్తగూడెం దగ్గర ఊరు మా కోడలోళ్లది… గౌండ్లోళ్లు… ఎవరైతే ఏంది? రెండేండ్లాయె, పెండ్లి చేసిన, నీళ్లు పోసుకుంది, ఆమె అవ్వయ్య బగ్గ ముసలోళ్లు… అందుకే నేనే పోతన్న’ చెప్పింది… ‘గీ టైంల గాకపోతే ఎప్పుడు? నేనన్న లేకపోతే ఎట్ల, అందుకే బయల్దేరిన…’
‘ఏం చేయాలె, ఫోన్‌ల చెప్పుతనే ఉన్నడు మావోడు, ఇమానం కూసున్నప్పుడు తప్ప ఎప్పటికీ పనిచేస్తదట, పైసలేసిండట, తక్లీపయితే ఫోన్ చేస్త, ఎప్పటికప్పుడు వాడు చేస్తనే ఉన్నడు…’ వావ్ అనిపించింది… ఎవరైనా ఏమైనా అడిగితే తాను పంపించిన ఇన్విటేషన్ లెటర్, పాస్‌పోర్టు, బోర్డింగ్ పాస్ చూపించు, ఎవరైనా ఇటు వస్తున్నారేమో అడిగి చూడు, ఎవరో ఒకరు కనిపిస్తారు అని చెప్పాడట కొడుకు… ఎలాగూ వాషింగ్టన్ ఎయిర్‌పోర్టుకు తనే వస్తాడు పికప్ కోసం…
‘పెండ్లి కోసం ఒచ్చినప్పుడు పాస్‌ఫోటువ, వీసా తీయించిండు’ అని చెప్పింది… నిజమే, దోహాలో దిగగానే ఎయిర్‌హోస్టెస్‌కు ‘వీల్ ఛైర్’ అని చెప్పింది… వాళ్లే తీసుకుపోయి, అమెరికా వెళ్లే విమానంలో కూర్చోబెట్టారు… విమానంలో ఆమె సీటు మధ్య వరుసలో… నాదేమో టెయిల్ ఎండ్‌లో… ‘విమానంల పెట్టేది తినలేవు, ఎట్ల మరి’ అనడిగా…
నవ్వింది అడవి తల్లిలెక్క… ఇంటి దగ్గరే సన్నగా ఒత్తుకున్న గోధుమ రొట్టెలకు మామిడితొక్కు రాసి, రోల్స్‌గా చేసుకుని ఓ డబ్బాలో పెట్టుకొచ్చుకుంది… పాస్‌పోర్టు, బోర్డింగ్ పాసులు ఓ చిన్న బ్యాగులో పెట్టుకుని, చెక్కుడు సంచీలాగా నడుంలో దోపుకుంది…
దోహాలో వీల్ ఛైర్‌లో కూసుని ‘పొయ్యొస్త సారూ’ అన్నది నన్ను చూసి… ‘నిమ్మళంగా పోయిరా…’ అన్నాను స్టిల్ ఆమెను అబ్బురంగా చూస్తూ… అంతరిక్షంలో వెళ్లిన మహిళా వ్యోమగామిలాగే అనిపించింది నాకైతే…
(కల్పన ఏమీ లేదు, అంతా నిజమే… నేనే సరిగ్గా అక్షరబద్ధం చేయలేకపోయానేమో… గలగల ఆమె మాటలు ఇంకా చెవుల్లో వినిపిస్తూనే ఉన్నయి)… అవును మరి, కోడలు నీళ్లుపోసుకున్నప్పుడు అత్త అమ్మలా మారి, అమెరికాకు ఏమిటి? అంతరిక్షంలోకైనా వెళ్లుంది… మరి మేడారం సమ్మక్క కదా…)
Share this Article