కెమెరాలకు ఇలా ఫోజు ఇస్తుంటే భలే ఉంది… నా బైక్, నవ్వారి చీరెలో దాని పక్కన నేను… చుట్టూ పెద్ద గుంపు… వాళ్లు ‘భారత్ కే బేటీ’ అంటుంటే నిజంగానే అలా ఫీలయ్యాను… అసలు ఇదంతా 2022 ఇండిపెండెన్స్ డే నాడు నరేంద్ర మోడీ చేసిన ప్రసంగంతో స్టార్టయింది… గ్రామీణ వృత్తికళాకారులకు ప్రోత్సాహం, మహిళా సాధికారత మీద మాట్లాడాడు ఆయన… తన మాటలు నాకు కనెక్టయ్యాయి… ఓ సాహసయాత్ర చేస్తే ఎలా ఉంటుందనే ఆలోచన తళుక్కుమంది…
చేయగలనా..? ఈ సందిగ్ధత మనల్ని ముందుకు పోనివ్వదు, అందుకని ఆ ప్రశ్నను డిలిట్ కొట్టేశాను… ఆరు ఖండాల్లోని 40 దేశాలను ఏడాదిలో నా బైక్ మీద కవర్ చేయాలని సంకల్పించాను… ఎస్, అదీ చీరెకట్టుతో…! బైక్ జర్నీ నాకు కొత్తేమీ కాదు… చాలా కంఫర్ట్‌గా ఉంటుంది నాకు… నా పదహారో ఏట నుంచీ బైక్ నడిపిస్తున్నాను నేను… బైక్ మీద వెళ్తుంటే నా జుట్టు గాలికి ఎగురుతుంటే ఏదో బందిఖానా నుంచి విముక్తి పొందుతున్నట్టు అనిపిస్తుంటుంది… ఇప్పుడు నేనాలోచించిన ట్రిప్ చాలా డిఫరెంట్… నేను ఏదో నేషనల్ డ్యూటీ మీద ఉన్నట్టుగా ఉంది…
Ads
ఆయితో మాట్లాడాను… ఆమె ‘‘నేను నీకు సపోర్ట్’’ అంది… ఏయే రూట్‌లో వెళ్లాలో మ్యాపింగ్ చేసుకున్నాను… ఖర్చులు, సామగ్రి ఏమేం కావాలో ప్లాన్ చేసుకున్నాను… కొందరు నిపుణులతో మాట్లాడాను… కొందరు పొలిటిషియన్స్‌ను కలిశాను… వాళ్లూ సహకరిస్తామన్నారు… నా అవసరాలకూ, నా దగ్గర ఉన్న డబ్బుకూ నడుమ గ్యాప్ ఉంది… నా ఆభరణాలు కొన్ని, కారు అమ్మేశాను… కొన్ని నగల మీద లోన్ తీసుకున్నాను… దారి పొడవునా తలా ఒక రూపాయి చందా ఇవ్వమంటూ అడగాలని నిర్ణయించుకున్నాను…
కొద్దిరోజులపాటు కోయంబత్తూరులోని, ఇషా యోగా సెంటర్‌లో దైహిక, మానసిక శిక్షణ తీసుకున్నాను… కొన్ని నెలల కసరత్తు తరువాత గేట్ వే ఆఫ్ ఇండియా వద్ద మొన్నటి మార్చి ఎనిమిదిన, అంతర్జాతీయ మహిళా దినాన నిలబడి, నాలో నన్ను చూసుకున్నాను… ఆయి వచ్చిందక్కడికి… ‘ఐయామ్ ప్రౌడ్ ఆఫ్ యు’ అంది… ఆమె పాదాలు టచ్ చేసి, ఇక బైక జర్నీ స్టార్ట్ చేశాను… నెల రోజులు గడిచింది… మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, ఢిల్లీలు దాటేశాను… నైనిటాల్‌లో ఉన్నాను ఇప్పుడు… చాలామంది కలుస్తున్నారు… ఆశీర్వదిస్తున్నారు… బ్యూటిఫుల్ జర్నీ… నాసిక్‌లో ఓచోట టీస్టాల్ ఓనర్ ‘‘నీకు చాయ్ పోయడానికి నాకే గర్వంగా ఉంది’’ అన్నప్పుడు నాకూ గర్వం అనిపించింది…
ఉజ్జయినిలో ఓ అక్క కుటుంబం ఆతిథ్యం ఇచ్చింది… తిరిగి బయల్దేరేటప్పుడు పప్పన్నం ప్యాక్ చేసి ఇచ్చింది… దారిలో ఇదే తిను అని చెప్పింది… అతిథి దేవో భవ అనేది వారి నిజ ఆతిథ్యంలో కనిపించింది… ఇలా బోలెడు అనుభవాలు… ప్రధాని కార్యాలయం నుంచి మోడీని కలవడానికి ఆహ్వానం వచ్చింది… ‘‘మీరు మరింత మంది మహిళలకు, బాలికలకు స్పూర్తినిస్తారని ఆశిస్తున్నాను’’ అన్నాడాయన… నిజమే, అదే నా సంకల్పం, నా ఆశయం… ఎలాగూ నేను తిరిగి రావడానికి ఏడాది పడుతుంది… పలుచోట్ల జనం అడుగుతుంటారు… ‘‘నిజంగా ఈ ఫీట్ సాధిస్తారా’’ అని… ఎందుకు చేయలేను… చేసే క్రమంలోనే ఉన్నాను కదా… వాళ్ల సందేహాలకు నా ప్రయాణమే జవాబు… ఏమంటారు..?
తెలుసు, నాకు ఎదురయ్యే సవాళ్లు తెలుసు… దాదాపు 80 వేల కిలోమీటర్లు తిరగాలి… దట్టమైన అడవులు, ఎత్తయిన గుట్టలు, మంచు ప్రాంతాలు మొదలైనవి దాటాల్సి ఉంటుందనీ తెలుసు… వెదర్ కండిషన్స్ మరో చాలెంజ్, ప్లస్ ఒంటరి ప్రయాణమేననీ తెలుసు… పెర్త్ నుంచి సిడ్నీ వరకు 1600 కిలోమీటర్లు పెద్ద చాలెంజ్, మానవ ఆవాసాలు కనిపించవు… మొబైల్ కనెక్టివిటీ ఉండదు… ఒంటరిగా నేనే టెంట్ వేసుకుని కాలం గడపాలి… ఎస్, అవన్నీ చేస్తేనే కదా నేను భారత్ కే బేటీ అయ్యేది… అన్నట్టు నా పేరే చెప్పలేదు కదూ… రమాబాయ్ లట్‌పటే… మా ఊరు పూణె… అప్పుడప్పుడూ ఇలా నా ట్రావెలాగ్‌తో పలకరిస్తాను, సరేనా..?!
Share this Article