ఒక ఫోటో… మన మీడియా డొల్లతనాన్ని లోకానికి తనే చెప్పుకుంది… నిన్నంతా సోషల్ మీడియాలో అదే ఫోటో… ఫుల్ వైరల్… మంగళవారం ఉదయం చిరంజీవి మనమరాలి జననం అని తెలియగానే, ఆ టైంకు బోలెడు మీడియా కెమెరాలు, గొట్టాలు ప్రత్యక్షం… ఇప్పటికే దిక్కుమాలిన ప్రజెంటేషన్ విధానాలతో రెండో ప్లేసుకు చేరుకుని, పాతాళం వైపు ఇంకా వేగంగా దూసుకుపోతున్న టీవీ9 చివరకు ఓ ఆడశిశువు జననం విషయంలో కూడా తన ‘చిల్లర పోకడ’ను మార్చుకోనట్టు అనిపించింది…
అక్కడికి కొన్ని తరాలుగా అసలు భారత జాతిలో ఆడ శిశువే జన్మించనట్టు… పైగా ఈ ధోరణికి తగినట్టే చిరంజీవి కూడా కోట్ల మందిలో ఆనందాన్ని నింపుతూ మనవరాలు ఈ లోకంలోకి వచ్చినట్టుగా చేసిన కామెంట్స్ కూడా… నెటిజనం టీవీ9, ఇతర చానెళ్ల తలతిక్క పోకడల్ని థూత్కరించారు… అదే ఆనందంలో మరింత హుషారుగా టీవీలు పండుగ చేసుకున్నాయి… ఇక పొద్దున పత్రికలు ఈ అపురూప క్షణాన్ని ఎలా సెలబ్రేట్ చేసుకుంటాయోననే ఆందోళన కలిగిన మాట నిజం…
కానీ… ప్రింట్ మీడియా సంయమనాన్ని పాటించింది… హద్దులు దాటలేదు… తెలుగు చానెళ్లు ప్రదర్శించిన చిల్లర పాత్రికేయాన్ని తమ దాకా రానివ్వలేదు… సినిమా పేజీల్లో సింపుల్‌గా అచ్చేసి, మమ అనిపించాయి… చాలా నయం, ఫస్ట్ పేజీలో పబ్లిష్ చేయలేదు… అబ్బే, టీవీ చానెళ్లకు కావల్సినవి ఇలాంటి వార్తలే, ప్రేక్షకులు ఇవే కోరుకుంటారు, అందుకే మాకూ తప్పడం లేదు అని టీవీ చానెళ్ల పెద్దలు సుద్దులు చెబుతుంటారేమో… ఇది ఎలాంటి సమర్థన అంటే… చెత్తా పోకడల్ని జనం ఇష్టపడుతున్నారు, సొసైటీలో ఉన్నవే మేం చూపిస్తున్నాం అని సినిమాల ప్రవచనకారులు చెబుతుంటారు… ఈ చెత్తా సినిమాల వల్లే సమాజం చెడిపోతుందని మేధోసమాజం ఆందోళన చెందుతూ ఉంటుంది… సేమ్…
Ads
మరో వితండవాదం కూడా వినిపించింది… ఆ కెమెరామెన్, ఆ జర్నలిస్టులకు ఆయా చానెళ్లు అసైన్ చేసిన పని అది, కాదంటే కొలువులు పోతాయ్, ఈ సోషల్ మీడియా యాక్టివిస్టులు పోషిస్తారా అనేది ఆ వాదన సారాంశం… సోషల్ మీడియా ఛీత్కరిస్తున్నది ఆయా చానెళ్ల ధూర్త సంపాదకులు, సీఈవోలనే… ఈ కొలువురాయుళ్లను కాదు అనే సోయి లేదు ఆ వాదనలో…
నిజానికి మీడియా ఈ వార్తను చిరంజీవి, రాంచరణ్ కోణంలోనే చూసింది గానీ… వేల కోట్ల అపోలో ప్రతాపరెడ్డి కుటుంబంలోకి మరో వారసురాలు వచ్చిందనే పాయింట్‌ను విస్మరించింది… కొంతలోకొంత ఆడపిల్ల కాబట్టి కాస్త హడావుడి తగ్గింది గానీ మగపిల్లాడు పుట్టి ఉంటే మీడియా సంబురాలు గగనాన్ని అంటేవేమో… అసలు ఈ ప్రసవం వార్తల్ని కాసేపు వదిలేయండి… బేబీ బంప్ ఎందుకు కనిపించడం లేదు దగ్గర్నుంచి మొదలైన వార్తలు ఇంకా ఇలాగే కొనసాగుతాయి… ఆ శిశువుకు వాడే డైపర్ల బ్రాండ్ల దాకా వెళ్లిపోతుంది మీడియా… ఖర్మ.,.
అన్నట్టు… ఆ చిన్నారి భవిష్యత్ లో తాత, తండ్రిని మించిన స్థాయికి వెళ్తుందని, కొణిదెల వంశానికి పేరు ప్రతిష్టలు తీసుకొస్తుందని జ్యోతిష్కులు చెబుతున్నారట… పాప జన్మ నక్షత్రం పునర్వసు అట, రామ్ చరణ్ ది రోహిణి అయితే ఉపాసనది కృత్తికా నక్షత్రం అట. ఈ ముగ్గురివీ దైవిక అంశ కలిగిన నక్షత్రాలట… అత్యంత అరుదైన కాంబినేషన్‌లో పాప జన్మించిందట… పాప పుట్టిన సమయం కూడా అద్భుతంగా ఉందట.., తాతకి, తండ్రికి కలిసి వస్తుందట… మొత్తానికి జ్యోతిష్యాన్ని, పాత్రికేయాన్ని కొత్త ఎత్తులకు తీసుకుపోతున్నారు…
Share this Article