నాకు బుల్లెట్ ప్రయాణం అంటే తెగ మోజు… ఝామ్మని దూరప్రాంతాలకు వెళ్లేవాడిని… కానీ 2011లో… ఒకసారి నా భార్య లీలకు కాలు ఫ్యాక్చరైంది… నాకేమో స్ట్రోక్ వచ్చింది… ఇద్దరమూ మంచానపడ్డాం… బుల్లెట్‌కు దుమ్ముపట్టింది… ‘బుల్లెట్ మీద అటూఇటూ తిరగడం కాదు, కనీసం బుల్లెట్ నడిపించాలనే ఆలోచనే నీ మనస్సు నుంచి తుడిచెయ్’ అని డాక్టర్ గట్టిగానే హెచ్చరించాడు… ఆయనకు తెలుసు నేను బుల్లెట్ మీద ఎక్కువ శాతం బజారులోనే బతుకుతూ ఉంటానని…
నాకు కొంచెం బాగైంది… అంతే, ఇక ఆ నాలుగు గోడల మధ్య నన్ను నేను బంధించుకోవడం నచ్చడం లేదు… ఇక జీవితమంతా ముసలివాడిగానే బతకాలా అనే ఫీలింగ్ నుంచి ముందుగా బయటపడాలి… ఆఫ్టరాల్ నేనింకా 67 ఏళ్లు మాత్రమే… దాంతో నా 1974 మోడల్ బుల్లెట్ తీసి కొద్దికొద్ది దూరాలు వెళ్లడం స్టార్ట్ చేసేశాను… నిజానికి నా బుల్లెట్‌పై తిరగాలనే బలమైన ఆకాంక్షే నన్ను వేగంగా కోలుకునేలా చేసిందేమో… కానీ లీల లేకుండా నేనొక్కడినే ఒంటరిగా తిరుగుతుండటమే నాకు నచ్చడం లేదు…
ఆమేమో వీల్ చెయిర్ మీద… నా వెనుక ఎప్పటిలాగా కూర్చోలేదు… సో, నా బుల్లెట్‌కు ఓ సైడ్‌కార్ ఫిట్ చేయించాను… అందులోనైతే లీల హాయిగా కూర్చోగలదు… పెళ్లాంతో ముచ్చట్లు పెట్టకుండా, కలిసి ఎలా ఆనందంగా తిరగగలం..? చిన్న చిన్న టూర్లు స్టార్ట్ చేశాం… 2016లో కాస్త పెద్ద టూరే ప్లాన్ చేశాను… ఒక ఫిక్స్‌డ్ డిపాజిట్ డ్రా చేశాను… వడోదర నుంచి మొదలుపెట్టి మహారాష్ట్ర, కేరళ, గోవా, కర్నాటక, తమిళనాడు కవర్ చేశాం…
Ads
వరుసగా 3 గంటలు డ్రైవింగ్, తరువాత బ్రేక్… ఎక్కడ ఆగాలనుకుంటే అక్కడే ఆగిపోయేవాళ్లం… రాత్రయితే ఏదైనా బడ్జెట్ హోటల్ చూసేవాళ్లం…
నా ఆర్థిక కార్యదర్శి కూడా లీలనే… మేం రోజువారీ బడ్జెట్‌కు పెట్టుకున్న లిమిట్ 4000 రూపాయలు… అందులోనే ఫుడ్, వసతి, పెట్రోల్ ఖర్చు… నా బుల్లెట్‌లోనే ఓ సీక్రెట్ ప్లేస్ ఉంది… మా లిమిట్ దాటి ఒక్క రూపాయి కూడా ఎక్కువ ఖర్చు పెట్టనివ్వదు ఆమె… ఏ బీచ్ ఒడ్డునో, సూర్యుడు అస్తమిస్తుంటే ఒకరి చేతుల్లో మరొకరు చేతులు వేసుకుని చూడటంకన్నా జీవితంలో ఇంకేం కావాలి..? 75 రోజులు అలా గడిచిపోయాయి… మళ్లీ వడోదరకు వచ్చేశాం, వచ్చేలోపే మరో టూర్ ప్లాన్ వేసేసుకున్నాం…
2018 ఫిబ్రవరిలో సెకండ్ ట్రిప్… ఈసారి ఈశాన్య రాష్ట్రాలు కవర్ చేశాం… మధ్య మధ్య మేం ఆగినచోట పిల్లలు ‘అంకుల్, ఈ ప్రయాణాలు పర్లేదా..? అనారోగ్యం ఏమీ పీడించదా..?’ అని అడిగేవారు… హేయ్, ఎవరిని నువ్వు అంకుల్ అంటున్నావ్, జస్ట్, నేను ఓ సీనియర్ సిటిజెన్‌ను, కానీ స్టిల్ యంగ్ తెలుసా..? అని బదులిచ్చేవాడిని… ఇక ప్రతి సంవత్సరం ఒక టూర్ అని నిర్దేశించుకున్నాం… అసలు టూర్లు లేకపోతే బతికి ఉండేవాళ్లం కామేమో…
ఈసారి ట్రిప్ సౌత్ ఇండియా… కానీ లీలకు ఈసారి చీలమండలో ఫ్యాక్చరైంది… ఓ వారం హాస్పిటల్ పాలు… చిన్న సర్జరీ కూడా చేశారు… కొన్నాళ్లకే లీల వచ్చి సైడ్ కారులో కూర్చుంది… పోనియ్యవోయ్ అంది సరదాగా… అందుకే అందరికీ చెబుతుంటాను… నా బుల్లెట్‌కు రెండు బ్యాటరీలు, అందులో ఒకటి లీల… 2020లో ఓసారి లెక్క చూసుకున్నాం… 30 వేల కిలోమీటర్లు తిరిగాం… మీరు చదివింది నిజమే… 30 వేల కిలోమీటర్లు… బుల్లెట్ ఎక్కామంటే చాలు, లీల నా హీరో… నేను డ్రైవర్… మిగతాదంతా ఆమే… దేవుడా, మా ఇద్దరికీ ఇంకా ఆయుష్షు కావాలి, ఎందుకంటే..? మేమింకా చాలా దూరం తిరగాల్సి ఉంది… ప్లీజ్… నా గుండె లబ్‌డబ్ ధ్వనికన్నా నా బుల్లెట్ డుగ్‌డుగ్ ధ్వనే నా ప్రాణం నిలిపేది… నిజం…
Share this Article