Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

పోగుల గణేశం… నాడు ఆర్మీలో బ్రిగేడియర్… నేడు పల్లె శోధనలో బ్రిగేడియర్…

October 28, 2023 by M S R

Kandukuri Ramesh Babu……..  #విను_తెలంగాణా#2 …. పామరుల జ్ఞానం విను – చాటు : అదే ‘పల్లె సృజన’ ‘ … సికింద్రాబాద్ సమీపంలోని వాయుపురిలోని ‘పల్లె సృజన’ అన్న కార్యాలయం ఒక ‘గ్రామీణ విశ్వవిద్యాలయం’ అంటే అతిశయోక్తి ఎంతమాత్రం కాదు. దాని వ్యవస్థాపకులైన పోగుల గణేశం గారిని ఈ యూనివర్సిటీకి అనధికార వైస్ చాన్సలర్ ని మించిన విద్యావేత్త అనే చెప్పాలి. అవును మరి. ఆయన అతి త్వరలో దేశంలోని సుమారు రెండువందలా యాభై మంది హాజరయ్యే ఒక వైస్ చాన్సలర్ల సమావేశాన్ని ఉద్దేశించి ప్రసంగించవలసి ఉన్నది. అక్కడ తాను గ్రామీణ భారతంలో నిశ్శబ్దంగా కృషి చేస్తున్న దేశీయ మేధావులు, ఆర్గానిక్ శాస్త్రవేత్తలు, అపురూప ఆవిష్కర్తల గురించి చెప్పేది ఉన్నది. మొత్తంగా ఈ దేశానికి కావాల్సిన సంపత్తిని అందించేది పామరులుగా భావించి నిర్లక్ష్యం చేయబడిన ఆ గ్రామీణులే అని చెప్పే ఉద్దేశ్యం ఉన్నది.

హాజరయ్యే వేర్వేరు విశ్వ విద్యాలయాల చాన్సిలర్లు తాము బాధ్యత వహిస్తున్న విద్యాలయాలన్నవి అసలు అర్థంలో విశ్వ విద్యాలయాలు కానే కావని చెప్పడానికి ఆయన ఉద్యుక్తులవుతున్నారు. ఎవరేమనుకున్నా సరే, ఇన్నేళ్ళ స్వాతంత్ర్య భారతావనిలో ఆయా విశ్వ విద్యాలయాలు ఇప్పటికీ గ్రామీణ ప్రజల జ్ఞానాన్ని గౌరవించే పనిని తలకెత్తుకోనేలేదని, వాళ్ళ శాస్త్రీయతను అంగీకరించే అడుగులు ముందకు పడనేలేదని ఆయన నిర్మొహమాటంగా చెప్పబోతున్నారు. అందుకే వారి గురించి చిన్న పరిచయం రాయడానికి తనని సైన్యంలో బ్రిగేడియర్ స్థాయిలో పదవీ విరమణ చేసిన దేశభక్తుడు అని చెప్పడం కంటే, వారు పల్లె సృజన వ్యవస్థాపకులు అని చెప్పడం ముఖ్యం అని తోస్తున్నది.

తాను సైన్యంలో చేసిన కృషిని పక్కకు పెట్టి, 2005 నుంచి మొదలెట్టిన పల్లె సృజన కార్యక్రమం గురించి, అది స్థాపించిన నాటి నుంచి ఇప్పటిదాకా సుమారు ఐదు వందల మంది ఆవిష్కర్తలను గుర్తించి వారిలో కొందరికి పద్మశ్రీ వంటి పురస్కారాలు రావడం దాకా చేసిన మహాత్తర్ కృషి గురించి గర్వంగా చెప్పవలసి ఉన్నది. ఒక్కమాటలో ఆయన మారుమూల దేశీయ జ్ఞానులను వెతికి పట్టుకుని ప్రపంచ పటంలో పెడుతున్న మహనీయులు. ఆ జ్ఞానుల ఆవిష్కరణలు ఎట్లా స్థానిక రైతాంగం, వృత్తి దారుల పనిని సునాయాసం చేసిందో, అవి ఆయా ఉత్పత్తులను ఎట్లా గణనీయంగా పెంచాయో చెబూతూ నేను ఎంచుకున్న పల్లెటూరు పర్యటన ఎట్లా దేశీయ జ్ఞానానికి పెద్దపీట వేయాలో భోదపరచడం విశేషం. అందుకు వారికి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ తన పూర్తి ఇంటర్వ్యూ వచ్చే నెలలో ప్రచురించే ముందు ఈ పరిచయం ఒక ఉపోద్ఘాతం.

Ads

సంవేదన ఉన్న మనుషులు వేరు!
గణేశం గారు ఇప్పటి సిద్ధిపేట జిల్లాకు చెందిన వారు, 1972లో మెకానికల్ ఇంజనీర్ గా ఉస్మానియా విశ్వ విద్యాలయం నుంచి బయటకు వచ్చి, ఆ సంవత్సరమే సైన్యంలో చేరేందుకు శిక్షణ కోసం డెహ్రాడూన్ కి వెళుతూ ఉంటే తన మాతృమూర్తి నరసమ్మ గారు ఒక మాట అడిగారట. . “మళ్ళీ తిరిగి వాస్తవా బిడ్డా” అని! 
దానర్థం యుద్ధంలో అతడికి ఏమవుతోందో అని కాదు. నిజానికి అమ్మగారికి అప్పట్లో సైన్యం అంటే తెలియదు. యుద్ధం అన్నా అస్సలు తెలియదు. కానీ తన కొడుకు దూరం వెళుతున్నాడని మాత్రం తెలుసు. అప్పట్లో దూరం అంటే దూరమే. ఇప్పట్లా దూరం ‘దూరం’ కాదు. ఆ మాటకు తాను “వస్తానమ్మా” అని చెప్పి తాను ముప్పయ్ ఐదేళ్ళు సైన్యంలో పనిచేసి, బ్రిగేడియర్ గా పదవీ విరమణ చేసి తిరిగి వచ్చారు. ఈసారి అమ్మ దగ్గరకే కాదు, “వచ్చానమ్మా” అంటూ ఆయన పల్లెలకు వెళ్ళారు. తల్లి వంటి గ్రామాల చెంతకు చేరారు..
నిజానికి తాను సైన్యంలో చేసిన ఘన కార్యాలు ఎన్ని ఉన్నా అవి ఎంతమాత్రం చెప్పరు ఆయన. వారికి పల్లెటూరుపై దృష్టి పడింది. పల్లెల్లోని సృజనకారుల ప్రతిభాసంపత్తిపై, వారికి ఉన్న వివేకంపై గురి కలిగింది. ఆ మహనీయుల కృషిని ప్రపంచానికి చాటాలని ఆయన పర్యటించడం ప్రారంభించారు. ఆ పనికి పెట్టుకున్న పేరు ‘శోధనా యాత్ర’. అట్లా శోధించిన పిదప ఆయా వ్యక్తులను సమాజం ముందుకు తెచ్చి వారి ఆవిష్కరణలు గౌరవం కలిగిస్తూ విస్తారంగా అవి ప్రజలకు చేరేందుకు నడుం కట్టారు. అట్లా అయన సైన్యం నుంచి వచ్చాకే పల్లెసృజన కారుల బ్రిగేడియర్ గా మారారు.
దీనంతటికీ కారణం చాలా లోతైనది. గంభీరమైనది. అది మన దేశీయ విజ్ఞానాన్ని నిండా ముంచిన పరాయి చదువుల సారమే. అవును. మనం దాదాపు రెండు శతాబ్దాలుగా పాశ్చాత్య భావనల్లో కొట్టుకుపోతూ అనాదిగా పల్లెల్లో సాగుతున్న వ్యక్తిగతమైన ఆవిష్కరణలను నిర్లక్ష్యం చేయడమే అంటారాయన. వ్యక్తిగత ప్రావీణ్యతతోనే సమాజం ముందుకు నడిచిందని మనం మరచిపోవడమే పెద్ద తప్పిదం అంటారాయన. కానీ Institutional excellence అన్నది పెద్ద ఎత్తున వాడుకలోకి వచ్చింది. అది నిజానికి పాశ్చాత్య భావన.
వాస్తవానికి మనలా వాళ్లకు మనుషులు లేరు, మనకున్నంత వైవిధ్యమూ లేదు. కానీ ఆ విధానం మనకు వద్దకు చేరింది. వ్యక్తిగత ప్రావీన్యతలను కాదని ఆ వ్యవస్థీకృత సృజనాత్మకత కోసం మన సమాజాలు సైతం మనవి కాని చదువుల భారీన పడి నేల ఫిడిచి సాము చేయడం మొదలెట్టాయి. ఆ చదువు సహజంగానే దేశీయ విజ్ఞానం పట్ల నిర్లక్ష్యానికి కారణమైంది. అలా జరిగిన అన్యాయం కారణంగా సమాజంలో సృజనాత్మకత ఉన్నవాళ్ళు సమాజానికి సహాయం చేయలేని స్థితి ఏర్పడింది.
ఇక్కడే ఈ బ్రిగేడియర్ ని పల్లె తన అసలైన సైన్యంగా ఎంచుకునేలా చేసింది. ఒకరొకరిగా దేశీయ మేధావులు, స్థానిక సృజన శీలురు, ఎందరో ఇన్నివేటర్స్ గుర్తించి వారి ఆవిష్కరణలకు గుర్తింపు, హోదా, గౌరవం కలిగించి, ఆ జ్ఞానం ప్రజలకు చేరేలా విస్తరించేలా కృషి చేసేలా ఉత్తేజితం చేసింది. ఇప్పుడు మీరు దూరం అంటే ఏమిటో పోల్చుకోగలరని భావిస్తాను. అదేమిటో కాదు, మనకు మనం దూరం కావడమే. ముఖ్యంగా ఒక చెట్టు తన వేర్లను చూసుకోవడం మరవడం. అర్థమైంది అనుకుంటాను.
నిజానికి దూరం అన్నది విస్మయం కలిగించే విషయమే. ఇప్పుడు దూరం అన్నది దగ్గర ఐంది. ఎన్ని వేల కిలోమీటర్ల దూరంలో ఉన్నా కూడా దూరం అనిపించదు. ఆ దూరాన్ని చేరాలంటే వేగంగా వెళ్ళే అవకాశం వచ్చింది. ఆ వేగంలో మధ్య ఉన్న పరిసర ప్రపంచం ముఖ్యంగా గ్రామీణ విశ్వం మన అసలు విద్యాలయం అదృశ్యమైంది. దగ్గరా దూరమే ఐంది. అందుకే ఆయన నిదానంగా నడకను ఎన్నుకున్నారు.
36౦ డిగ్రీలో కళ్ళకు కనపడేలా నడక మీద ఆధారపడ్డారు. ప్రతి మూడు నెలలకు మూడు రోజుల పాటు జ్ఞాన శోధన పేరిట ఇరవై నుంచి అరవై మంది సభ్యులతో స్వచ్ఛంద కార్యకర్తలతో కలిసి గ్రామాలకు నడుస్తారు. నడుస్తూ గ్రామీణులను కనిపెడుతారు. వారి నుంచి నేర్చుకుంటారు. అదే బ్రిగేడియర్ గణేశం గారి ప్రధాన కార్యక్రమం.
విశేషం ఏమిటంటే, పల్లె సృజనలో లేదా గ్రామీణ సమాజంలో పేర్కొనదగిన విలువ “సంవేదన” అంటారాయన. వాళ్ళ అమ్మ అంతదూరం వెళుతున్నావు, తిరిగి వాస్తవా అనడంలో అదే సంవేదన ఉంది. తాను సైన్యం విడిచి ఇంటికి రాగానే పల్లెకు పయనం కావడానికి కారణం కూడా ఆ సంవేదనే.
సంవేదన అంటే, అది ఇతరుల బాధను చూసి అర్థం చేసుకునే గుణం. ఆ బాధను తాము ఇంటర్నలైజ్ చేసుకొనే తీరు. అదే నడకలో తనని కట్టిపడేసిన విలువ అన్నారాయన. అదే గ్రామీణ జీవితంలోని ప్రత్యేకత అని వారు అన్నారు. ఆ సంవేదన లోంచే స్వచ్ఛంద కార్యాచరణ పుట్టింది ఆ కార్యాచరణే సకల ఆవిష్కరణలకు మూలం అని ఉత్సాహంగా చెప్పారాయన.
చదువు సంధ్యాలేని వారు, పామరులు అనుకునే ఈ జనులు తోటి వారి కష్టాలను తీర్చి సంఘ జీవితాన్ని ఆనందమయం చేస్తున్నారు. అదే సృజన ప్రయోజనం అని గర్వంగా చెప్పారాయన. వాస్తవానికి “ఎందుకు బ్రతుకుతున్నాం” అన్న మాటకు మనం జీవిస్తున్న పట్టణ జీవితంలో జవాబు లేదు. కానీ పల్లె జీవులకు ఆ ప్రశ్నకు అర్థం తెలుసు అని అన్నారాయన.
గ్రామీణులు పక్కవాళ్ళు ఆనందంగా ఉండాలని ఆశిస్తారు. పక్కవాళ్ళు ఆనందంగా ఉండాలంటే వారి కష్టాలను పరిష్కరించాలీ అన్న ఇంగితం వారికి ఉంది. అందుకోసం మనసావాచా కర్మణా చేసే ప్రయత్నమే ‘సృజన’. అదే నిజమైన ‘ఆవిష్కరణ’గా గణేశం గారు భోదపర్చడం విశేషం.

పల్లెలలో పామరులుగా భావించే వారిలో నిండుగా ఉన్న ఈ సంవేదనే వారిని జ్ఞానులను చేసిందంటూ, అలాంటి జ్ఞానులను మీ పర్యటనలో వినండి. పల్లెపల్లెనా మబ్బులు కమ్మిన సూర్యులవంటి ఆ సృజన కారుల గురించి లోకానికి తెలియజేయండి అని వెన్నుతట్టారు వారు… కందుకూరి రమేష్ బాబు… Samanyashastram Gallery

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • పాపం శమించుగాక… ఇద్దరు వ్యక్తుల పేర్లు పదే పదే గుర్తొస్తున్నాయి…
  • యుద్ధానికి విరమణ సరే… కానీ ఈ ఆపరేషన్ ఏం తేల్చి చెప్పింది..?!
  • హమ్మయ్య… ఆ శ్రీవారి కృప వల్ల టీటీడీ ఉద్యోగుల ప్రాణాలకు భరోసా..!!
  • హీరోనని చెప్పుకోకు నానీ… ఈ దరిద్రపు పోకడలతో చావుదెబ్బ తింటావ్…
  • పెళ్లిళ్లు వద్దు, పిల్లలు వద్దు… ఉనికే కోల్పోతున్నా ఉలుకు లేని ఓ మతం…
  • పాకిస్థాన్ అంటేనే ఓ రోగ్ కంట్రీ కదా… అందుకే ఎవ్వడూ స్పందించడు…
  • అలా హీరో విలన్లను పట్టుకొచ్చి కోర్టు హాల్లో పడేస్తాడు… వెంటనే విచారణ..!!!
  • ముందు తెలిసినా…! ఇలా రాసేవాళ్లేరీ, తీసేవాళ్లేరీ, చేసేవాళ్లేరీ… చూసేవాళ్లేరీ..!!
  • దూసుకొస్తున్న మరో ‘స్కైలాబ్’… పాకిస్థాన్‌పై పడితే పీడాపోతుంది…
  • భయపడమనడం లేదు… బాధ్యతపడమంటున్నది ప్రభుత్వం…

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions