చాలామందికి సొంత బిజినెస్ చేసుకోవాలని ఉంటుంది… కంపెనీల్లో కొలువులు కొందరికి ఇష్టముండదు…, ఆంక్షలు, సెలవులు, టార్గెట్లు, జీతాలు, ప్రమోషన్లు, వేధింపులు ఎన్ని, ఎన్నని..? ప్రతిరోజూ అసెస్మెంట్… ఒత్తిళ్లు… తద్వారా రోగాలు… అదే సొంత బిజినెస్ అయితే… మనిష్టం… ఎంట్రపెన్యూర్‌గా ఉంటే ఎన్ని సవాళ్లున్నా సరే, ఆ సవాళ్లు గెలవడంలో ఓ ఆనందం కూడా ఉంటుంది…
కొన్ని బిజినెస్‌లు కొందరు చేపట్టడానికి నామోషీ… పైగా ఆమె మహిళ… కంప్యూటర్ సైన్స్‌లో బీటెక్ చేసింది… ఆ అర్హతకు ఏదో కంపెనీలో కాస్త మంచి జాబే దొరుకుతుంది… కానీ చేరలేదు… 21 ఏళ్లకే ‘బీటెక్ పానీపురి వాలీ’గా అవతారం ఎత్తింది… పేరు తాప్సి ఉపాధ్యాయ్… ఆమె చేస్తున్న పని చూసి నవ్వేవాళ్లు, వెక్కిరించేవాళ్లు… పర్లేదు, మంచి పనిచేస్తున్నావంటూ భుజం తట్టేవాళ్లు…
Ads
ఇటు గ్రాడ్యుయేషన్ అయిపోగానే అటు వ్యాపారంలోకి దిగిపోయింది… వ్యాపారం అనేంత పెద్ద పదం వద్దులెండి అంటుంది నవ్వుతూ… వీలైనంత మందికి హెల్దీ ఫుడ్ అందించాలనేది ఆమె టార్గెట్… అందుకే తనే పానీ పురీలు తయారు చేస్తుంది… తనకు పానీపురి స్టాల్ ఉంది… ఆమెకు ఓ వెబ్సైట్ ఉంది… ఇన్‌స్టా, ఫేస్బుక్, ట్విట్టర్… అన్నీ… ఇప్పుడు ఒకే స్టాల్… చూస్తుండండి, నేను ఎన్ని అదనపు స్టాళ్లు ఓపెన్ చేస్తానో అంటోంది…
సాధారణంగా పానీపురి బళ్ల దగ్గర అపరిశుభ్రత దృష్ట్యా, రసం తయారీలో నిర్లక్ష్యం కారణంగా చాలామంది బళ్ల వద్దకు వెళ్లరు… ఆ సీన్ నేను మారుస్తానూ అంటోంది ఈమె… రీసెంటుగా ఇన్‌స్టాలో ఓ రీల్ పోస్ట్ చేసింది… 3 లక్షల లైక్స్ వరదలా వచ్చిపడ్డయ్… వైరల్… (Instagram page @are_you_hungry007)… అందులో ఆమె స్టాల్ ఓపెనింగ్ మీద, ఫుడ్ మీద మాట్లాడుతుంది, అంతే… ఓ మహిళగా తనకు ఎదరయ్యే సవాళ్లు కూడా ఒకటీరెండు…
అరె, ఏందమ్మా, అంత చదువుకున్నవ్, పానీపురి బండి పెట్టుకున్నవ్ ఏందీ అనడుగుతుంటారు చాలామంది ఆమెను… కొందరేమో… ఇక చాలు, బజార్లలో ఆడవాళ్లు ఇలాంటి బళ్లు నడిపించలేరు, ఇంటికి వెళ్లిపో, ఏదైనా కొలువు చూసుకో అని సలహాలు ఇచ్చేవాళ్లు మరికొందరు…
‘‘సూపర్, నీ పని కరెక్టు… ధైర్యంగా ఉండు, ఏం పర్లేదు’’ అంటాడు ఓ నెటిజన్… నువ్వు అనుకున్న లక్ష్యం చేరుకోవమ్మా అంటాడు మరొకాయన… ఇంకొకాయన మరీ ఎమోషనల్ అయిపోయి, నీకేం తక్కువ, ఇదుగో నా సెల్యూట్ అని కామెంట్ పెట్టాడు…
చిన్న చిన్న స్టాళ్లు, పూర్తి శుభ్రంగా, మోడరన్‌గా, రుచిగా పానీపురీ అందిస్తాను… అసలు పానీపురీ ఇష్టపడని వారెవ్వరు..? ఆ ఇష్టమే నా వ్యాపారానికి పెట్టుబడి అంటోంది గడుసుగా… బెస్టాఫ్ లక్ తాప్సీ… ఇదీ ఆమె ఇన్‌స్టాలో పెట్టిన వీడియో…
Share this Article