Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

ప్రియాంక హంతకులు – లీగల్ పొజిషన్ – యండమూరి విశ్లేషణ !

August 10, 2026 by M S R

.

Veerendranath Yandamoori … నిండు సభలో అందరూ చూస్తుండగా ఒక వ్యక్తి మరొకరిని కాల్చి, నేరుగా పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి ఆయుధాన్ని అప్పగించి లొంగిపోతాడు. అయినా అతడిపై కేసు నిలవదు. ‘నిశ్శబ్ద విస్పోటనం’ నవలలో సంఘటన ఇది. (సస్పెన్స్ కాబట్టి, తప్పించుకున్న విధానం పక్కన పెడదాం).

మరో నవల (ఒక దెయ్యంతో నా ప్రేమ కథ)లో హీరోయిన్ – మరణించే ముందు న్యాయమూర్తి ఎదుట మరణ వాంగ్మూల౦ ఇస్తూ- “నేను ప్రేమించిన వ్యక్తి (హీరో) నన్ను చంపాడు” అని చెప్పి మరణిస్తుంది. కానీ నిజానికి ఆమెను చంపింది హీరో కాదు. విలన్ .

Ads

ఇటువంటి సన్నివేశాలను రాసేటప్పుడు రచయితకు న్యాయవాదులు, పోలీసు అధికారులు సహాయపడతారు. గతంలో జరిగిన అనేక కేసులను ఉదాహరణలుగా చూపిస్తూ, చట్టంలోని అవకాశాలను, న్యాయ ప్రక్రియలోని సంక్లిష్టతలను వివరిస్తారు (అప్పట్లో చాట్ జి.పి.టి. లేదు).

ఇప్పుడు విషయానికి వద్దాం. నలుగురూ చూస్తుండగా, ఒక వ్యక్తి తన కారుతో ఒక యువతి మరణానికి కారణమయ్యాడు. ఇక్కడ చర్చ – అతడికి శిక్ష పడుతుందా లేదా అన్నది కాదు. మన న్యాయవ్యవస్థలో ఇటువంటి కేసు ఎలా/ఎన్నాళ్ళు నడుస్తుందన్నదే వివరణ.

“నిందితుడు ముందున్న స్కూటర్‌ పక్కకి వెళ్ళమని పదేపదే హారన్ కొట్టాడు. ఆమెను బెదిరించాడు. పక్కకు జరగకపోవడంతో కోపోద్రిక్తుడై చంపేశాడు” అని ప్రభుత్వ న్యాయవాది వాదిస్తాడు. “…కారును ఆపడానికి లేదా పక్కనుంచి వెళ్లడానికి అవకాశం ఉన్నా అలా చేయలేదు. సంఘటన తరువాత సహాయం చేయకుండా వెళ్లిపోయాడు. మత్తులో ఉన్నాను- అన్నది ముద్దాయి రక్షణ కాదు; మద్యం సేవించి వాహనం నడపడం మరో నేరం. దానికి కూడా ముద్దాయిని శిక్షించాలి” అని వాదిస్తాడు.

తన వాదనకి బలం చేకూరుస్తూ, ప్రత్యక్షసాక్షులు, CCTV, మొబైల్ వీడియోలు, వాహనానికి సంబంధించిన సాంకేతిక సమాచారం ప్రవేశ పెడతాడు.

డిఫెన్సు లాయరు వాదన రెండు రకాలుగా ఉంటుంది.
[మద్యం తాగినట్టు నిరూపణ (కొన్ని కారణాల(?)వలన) కాకపోతే ], “నిందితుడికి బాధితురాలితో పూర్వ పరిచయం లేదు, శత్రుత్వం లేదు, ముందస్తు ప్రణాళిక లేదు; అంతా క్షణాల వ్యవధిలో జరిగింది; ‘చంపేస్తా’ అన్న స్పష్టమైన మాటలు విన్న సాక్షులు లేరు” అంటూ హత్యా ఉద్దేశాన్ని ప్రశ్నిస్తాడు. “కారు నిజంగానే ఆమెను లక్ష్యంగా చేసుకొని మళ్లించాడా? బ్రేక్ వేశాడా?” వంటి అంశాలనూ లేవనెత్తుతాడు.

[మద్యం మత్తులో ఉన్నట్టు ప్రాసిక్యూషన్ beyond doubt నిరూపిస్తే], “నిందితుడు కోపంతో, మద్యం ప్రభావంలో అత్యంత బాధ్యతారహితంగా ప్రవర్తించిన మాట నిజమే. కానీ బాధితురాలిని చంపాలనే ఉద్దేశం లేదు. ఆమెను భయపెట్టి పక్కకు తప్పించాలనే ఉద్దేశంతో కారును ముందుకు కదిలించాడు; మద్యం మత్తులో నియంత్రణ కోల్పోవడంతో దుర్ఘటన జరిగింది” అంటాడు.

ఈ కేసు మినిమం అ..యి..దు సంవత్సరాలపాటు సాగుతుంది. బెయిల్ పిటిషన్లు, తీవ్రమైన అభియోగాలను తొలగించాలనే న్యాయపరమైన అభ్యర్థనలు, CCTV–మొబైల్ వీడియోల ఫోరెన్సిక్ ధ్రువీకరణ, ప్రత్యక్ష సాక్షుల విచారణ– క్రాస్ ఎగ్జామినేషన్, రక్తపరీక్షలు, వైద్య – సాంకేతిక నివేదికలు, సాక్షుల వాంగ్మూలాల్లో “తేడా”లపై వాదనలు – ఇవన్నీ అంత సమయం తీసుకుంటాయి.

ఈ అయిదు సంవత్సరాల్లో కొందరు సాక్షులు మరణించవచ్చు; మరికొందరు తమ వాంగ్మూలాన్ని మార్చు(!) కోవచ్చు; ఎన్నిసార్లు సమన్లు పంపినా మరి కొందరు కోర్టుకు హాజరుకాకపోవచ్చు. జ్ఞాపకాలు మసక బారడం, చిరునామాలు మారడం, సాక్షులు అందుబాటులో లేకపోవడం వంటి కారణాలు కూడా విచారణను మరింత ఆలస్యం చేయవచ్చు.

నేరం చూసిన ప్రత్యక్ష సాక్షులు ఎంతమంది ఉన్నప్పటికీ, నిందితుడిపై మోపిన నిర్దిష్ట నేరాన్ని ప్రాసిక్యూషన్ కోర్టులో సందేహాతీతంగా నిరూపించాల్సిందే. సాక్ష్యాల్లో గణనీయమైన సందేహాలు లేదా పరస్పర విరుద్ధతలు ఉంటే (ఉంటాయి) వాటిని డిఫెన్స్ లాయరు తనకు అనుకూలంగా ఉపయోగించుకుంటాడు. ఏదీ కుదరక పోతే చివరకు, తక్కువ తీవ్రత గల నేరంగా పరిగణించాలని కోర్టును బ్రతిమాలవచ్చు.

ఈ నేరంపై తీర్పు వచ్చే సమయానికి, ప్రస్తుతం ఆవేశపడుతున్న ప్రజలందరూ దాన్ని మర్చిపోయి ఉంటారు. గత పదేళ్లుగా పెండింగ్ లో ఉన్న ఆలాంటి కేసుల గురించి ఇంకేదో నవలలో ప్రస్తావించాను.
నిందితుడు ఆర్థికంగా ఎంత బలవంతుడు, ఎంత పలుకుబడి ఉన్నవాడు… వంటి విషయాలను ఇక్కడ చర్చించడం లేదు. కేవలం న్యాయప్రక్రియ ఎలా సాగుతుందో మాత్రమే చెప్పటం జరిగింది. “అందరూ చూసిన సంఘటనపై తీర్పు రావడానికి ఇంతకాలం ఎందుకు?” అనే సందేహం ఉన్నవారి కోసమే ఈ పోస్టు…

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • ప్రియాంక హంతకులు – లీగల్ పొజిషన్ – యండమూరి విశ్లేషణ !
  • రాష్ట్రపతి భవన్‌లో ఒక అరుదైన క్షణం – కలాం విశిష్ట వ్యక్తిత్వం !!
  • ఇండియా- పాక్ యుద్ధం జరిగితే… టర్కీ, సౌదీ పాల్గొంటాయా !?
  • వరుణయాగం ! క్షుద్ర పూజలకు విరుగుడు !! రేవంత్ వారుణాస్త్రం !!!
  • …. ఇంతకీ విజయ్‌తో విడాకులపై సంగీత ఎందుకు రాజీపడింది ?!
  • రాజేంద్రప్రసాద్- జారుడుబండ ! మరోసారి నవ్వులపాలు !!
  • ‘‘ముందు అతడిని పంపించేయండి – లేదంటే నేను షూటింగ్‌కే రాను’’
  • … అద్సరే గానీ వెస్టీండీస్ లేని క్రికెట్ ప్రపంచ కప్… నిజమేనా !!
  • రిటైరయ్యాక ఆయుష్షు ఎనిమిదేళ్లేనట ! ఆంధ్రజ్యోతిలో ఓ పిచ్చి సర్వే !!
  • ప్రభాత ఉదయం ! ఎవరిది ఈ కొత్త పత్రిక ? అంతుచిక్కని గోప్యత !!

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions