సాధారణంగా ప్రధాన మీడియాలో ఒక్కో పార్టీ గురించి ఏయే సైజుల్లో వార్తలు వస్తే… జనంలో ఆ పార్టీకి ఆ సైజులకు తగ్గ ఆదరణ ఉంది అనిపిస్తుంది … వార్తల సైజులను బట్టి ఎన్నికల్లో ఆ పార్టీ పరిస్థితి ఎలా ఉంది, ఎన్ని సీట్లు రావచ్చు అనే అంచనాకు వస్తారు . పాఠకులే కాదు.. రాజకీయ నాయకులు, చివరకు జర్నలిస్ట్ లు కూడా ఇదే అంచనాతో ఉంటారు .
ఓ ఏడాది క్రితం మీడియా బిజెపికి హైప్ ఇచ్చింది . తెలంగాణలో అధికారంలోకి వచ్చేది బీజేపీనే అని సూచించే స్థాయిలో ఆ వార్తలు ఉండేవి . మీడియా + రాజకీయ నాయకుడైన వి6 వివేక్ వెంకటస్వామి లాంటి వారు బిజెపిలోకి , బిజెపి నుంచి కాంగ్రెస్ కు ఇలా అనేక పార్టీలు మారింది ఇలాంటి వార్తల హైప్ వల్లనే .
మీడియా కలిగించే ఈ హైప్ లో చివరకు మీడియా కూడా పడిపోతుంది . చిత్రంగా మేధావులపై ఈ హైప్ ప్రభావం తీవ్రంగా పడి తమ రాజకీయ భవిష్యత్తుపై నిర్ణయం తీసుకుంటారు . కానీ ఓటర్లపై ఈ హైప్ ప్రభావం తక్కువే అనేక సందర్భాల్లో తేలింది . తాము సృష్టించిన వార్తలను నమ్మి మీడియా తామే బోల్తా పడుతోంది కానీ జనం పెద్దగా లెక్కలోకి తీసుకోవడం లేదు .
Ads
మద్య నిషేధ ఉద్యమ సమయంలో స్పోర్ట్ పేజీ మినహా ఈనాడు మొత్తం మద్య నిషేధ వార్తలతో నిండిపోయేది . ఉమ్మడి రాష్ట్ర జనాభాను మించి రాష్ట్ర జనాభా మద్య నిషేధ ఉద్యమంలో ఉన్నారు అనిపించేది . జోనల్ పేజీ , జిల్లా పేజీ , మెయిన్ పేజీ.. ఎక్కడ చూసినా జనం తండోపతండాలుగా మద్య నిషేధ ఉద్యమంలో పాల్గొన్నారు అనిపించేది ఈనాడు చదివితే .. అది మీడియా సృష్టించే మాయాజాలం . మద్యానికి వ్యతిరేక ప్రచారం , మద్యం తాగడం వల్ల ఆరోగ్యం ఎలా పాడవుతుందో మీడియా ప్రచారం చేయాలి . దానివల్ల ఎంతో కొంత ప్రయోజనం ఉంటుంది . కానీ అక్కడ ఆ ప్రచార ఉద్దేశం ఒక పార్టీని ఓడించి ఒక పార్టీని గెలిపించడం … నిజానికి నిషేధ సమయంలో ఉమ్మడి రాష్ట్రం నుంచి మందు తాగడానికి ఉద్యమ స్థాయిలో పొరుగు రాష్ట్రాలకు వెళ్లారు . సరిహద్దుల్లో మద్యం షాప్స్ వెలిశాయి , ఎందరినో సంపన్నులను చేశాయి .
*******
ప్రధానమైన టివి మీడియా , ప్రింట్ మీడియాలో ఎంఐఎం పార్టీ వార్తలు అస్సలు కనిపించవు. గత రెండేళ్ల నుంచి షర్మిల పార్టీ వార్తలు కొన్ని మీడియాల్లో ఆమెనే సీఎం అన్నట్టుగా ప్రచారం చేశాయి . జగన్ ను వ్యతిరేకిస్తూ , బాబును అభిమానించే మీడియా కూడా జగన్ సోదరి పార్టీని ఆకాశానికి ఎత్తారు . చివరకు పోటీ చేస్తే డిపాజిట్ ఎక్కడా రాదు అని తెలిసి ఆమె పోటీ చేయడం లేదు , ఆమె పార్టీ పోటీ చేయడం లేదు .
షర్మిల పార్టీకి ఇచ్చిన ప్రచారంలో ఏడు సీట్లు గెలిచే mim కి ఒక్క శాతం ప్రచారం కూడా ఇవ్వలేదు . ఇక్కడ ఉద్దేశం ప్రచారం ఇవ్వడం లేదు అని కాదు . మీడియాలో లభించే ప్రచార సైజు చూసి పార్టీలను అంచనా వేయవద్దు అని చెప్పడమే . అదే బీజేపీ వార్తలు చూస్తే ఏడాది క్రితం వరకు వాళ్లే అధికారంలోకి వస్తారేమో అన్నంతగా మీడియాలో ప్రాధాన్యత లభించింది . గత ఎన్నికల్లో mim కు ఏడు సీట్లు వస్తే బీజేపీకి వచ్చింది ఒకే ఒక సీటు . కానీ మీడియాలో ఈ రెండు పార్టీలకు వచ్చిన వార్తలను పోలిస్తే అసలు సంబంధమే ఉండదు .
ఎన్నికల నోటిఫికేషన్ కూడా రాకముందే ఏడు స్థానాలు mim కు వదిలేసి మిగిలిన సీట్ల గురించే ఏ పార్టీ ఐనా ఆలోచించాలి . పోలింగ్ కు ముందే ఫలితాలు తేలిపోయే నియోజకవర్గాలు ఇవే . గత ఎన్నికల్లో తెలంగాణలో మీడియా వార్తల ప్రకారం చూస్తే మహాకూటమి గెలుస్తుంది అని , ఆంధ్రలో టీడీపీ అని మెజారిటీ మీడియా వార్తలతో హోరెత్తించింది . తాము గెలవాలి అని కోరుకున్న పార్టీ గెలుస్తుంది అని మీడియా చెబుతోంది కానీ ఎవరు గెలుస్తారో చెప్పడం లేదు .
****
2012-13 సమయంలో అసెంబ్లీ సమావేశాలు జరుగుతుండగా లాబీలో చర్చ . అప్పుడు హైదరాబాద్ లో ఇండియన్ ఎక్స్ ప్రెస్ లో పనిచేసే జర్నలిస్ట్ మిత్రుడు శాస్త్రి ఇక తెలంగాణ ఉద్యమం ముగిసిపోయినట్టే కదా ? అని నన్ను కవ్విస్తున్నట్టు అడిగాడు . ఉద్యమం ఒకసారి ఉదృతంగా సాగుతుంది . పత్రికల నిండా అవే వార్తలు.. ఆ ఉదృతి చూసి వారంలో తెలంగాణ ఇచ్చేస్తారు అనిపిస్తుంది . కొంత కాలం స్థబ్దంగా ఉండేది, ఆ సమయంలో మీడియాలో సైతం వార్తలు కనిపించవు . దాంతో తెలంగాణ ఉద్యమం అయిపొయింది అనుకునేవారు .
మీడియాలో వచ్చే వార్తల సైజును బట్టి తెలంగాణపై నువ్వు అంచనాకు వస్తున్నావు . మీడియాలో వార్తల సైజుతో సంబంధం లేదు . తెలంగాణ ఏర్పడేంత వరకు తెలంగాణ అంశం ఉంటుంది అనీ, వార్తల సైజుకు నిర్ణయాలకు సంబంధం ఉండదు అనీ చెప్పాను . సమైక్యాంధ్ర ఉద్యమ సమయంలో మీడియా మొత్తం అవే వార్తలు . ఆంధ్రభూమి ఎడిటర్ శాస్త్రి ఆ ఉద్యమ వార్తలు చూపుతూ ఇప్పటికీ తెలంగాణ వస్తుందా ? అని అడిగితే .. ఆ వార్తల సైజులు మీడియా ఓనర్లను సంతృప్తి పరుస్తాయి, నిర్ణయంలో ఎలాంటి ప్రభావం చూపవు, వస్తుంది అని చెప్పాను ..
*****
1978 లో విద్యార్థిగా ఉన్నప్పుడు ఎక్కడ చూసినా గోడల మీద జనతా పార్టీ గుర్తు నాగలిపట్టిన రైతు బొమ్మ ఉండేది . జనతా పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చేస్తుంది అనుకున్నాను . దేశమంతా వచ్చినా ఆంధ్ర ప్రదేశ్ లో జనతా పార్టీ పెద్దగా ప్రభావం చూపలేదు . ఆ తరువాత చదువు పూర్తయి, జర్నలిజంలోకి వచ్చాక మీడియాలో వచ్చే వార్తల సైజుకు జనంలో పార్టీకి వచ్చే ఓట్లకు సంబంధం లేదు అని అర్థమయింది .
ఇప్పుడు అన్ని పార్టీలకు మీడియా ఉంది . పక్షపాతం అనే మాటకు తావు లేకుండా ఏ పార్టీ మీడియా ఆ పార్టీని ఆకాశానికి ఎత్తుతోంది . ఒక పార్టీ మీడియాకే పరిమితం కాకండి, అన్ని పార్టీల మీడియాను చదవండి , చూడండి .. అలానే సొంత కులం వారితోనే కాకుండా అందరితో మాట్లాడండి, ఓ నిర్ణయానికి రండి . ఏదో ఒక పార్టీ మీడియాను ఫాలో అయి ఎన్నికల ఫలితాలపై పందెం వేస్తే దెబ్బ తింటారు . డబ్బులు ఊరికే రావు … – బుద్దా మురళి
Share this Article