మేడిగడ్డ బ్యారేజీ కుంగడానికి కారణం “కుట్ర” అంటూ మొన్నటివరకూ గగ్గోలు పెట్టిన అధికార యంత్రాంగం, జనాల్లో నవ్వులపాలవుతున్నామని గ్రహించి “కుట్ర” కాదు అని బహిరంగంగా ప్రకటించాల్సి వచ్చింది.
*******
ఈ ప్రకటన వచ్చి ఒక్కరోజు ముగియకముందే, బ్యారేజీ కుంగడానికి కారణం కింద ఉన్న “ఇసుక కదలడమే” అంటూ స్పెషల్ చీఫ్ సెక్రెటరీ స్థాయి గల ఒక ఐఏఎస్ అధికారి ఈ ప్రకటన చేయడం ప్రభుత్వాన్ని మరింత నవ్వులపాలు చేస్తున్నది. ఇక్కడ డిజైన్ లోపం కానీ, నిర్మాణ లోపం కానీ ఏమాత్రం లేదట. నిర్మాణ లోపం ఉంటే మొత్తం బ్యారేజి కొట్టుకు పోయెదట. ఇలా సాగింది ఈ పెద్దమనిషి వివరణ…!
Ads
*******
ఇంజనీరింగ్ పరిజ్ఞానం పక్కకు పెట్టండి, కనీసం ఇంగిత జ్ఞానం ఉన్నా ఇలాంటి మాటలు ఎవరూ మాట్లాడరు.
మీరు కొత్తగా ఒక ఇల్లు నిర్మాణం చేపట్టారు…. దానిని నిష్ణాతులైన కన్సల్టెంట్లతో డిజైన్లు చేయించి, ఇంజనీర్ల పర్యవేక్షణలో నిర్మాణం పూర్తి చేసిన నాలుగు నెలలకే ఆ ఇల్లు భూమిలోకి కుంగిపోయిందనుకోండి? తప్పేవరిది? బిల్డింగ్ కట్టిన స్థలంలో సరైన భూ పరీక్షలు చేయకుండానే, పైన నిర్మాణం చేపట్టారని మనకు ఆర్దమౌతుంది.
“తూచ్…ఇందులో మా తప్పేమీ లేదు, తప్పంతా కింద కుంగిన మట్టిదే” అని ఆ ఇంజనీర్లు, కన్సల్టెంట్లు అంటే మీరేం చేస్తారు?
“ఇల్లు కట్టేటప్పుడు కనీసం భూమిని పరిశీలించకుండా డిజైన్ ఎందుకు చేసారు? భూమిని పటిష్టం చేయకుండా ఎందుకు నిర్మాణం చేసారు?” అని వాళ్లందరినీ కోర్టుకీడ్చి నష్టపరిహారం వసూలు చేస్తారు. అవునా…? మరి ఈ కనీస అవగాహన మన “పెద్ద అధికారికి” ఎందుకు లోపించింది?
************
ఎందుకంటే…? ఎవడూ మమ్మల్ని ప్రశ్నించడు అనే ధైర్యం…!
ఎన్ని వేల కోట్ల ప్రజాధనం వృధా అయినా తమకేమీ కాదన్న ధీమా…!!
లేకుంటే ఇలా బరితెగించి మాట్లాడడం అసాధ్యం…
********
లక్షకోట్లు గుమ్మరించి కట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు కట్టిన నాలుగేళ్లలో బయటకొచ్చిన కొన్ని వైఫల్యాలు చూడండి:
1. మేడిగడ్డ పంప్ హౌజ్ ప్రొటెక్షన్ వాల్ కూలింది, పంప్ హౌజ్ మునిగింది, ఆరు మోటార్లు తుక్కుగా మారినై, మొత్తం మోటార్లు నీళ్ళల్లో మునిగినై … రెండు సార్లు ఈ పంప్ హౌజ్ లో ప్రమాదాలు జరిగాయి.
2. మేడిగడ్డ గ్రావిటీ కెనాల్ కూలింది. ఇలా ఈ కాలువ కూలడం ఏటా ఒక తంతులా మారింది.
3. అన్నారం పంప్ హౌజ్ మునిగింది, మొత్తం మోటార్లన్నీ నీళ్ళల్లో మునిగినై…
4. సుందిళ్ళ బ్యారేజీ కట్టలు దెబ్బతిన్నాయ్…
5. మేడారం పంప్ హౌజులు క్రాకులిచ్చినయ్…
6. రామడుగు సొరంగాలు కూలినయ్…
7. మిడ్ మానేరు డ్యామ్ కుంగింది…
8. కొండపోచమ్మ రిజర్వాయర్ కు పగుళ్లోచ్చినయ్…
10. మల్లన్నసాగర్ కాలువకు బొక్కలు పడి మొత్తం కాలువ కుప్పకూలింది… పంది కొక్కులు ఈ బొక్కలు పెట్టినయ్ అని చెప్పారు.
11. ఎక్కడికక్కడ పంపు హౌజులకు, సొరంగాలకు, కాలువలకు పెచ్చులూడు తున్నయ్…
12. ఇప్పుడు మొత్తం కాళేశ్వరం ప్రాజెక్టుకు గుండెకాయలాంటి మేడిగడ్డ బ్యారేజి కూడా కుంగింది…!
ఇంకా బయటకు రాని వైఫల్యాలెన్నో…
***********
100 ఏళ్ళు ఉండాల్సిన ప్రాజెక్టుకు…4ఏళ్లకే వందేళ్లు నిండినయ్…! అయినా ఏ ఒక్కరి మీద చర్యలు లేవు. పైగా కాంట్రాక్టర్లకు శాలువాలు కప్పి సత్కారాలు… ఇప్పుడు ఏంచేయాలో తేల్చుకోవాల్సింది ప్రజలే…!…….. తెలంగాణ జాయింట్ యాక్షన్ కమిటీ (TJAC)
Share this Article