తెలంగాణలో పుట్టిపెరిగినా… ఎదుగుదల అంతా తెలంగాణ మీదే అయినా… ఆంధ్రామూలాలుండి.., నిరంతరమూ ఆంధ్రా గురించే కలవరించే ఆంధ్రుడు, ఆంధ్రాజ్యోతి యజమాని రాధాకృష్ణ తెలంగాణ మీద పడి ఏడుస్తున్నాడు… తెలంగాణ అభివృద్ధిని ఓర్వలేకపోతున్నాడు…… ఇదీ నమస్తే తెలంగాణ అంతరంగం..! అప్పుడప్పుడూ ఆంధ్రజ్యోతిలో వచ్చే వార్తల్ని తనే ఖండఖండాలుగా ఖండిస్తూ ఉంటుంది… దానికి అలవాటే, అందరూ తనలాగే రోజూ భజనల్ని మాత్రమే అచ్చేయాలి, లేకపోతే అది ఈనాడును తిడుతుంది, జ్యోతిని తిడుతుంది, వెలుగును తిడుతుంది.., అదీ వితండవాదంతో తిడుతుంది… సేమ్, ఆ పత్రిక పార్టీలాగే..! ఆ ఓనర్‌లాగే..! విచిత్రంగా ఉంటుంది వాదన… కేసీయార్‌నో, ఆయన పాలననో విమర్శిస్తే తెలంగాణను తిట్టినట్టు ముద్రేస్తుంది… మొన్న కేసీయార్ యూటర్న్ అని ఆంధ్రజ్యోతిలో ఫస్ట్ పేజీ బ్యానర్ వచ్చింది… దళితులకు మూడెకరాలు అనే పథకం మీద కేసీయార్ అసెంబ్లీలో ఎలా అబద్ధాలు ఆడుతున్నాడు అనే కోణంలో రాయబడిన కథనం అది… నిజానికి ఇలా సూటిగా సర్కారు మీద రాసే పత్రిక ఏదీలేదిప్పుడు తెలంగాణలో… అప్పుడోఇప్పుడో ఆ దమ్ము చూపిస్తున్నది రాధాకృష్ణే… ఆ స్టోరీ తరువాత నమస్తే తెలంగాణకు సహజంగానే మండిపోయి ఉంటుంది… (అఫ్ కోర్స్, కేసీయార్, రాధాకృష్ణ ఇద్దరూ మంచి దోస్తులే… ఈ పరస్పర తిట్లు, శాపనార్థాలు అప్పుడప్పుడూ దిష్టితీయడం కోసం…)
ఏదో సాకుతో ఆంధ్రజ్యోతిని తిట్టిపోయడం గ్యారంట అనుకుంటున్నదే… కాకపోతే నిజంగానే కేసీయార్ దళితులకు మూడెకరాల అనే అంశం మీద యూటర్న్ తీసుకున్నాడు… చాలా అంశాల్లో తీసుకుంటూనే ఉంటాడు, వాటిల్లో ఇదీ ఒకటి… సో, ఆ అంశంలో ఆంధ్రజ్యోతిని తప్పుపట్టి చాకిరేవు పెట్టేయడం కుదరదు… అందుకని వరి సాగుపై వచ్చిన ఓ స్టోరీని తీసుకుని, ఆంధ్రజ్యోతివాడికి సిగ్గులేదు, బుద్ధిలేదు, శరంలేదు తరహాలో నిన్న ఓ తిట్టుడు కథనాన్ని ప్రచురించింది… తెలంగాణలో కోటి ఎకరాల మాగాణాన్ని, విస్తారంగా పెరిగిన వరిసాగును రాధాకృష్ణ ఓర్వలేకపోతున్నాడని పరోక్షంగా తిట్టిపోసింది… ఇక్కడే తను తప్పులో కాలేసింది… ఉల్టా తిట్టడంలో కూడా ఆంధ్రజ్యోతికి మంచి తెలివితేటలున్నాయని మరిచిపోయింది నమస్తే… అసలు ఆంధ్రజ్యోతి రక్తంలోనే తిట్టే లక్షణముంది… మరి తనను తిడితే తను ఊరుకుంటుందా..? ఒరేయ్, నా కథనంలో తప్పేముందిరా అంటూ ఎదురువాతలు పెట్టింది… అదీ ఫస్ట్ పేజీలో… అదీ సాటి పత్రికకు కౌంటర్… వావ్… తెలుగు పార్టీలే కాదు, తెలుగు మీడియా కూడా బజారులో పడి తన్నుకుంటాయి…
Ads
ఇదీ తాజా రచ్చకు కారణమైన స్టోరీ… అందులో ఏముందయ్యా అంటే… వరి సాగు వల్ల వాతావరణంలోకి కర్బన ఉద్గారాలు పెరుగుతున్నాయి… ప్రత్యామ్నాయ పంటల వైపు మళ్లడం బెటర్, పలు శాస్త్రీయ పరిశోధనల్లో కూడా ఇదే నిరూపితమవుతోందనేది కథనం… దానికి సీఎస్ఏ సంస్థ బాధ్యుడి అభిప్రాయాన్ని కూడా జతచేశారు… నిజానికి సీఎస్ఏ కూడా పలు పరిశోధనల్ని ఆధారం చేసుకుంది… దానికి రైతులు అనే ఫీలింగ్ తప్ప ఆంధ్రా, తెలంగాణ అనే ఫీలింగ్స్ ఏమీ ఉండవు… ఆ అధ్యయనాల్ని బేస్ చేసుకుని ఆంధ్రజ్యోతి ఓ కథనాన్ని రాసుకుంది… తప్పేమీ లేదు… కొంతకాలంగా వరిసాగుకు సంబంధించి వ్యవసాయ శాస్త్రవేత్తల్లో ఓ చర్చ జరుగుతూనే ఉంది… అది నమస్తే ఏడ్చినట్టు తెలంగాణలో వరి గురించి కాదు, స్థూలంగా వరిసాగు మీద..!
ఇది నిన్న నమస్తే తెలంగాణ రాసిన కథనం… ఆంధ్రజ్యోతిలో వచ్చిన కథనానికి దురుద్దేశాల్ని ఆపాదిస్తూ ఎండగట్టింది… (ఇక్కడ ఒక పాయింట్ మాత్రం కరెక్టు, అది నమస్తే కూడా సరిగ్గా రాయలేకపోయింది… నిజంగానే ఏపీలో చంద్రబాబు పాలనలో గనుక వరిసాగు మస్తు పెరిగి ఉంటే ఇదే ఆంధ్రజ్యోతి భూనభోంతరాలు దద్దరిల్లే ప్రచారం చేసి ఉండేది… పట్టిసీమ కథనాలు చూశాం కదా…) నమస్తే తెలంగాణ ఆంధ్రజ్యోతి కథనాన్ని కౌంటర్ చేయాలనే తొందరలో తప్పుడు కౌంటర్‌కు పాల్పడింది… వరిసాగు మీద జరిగే చర్చను కేవలం తెలంగాణ వ్యతిరేక ప్రచారంగా, తెలంగాణ బ్రాండ్‌కు వ్యతిరేక ప్రచారంగా ఇష్యూని దారి మళ్లించింది… దాంతో ఆంధ్రజ్యోతి ఇలా మండిపడింది…
నిజానికి ఆంధ్రజ్యోతి సమర్థన కూడా అక్కడక్కడా దారితప్పింది… మేం గతంలో జలజలహే అని పొగడలేదా..? మేమెందుకు తెలంగాణకు వ్యతిరేక కథనాల్ని దురుద్దేశంతో ప్రచురిస్తాం, ఆంధ్రజ్యోతి మీద కావాలనే నమస్తే పత్రిక తప్పుడు ప్రచారం చేస్తోంది అంటూ ఎదురుదాడి చేసింది… అంటే ఒకరకంగా వివరణ ఇచ్చుకునే ప్రయత్నం చేసింది… అంటే, నమస్తే ఎవరిని తెలంగాణ వ్యతిరేకి అని తిట్టిపోస్తే వాళ్లు ఇక వివరణలు ఇచ్చుకోవాలా..? నమస్తే కథనాలకు అంత బలముందా..? పైగా వరిసాగుతో గ్రీన్‌హౌజ్ వాయువులు అనే అంశం వేరు… వరి ధాన్యానికి కొనుగోలు సమస్య కాబట్టి ప్రత్యామ్నాయాలు అవసరం అనే అంశం వేరు… ఈ రెండు పత్రికలూ రెండు అంశాల్ని కలగలిపి ఇష్యూని కలుషితం చేశాయి… సర్లెండి, రెండూ తిట్లపురాణాల్లో ప్రవచనకర్తల స్థాయి… అవి ఏదైనా రాయగలవు, ఏ ముద్రలైనా వేయగలవు… ఎటొచ్చీ ప్రజలే… ఫాఫం..!!
Share this Article