తెలంగాణ ఉద్యమం జరుగుతున్నన్ని రోజులూ… ఓ శాలువా కప్పుకున్న పెద్దమనిషి అన్ని టీవీలలో భీకరంగా వాదించేవాడు… బొచ్చెడు గణాంకాల్ని ఏకరువు పెట్టేవాడు… సరే, సత్యవాణి దగ్గర్నుంచి గజల్ సీను, లగడపాటి, అశోక్బాబు దాకా బోలెడుమంది… ఈ చలసాని శ్రీనివాస్ కూడా అలాంటి వారిలో ఒకరులే అనుకునేవాళ్లు తెలంగాణ ఉద్యమకారులు… కొన్ని సంస్థలు, సంఘాలు ఉంటయ్… వాటి పుట్టుక ఎప్పుడో, వాటి నిర్మాణం ఏమిటో, ఏం ఉద్యమాలు నిర్మించారో, ఊరూరా ఏం చైతన్యాన్ని రగిలించారో, ఆయా కమిటీల్లో ఎవరెవరున్నారో మనకు అనవసరం… సరే, సమాజం అన్నాక, రాజకీయాలు అన్నాక బోలెడు కవర్ సంఘాలుంటయ్… కానీ..?
ఏదో ఒక ఇష్యూ… రెడీగా ఒక సంఘం ఉంటుంది… మిత్రుడు రాచర్ల శివ అన్నట్టుగా… ఈయన…
ఆంధ్రా మేధావుల సంఘం అధ్యక్షుడు,
Ads
సమైఖ్య ఆంధ్ర ఉద్యమ సమితి అధ్యక్షుడు,
విభజన హామీల సాధనా సమితి అధ్యక్షుడు,
ప్రత్యేకహోదా సాధన సమితి అధ్యక్షుడు,
తెలుగు భాషా పరిరక్షణసంఘం అధ్యక్షుడు,
ఇప్పుడు పోలవరం సాధనా సమితి అధ్యక్షుడు…
సరే… ఆంధ్రా సమాజానికి ఆ అవసరం బాగా ఉంది అనుకుందాం… ఆయన సిన్సియారిటీని కూడా శంకించాల్సిన, ప్రశ్నించాల్సిన పనిలేదు… అది ఆయన ఇష్టం… ఏ ఇష్యూ మీద ఏం పోరాటం చేయాలో, ఎలా చేయాలో, ఎవరి కోసం చేయాలో మనం కాదు నిర్దేశించాల్సింది… అయితే… నవ్వొచ్చిందీ, జగన్ ప్రభుత్వం మీద జాలేసింది ఏమిటంటే..?
ఆయన పోలవరం ప్రాజెక్టు సాధన సమితి అధ్యక్షుడిగా పోలవరం పరిశీలనకు వెళ్లాడట… సరే, వెళ్తే వెళ్లాడులే… అసలు పోలవరం కట్టేస్తున్నారు కదా, ఇంకా సాధన సమితి ఏమిటి..? పైగా ఇదెప్పుడు పుట్టుకొచ్చింది..? ఆ ప్రాజెక్టును కొత్తగా సాధించేదేముంది..? ఓహో… పోలవరం కట్టేదాకా దగ్గరుండి మరీ చూసుకునే సమితియా..? సరే, సరే…
అంతా బాగానే ఉంది గానీ… ఓ మామూలు మనిషో, ఓ విలేఖరో అక్కడికి వెళ్తే పురుగును చూసినట్టుగా చూసి, అక్కడి నుంచి వెళ్లగొడతారు కదా… అలాంటిది ఏదో కేంద్ర బృందం వస్తే చూపించినట్టుగా… జగన్ సర్కారు ఇరిగేషన్ అధికారులు ఆయనకు మ్యాప్ చూపిస్తూ మరీ ప్రాజెక్టును ప్రగతిని వివరించారుట… అంటే చలసాని వారి సాధన సమితిని జగన్ సర్కారు అధికారికంగా ‘‘గుర్తించిందా..?’’
ఇంకా నవ్వొచ్చింది ఏమిటీ అంటే..? ఈ ప్రాజెక్టు నిర్మాణం చేపట్టిన మేఘా సంస్థ ప్రతినిధులు కూడా చలసాని వారికి అన్నీ వివరించి, సారు గారిని కన్విన్స్ చేయడానికి ప్రయత్నించడం..! జగన్ సర్కారు ఫాఫం, చలసానికి గనుక కోపమొస్తే తనకు రాజకీయంగా బోలెడు నష్టం జరుగుతుందని వణికిపోవచ్చుగాక.., ఈ మేఘా వాళ్లకు ఆయన్ని గుర్తించి, ఆ ప్రగతిని వివరించడం ఏం పని..? ప్చ్.., జగన్ సర్కారు పరిస్థితి మరీ ఇంత సున్నితంగా ఉందేమిటో…
అసలు నవ్వు ఆపుకోలేకపోయింది ఏమిటీ అంటే..? ఆయన ఆర్అండ్ఆర్ నిధులపై అలసత్వం వద్దని కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరించాడట… మోడీ గనుక ఉపేక్షిస్తే తాటతీస్తా అన్నట్టుగా ‘‘మళ్లీ ఉద్యమించాల్సి ఉంటుంద’’ని స్పష్టం చేశాడట… అంటే ఒక దశ ఉద్యమం చేశాడా..? ఎప్పుడు..? ఎవరి మీద..? ఏమని..? సర్లెండి…
ఇక కిందపడి దొర్లుతూ నవ్వుకునే ఓ ఫైనల్ పంచ్ డైలాగ్ ఉంది… మిస్సు కావొద్దు సుమా… ‘‘అపోహలు వద్దు, ప్రాజెక్టు పనులు నిర్ణీత సమయానికే పూర్తవుతాయి’’ అని చెప్పాడట… ఎవరి తరఫున చెప్పాడు ఇది… ఈ ప్రాజెక్టుకు డబ్బులిచ్చే మోడీ తరఫునా..? ప్రాజెక్టు కడుతున్న జగన్ తరఫునా..? పర్యవేక్షించాల్సిన సాగునీటి శాఖ తరఫునా..? పనులు చేస్తున్న మేఘా తరఫునా..? కొంపదీసి… జగన్ క్యాంపు ఈయన గారిని లాగేసుకుందా..? హేమిటో… ఏపీలో ఏం జరిగినా సరే, అంతా మర్మగర్భమే… పోలవరం లెక్కల్లాగా…!! సార్, సార్… ఇప్పట్లో ఇంకేదైనా కొత్త సంఘం ఏమైనా పెట్టనున్నారా..? ఏ అంశం మీద సార్..?
ఇదీ పెద్దలు చలసాని శ్రీనివాస్ ఫేస్బుక్ వాల్ మీద కనిపించింది… ఆయన మీద ఆధారపడి బతుకుతున్నాయట కొన్ని వెబ్సైట్స్… *ముచ్చట’ ఏమీ భుజాలు తడుముకోవడం లేదు గానీ… ఆయన మీద ఏమైనా రాస్తే జనం అంతగా విరగబడి చదువుతారు అని ఇన్నాళ్లూ తెలియలేదు సుమీ… అవునూ, ఈమధ్య జగన్ నెలనెలా డబ్బులు సరిగ్గా పంపించడం లేదు సార్… ఆమధ్య రెగ్యులర్గా, భారీగా పంపించేవాడు… వశపడనంత సొమ్ము, ఏం చేసుకోవాలో అర్థమయ్యేది కాదు… ఇప్పుడేమో హఠాత్తుగా ఇలా తయారయ్యాడు… ‘పేటీఎం పేమెంట్ సాధన సమితి’ అని ఒకటి పెట్టాల్సిందే ఇక… జగనూ కాచుకో…!!
Share this Article