.
Subramanyam Dogiparthi ….. ఎవరికి ఎవరు ఎదురవుతారు , మనసు మనసు ముడిపెడతారు , ఎందుకు వస్తారో ఎందుకు వెళతారో ! ఈ మాటల పాటతో ముగుస్తుంది సినిమా . గొప్ప జీవిత సారాంశం . ఈ ఫిలసాఫికల్ ముగింపుతో ముగుస్తుంది ఈ వసంత కోకిల సినిమా . పేరుకు డబ్బింగ్ సినిమాయే కాని మామూలు సినిమాలతో పోటీపడి నేటికీ ఓ గొప్ప సినిమాగా నిలిచిపోయింది .
శ్రీదేవి , కమల్ హాసన్ నట విశ్వరూపం అని అనవచ్చు . గ్లామర్ పాత్రలే కాదు ఇలాంటి డి-గ్లామర్ పాత్రలను కూడా అద్భుతంగా నటించగలను అని రుజువు చేసుకున్నది శ్రీదేవి . కమల్ హాసన్ క్లైమాక్సులో రైల్వే స్టేషన్లో ప్రదర్శించే నటన బాగుంటుంది . ఈ సినిమా పేరు చెప్పగానే గుర్తుకు వచ్చే సీన్ అది ; అదే .
Ads
ఈ రెండు పాత్రల తర్వాత ప్రేక్షకులు మరచిపోలేనిది సిల్క్ స్మిత పాత్ర . మెయిన్ ట్రాకుకు పెద్దగా కనెక్షన్ లేకపోయినా సిల్క్ స్మిత రొమాంటిక్ లుక్స్ , తన తీపి ఊహలో కమల్ హాసన్ తో డాన్స్ ప్రేక్షకులు మరచిపోలేరు . ఇద్దరూ అదరగొట్టేసారు ఆ డాన్సులో .
ఈ సినిమా విడుదల అయ్యాక ఓ సంవత్సరానికి వచ్చింది చిరంజీవి ఖైదీ . ఆ సినిమాలో చిరంజీవి , మాధవి సర్ప నృత్యంలోని ఆహార్యం కమల్ హాసన్ , సిల్క్ స్మిత ఆహార్యానికి కాస్త దగ్గరగా అనిపిస్తుంది . డాన్స్ కూడా . ఊరించే వయసిది లాలించే మనసిది . మైలవరపు గోపి ఎంత బాగా వ్రాసాడో !
మిగిలిన పాటల్ని కూడా గోపి చాలా బాగా వ్రాసారు . కధగా కల్పనగా కనిపించెను నాకొక దొరసాని పాట ఎంతో శ్రావ్యంగా ఉంటుంది . బాల సుబ్రమణ్యం చాలా బాగా పాడారు . డబ్బింగ్ పాటలాగా అనిపించదు . ఈ లోకం అతి పచ్చన తోడుంటే నీ పక్కన , ఎవరూ ఆపలేరు వీచే గాలిని పాటలు బాగుంటాయి . ఇళయ రాజా & వేలూరి కృష్ణమూర్తిలు సంగీత దర్శకత్వం నిర్వహించారు .
1982 ఫిబ్రవరిలో వచ్చిన మూండ్రం పిరై తమిళ సినిమాకు డబ్బింగ్ మన వసంత కోకిల . టైటిలే చాలా రొమాంటిక్ . ఆ టైటిల్ ఐడియా ఎవరికి తట్టిందో కాని , హేట్సాఫ్ . కధ , స్క్రీన్ ప్లే , ఫొటోగ్రఫీ , దర్శకత్వం బాలు మహేంద్రవే . 1983 లో సద్మా అనే టైటిలుతో హిందీలో కూడా తీసారు . అన్ని చోట్ల విజయ ఢంకా మోగించింది .
అవార్డుల వర్షం కురిసింది . జాతీయ స్థాయిలో ఉత్తమ నటుడు , ఉత్తమ ఫొటోగ్రఫీ అవార్డులు ; ఉత్తమ దర్శకుడు ఫిలిం ఫేర్ అవార్డు ; రాష్ట్ర స్థాయిలో మూడవ ఉత్తమ చిత్రం , ఉత్తమ నటుడు , ఉత్తమ నటి , ఉత్తమ నేపధ్య గాయకుడు , ఉత్తమ నేపధ్య గాయని అవార్డులు వచ్చాయి .
సాదాసీదా కధ . అందమైన ప్రకృతికి నెలవైన ఊటీలో సెలయేరులాగా నడుస్తుంది సినిమా . ఆమె ఎవరో తెలియకపోయినా ఆమె నిస్సహాయ అమాయకత్వానికి చలించి తనతో ఇంటికి తీసుకుని వెళ్లి చిన్న పిల్లను సాకినట్లు సాకి , గతం గుర్తుకొచ్చేలా వైద్యం చేయించి , తీరా గతం గుర్తుకొచ్చాక జారవిడుచుకునే పాత్రను బాలు మహేంద్ర గొప్పగా సృష్టించి , అంతకన్నా గొప్పగా పోర్ట్రే చేసాడు .
గొప్ప సృజనాత్మకత కలిగిన దర్శకులలో ఒకడు బాలు మహేంద్ర . బాలచందర్ లాగా సినిమాలను విషాదాంతం చేస్తాడని కోపం వచ్చినా , నిజ జీవితాలు అలాగే ఉంటాయి కదా ! జీవితంలోకి ఎవరు ఎందుకు వస్తారో , ఎందుకు దుర్మార్గంగా నిష్క్రమిస్తారో తెలుసా మనకు ! లేదు కదా ! మనసున్న మనుషులకే పెడతాడు కష్టాలు దేవుడు .
నాకిష్టమైన సినిమాలలో ఒకటి వసంతం లాంటి ఈ వసంత కోకిల .1982 చివర్లో రిలీజయింది . యూట్యూబులో ఉంది . చూసి ఉండకపోతే తప్పక చూడండి . ఆస్వాదించండి . An unmissable , beautiful , tragic , romantic movie . #తెలుగుసినిమాలసింహావలోకనం #తెలుగుసినిమాలు #సినిమాకబుర్లు
ఈ సినిమా కథ మీద కొన్ని విమర్శలు కూడా వినిపించాయి అప్పట్లో… ఏమంటే..? శ్రీదేవికి తన గతం గుర్తొస్తుంది, అక్కడికొచ్చిన తనవాళ్లతో కలిసి రైల్వే స్టేషన్ వెళ్లిపోతుంది… కానీ ఇన్ని రోజులు ఎక్కడుంది..? ఎలా బతికింది తెలుసుకోవాలనే ధ్యాస వాళ్లకూ ఉండదు…
శ్రీదేవికీ ఉండదు… జస్ట్, సింపుల్‌గా గతం గుర్తుకురాగానే అలా వెళ్లిపోతుంది… పోనీ, కమలహాసన్ అయినా ఆమెకు తమ పరిచయం గుర్తుచేయాలని అనిపిస్తే వాళ్ల తల్లిదండ్రులకు చెప్పి, ఇన్నాళ్లూ నేనే ఆమెను శ్రద్ధగా చూసుకున్నాను అని చెప్పి, వీడ్కోలు చెప్పాలి కదా… దాని బదులు కోతిలా గెంతుతూ ఏదో గుర్తుచేయడానికి ప్రయత్నిస్తాడు… తనతో గడిపిన గతం ఆమెకు గుర్తుండదు కదా… ఐనా అలా సింపుల్‌గా ముగిస్తే డ్రామా ఏముంది అనుకున్నాడేమో దర్శకుడు…
బట్, వోకే… తనకు అప్పగించిన పాత్రలోకి కమలహాసన్ అద్భుతంగా పరకాయ ప్రవేశం చేశాడు… అక్కడి వరకూ గుడ్… అన్నింటికీ మించి సినిమాలో శ్రీదేవి నటనలో అనుభవం, మెచ్యూరిటీ కనిపిస్తాయి… ఆ సినిమా నాటికి ఆ వయస్సులో శ్రీదేవి ముగ్ధ… ఆ తరువాత అనేక ప్లాస్టిక్ సర్జరీలతో తన ఒరిజినల్ అందాన్ని కోల్పోయింది… నిజమైన శ్రీదేవి ప్రేమికులకు… అప్పటిదాకా పిల్ల చేష్టల శ్రీదేవిని చూసినవాళ్లకు ఆమె ఈ సినిమాలో నిజంగానే ఓ వసంత కోకిల..!! (ముచ్చట)
Share this Article