ఎంతైనా ఎదుగు, అంతే ఒదుగు అంటారు పెద్దలు… అలాగే మూలాలు మరిచిపోకపోవడం, సాయపడిన వారిని మరిచిపోకపోవడం కూడా పెద్దలు చెప్పే చద్దన్నం వంటి నీతిమాట… ఈ విషయంలో మన మణిపురి రజతం మీరాబాయ్ చాను నిజంగా మణిపూస… ఈ వార్త చదువుతూ ఉంటేనే ఆనందమేసింది.., విషయం ఏమిటంటే..? ఈమె సొంతూరు Nongpok Kakching… ఇది ఇంఫాల్‌కు 20-25 కిలోమీటర్లు ఉంటుంది… స్పోర్ట్స్ అకాడమీలో చానుకు ట్రెయినింగ్, అది ఉన్నదేమో ఇంఫాల్‌లో… ఈమె ఉండేది సొంతూళ్లో… రోజూ పొద్దున్నే ఇంఫాల్ వెళ్లి, సాయంత్రం తిరిగి వచ్చేది… కానీ రానుపోను రవాణాకు ఇబ్బంది… ఇప్పుడున్నంతగా ప్రైవేటు రవాణా లేదు, పబ్లిక్ ట్రాన్స్‌పోర్టు టైమింగ్స్ కుదరవు… అందుకని ఈమె రోజూ ఇసుకను ఇంఫాల్‌కు తీసుకుపోయే ట్రక్కుల డ్రైవర్లను లిఫ్ట్ అడిగేది… ఆమె రోజూ ఇంఫాల్‌కు ఎందుకు పోతుందో అందరికీ తెలుసు, ఫ్రీగానే తీసుకెళ్లి దింపేవాళ్లు… ఇవ్వడానికి ఆమె దగ్గర డబ్బులు కూడా ఉండేవి కావు… వాళ్లది ఓ మోస్తరు కుటుంబం…
ఇప్పుడామెకు మంచి కొలువు ఉంది… ఈ ఒలింపిక్స్ రజతంతో పేరు ప్రఖ్యాతులొచ్చినయ్… సమాజంలో మంచి గుర్తింపు వచ్చింది… డబ్బుంది… అన్నింటికీ మించి తనకు ఒకప్పుడు సాయం చేసిన ప్రతి ఒక్కరినీ పిలిచి గౌరవించాలనే మంచి కోరిక పుట్టింది… అభినందనీయం… చాలామందికి చిన్న విషయంగా అనిపించవచ్చుగాక కానీ తరచి చదివితే పెద్ద విషయమే… ఈ తరంలో ఎంతమందికి ఈ ‘మర్యాద- పద్ధతి’ తెలుసు..? ఆ ఆలోచన ఎంతమందికి వస్తుంది..? అప్పట్లో తనకు లిఫ్ట్ ఇచ్చిన ట్రక్కుల డ్రైవర్లు, హెల్పర్లు, అసిస్టెంట్ల (ఇప్పుడు ఆ వృత్తిలో ఉన్నా లేకపోయినా) వివరాలు సేకరించింది… పిలిచింది… మంచి భోజనం పెట్టింది… కృతజ్ఞతలు చెప్పింది… అందరికీ షర్టు, మణిపూరి స్కార్ఫ్ బహూకరించింది… దండం పెట్టింది… నిజానికి అవసరం లేదు, కానీ ఆమె చూపించిన మర్యాద ఓ గొప్ప సంస్కారం… ఇక్కడ భోజనం, షర్టు అనేది ముఖ్యం కాదు… అంతకుమించిన ఓ ఎమోషన్..! తమ కళ్ల ముందు అటూఇటూ తిరిగిన పిల్ల ఓ అంతర్జాతీయ పతకం సాధించడం, జాతి పతాకాన్ని గర్వంగా ఎగరేయడమే కాదు… తమను పిలిచి భోజనం పెట్టడం వాళ్లందరికీ ఓ హేపీ అకేషన్… వాళ్లు ఏదో ఆశించి అప్పట్లో సాయం చేయలేదు… ఇప్పుడు చాను తీర్చుకున్నది రుణమూ కాదు… సాయానికి కృతజ్ఞత చెప్పుకోవడం… భేష్, చాను… ఇప్పుడు నచ్చావ్… సంపూర్ణంగా…!! నువ్వు గెలిచింది వెండి, నువ్వు బంగారం…!!
Ads
Share this Article