.
Subramanyam Dogiparthi …….. Platonic love . రెండు మనసుల సంగమం . శరీరాల సంగమం కాదు . ఇద్దరు భావుకుల రస సంగమం . ఇదేదో లేత వయసులో ఉన్న పిల్లల వ్యవహారం కాదు .
ఓ గ్రామంలో పెద్ద దిక్కుగా గౌరవించబడే భావుకుడు అందరి ముందు నాట్యం చేసే ఓ దేవదాసిల భావ సంగమం . ఇంత అతి సున్నితమైన , ఆటం బాంబు లాంటి అంశాన్ని తీసుకుని ఓ దృశ్యకావ్యంగా , కళాఖండంగా , కలకాలం రస హృదయులు గుర్తుంచుకునే విధంగా నిర్మించిన దాసరికి శత సహస్ర అభినందనలు .
Ads
ఓ మల్లీశ్వరి , ఓ విప్రనారాయణ , ఓ శంకరాభరణం , ఓ మేఘసందేశం . అద్భుతం . నాకు గుర్తున్నంత వరకు మొదట విడుదల అయినప్పుడు ప్రేక్షకులు ఆదరించలేదు . Platonic love కన్విన్సింగుగా అనిపించలేదు . అర్థం అవటానికి , అర్థం చేసుకోవటానికి ప్రేక్షకులకు టైం పట్టింది . ఇందుకు దాసరి కూడా కారణమే .
సినిమాలో ఎక్కడా వారు ఇరువురి మధ్య శారీరిక సంబంధం లేదు అని ఎస్టాబ్లిష్ చేయటానికి ప్రయత్నం కూడా చేయలేదు . ప్రేక్షకులకే వదిలేసినట్లుగా ఉంది .
ఈ సినిమా కళా విజయానికి రమేష్ నాయుడు సంగీత దర్శకత్వం , దేవులపల్లి, వేటూరిల సాహిత్యం , జేసుదాస్ సుశీలమ్మల గొంతులు , పసుమర్తి కృష్ణమూర్తి నృత్య దర్శకత్వం ప్రధాన పాత్ర వహించాయి . దేవులపల్లి , వేటూరి చెరో నాలుగు పాటలు వ్రాసారు . జయదేవుడి అష్టపదుల నుంచి ఓ రెండు తెచ్చారు . అన్నీ ఆణిముత్యాలే .
ఈ పాటల చిత్రీకరణ , వాటి అందానికి కనపడకుండా ప్రేక్షకులకు కనిపించే , వినిపించే విధంగా ఆవిష్కరించిన వారు మరో ఇద్దరు ఉన్నారు . ఒకరు ఫొటోగ్రఫీ డైరెక్టర్ సెల్వరాజ్ , మరొకరు ఆడియోగ్రాఫర్ స్వామినాధన్ . వీరిద్దరికీ నంది అవార్డులు వచ్చాయి .
మహాకవి కాళిదాసు విరచిత మేఘసందేశం దాసరికి ప్రేరణ అయిఉండాలి . ఆకాశ దేశాన ఆషాఢ మాసాన మెరిసేటి ఓ మేఘమా విరహమో దాహమో విడలేని మోహమో వినిపించు నా చెలికి మేఘసందేశం . ఆహా, వేటూరి వారు ఏం వ్రాసారు ! తగ్గట్టుగానే జేసుదాస్ గాత్రం . బ్రహ్మాండమైన డిక్షన్ . ఈ పాటకే జేసుదాసుకు జాతీయ స్థాయిలో ఉత్తమ నేపధ్య గాయకుడి అవార్డు వచ్చింది .
జయదేవుని అష్ట విధ నాయికలలో ఒకరు విరహోత్కంఠిత . ఆయన వ్రాసిన రాధికా కృష్ణా తవ విరహే కేశవా స్థన విని హితమపి హారముదారం పదాలకు జయప్రద నృత్యం చాలా బాగుంటుంది . జేసుదాస్ , సుశీలమ్మలు చాలా శ్రావ్యంగా పాడారు . ప్రియే చారుశీలే పాటలో జయప్రద , సుభాషిణిల నృత్యం చాలా బాగుంటుంది . సుభాషిణి కూడా జయప్రదతో పోటీ పడింది . జేసుదాస్ , సుశీలమ్మలు పాడారు .
దేవులపల్లి వారు వ్రాసిన ముందు తెలిసిన ప్రభూ మందిరమిటులుంచేనా పాటకు ప్రాణం పోసింది సుశీలమ్మ . నవరస సుమ మాలికా నా జీవనాధార నవరాగ మాలికా అంటూ సాగే వేటూరి వారి పాటను హంపిలో చిత్రీకరించారు . జయప్రద నృత్యం కన్నుల పండగే . వేటూరి వ్రాసిందే నిన్నటిదాకా శిలనయినా నీ పదము సోకి గౌతమినయినా . ఈ పాటలో కూడా జయప్రద నాట్యం చాలా బాగుంటుంది .
ఈ సినిమాకు హైలైట్ బాల మురళీకృష్ణ పాడిన పాడనా వాణి కల్యాణిగా వరరాణి పాదాల పారాణిగా . వేటూరి తాండవించారనే చెప్పాలి ఈ పాటలో. ఈ కచేరీ ఒకవైపు జరుగుతుంటే మరోవైపు జయప్రద నృత్యం . హేట్సాఫ్ టు దాసరి . దేవులపల్లి వ్రాసిన మరో ఆణిముత్యం శీతవేళ రానీయకు శిశిరానికి చోటీయకు ఎద లోపల పూలకారు ఏనాటికి పోనీయకు . ఆ పూలకారు పదం ఎక్కడ నుండి దిగుమతి చేసారో మహానుభావుడు . జేసుదాస్ , సుశీలమ్మలు పాడారు .
ఆయన వ్రాసిందే మరో పాట చాలా హిట్టయింది . ఆకులో ఆకునై పూవులో పూవునై కొమ్మలో కొమ్మనై నును లేత రెమ్మనై . ఎంత శ్రావ్యంగా ఉంటుందో ! ఆయనదే మొదటి రాత్రి పాట సిగలో అవి విరులో అదరుపొదలో అత్తరులో శ్రావ్యంగా ఉంటుంది .
మధ్యవయసు ప్రేమను తీసుకుని కత్తి మీద సాము చేసిన దాసరి మధ్యలో అక్కినేనిని మందు కొట్టని దేవదాసుని కూడా చేస్తారు . కమర్షియల్ చిత్రాలను విజయవంతంగా తీసే దాసరి విశ్వనాధ్ లాగా , బి యన్ రెడ్డి లాగా ఒక దృశ్య కావ్యాన్ని అవార్డుల వర్షంతో తెలుగు సినీ రంగానికి అందించారు .
జాతీయ స్థాయిలో నాలుగు అవార్డులు వచ్చాయి . రమేష్ నాయుడికి , దాసరికి , జేసుదాసుకి , సుశీలమ్మకు . ఆరు నంది అవార్డులు వచ్చాయి . జయసుధకి , అక్కినేనికి , దాసరికి , సెల్వరాజుకి , రమేష్ నాయుడికి , స్వామినాధనుకి . ఉత్తమ చిత్రంగా ఫిలింఫేర్ అవార్డు .
ఇలాంటి కళాఖండం అక్కినేని 200వ చిత్రంగా రావడం అక్కినేనికి గొప్ప కానుకే . ఇద్దరు హీరోయిన్లు తమ తమ పాత్రలకు ప్రాణం పోసారు . మరో ప్రధాన పాత్రలో జగ్గయ్య నటించారు . జయప్రద తమ్ముడు రాజబాబు కూడా కనిపిస్తాడు . 1982 అక్టోబర్ 24 న విడుదల అయింది .
సంగీత , సాహిత్య , నృత్య విద్యార్ధులకు ఒక సబ్జెక్ట్ లాంటిది ఈ సినిమా . ఇంతటి కళాత్మక చిత్రం చూడకపోతే ఎలా ! నేనయితే ఎన్ని సార్లు చూసి ఉంటానో ! సినిమా , పాటలు అన్నీ యూట్యూబులో ఉన్నాయి . It’s a musical and visual feast . ఆస్వాదించండి . #తెలుగుసినిమాలసింహావలోకనం #తెలుగుసినిమాలు #సినిమా_కబుర్లు
Share this Article