.
మొన్నామధ్య సాగరసంగమం సినిమా సమీక్ష ఒకటి రాస్తుంటే… మళ్లీ చూడాలనిపించింది… యూట్యూబులో మంచి ప్రింట్ కూడా ఉంది… అదేమిటో గానీ అది ఎన్నిసార్లు చూస్తుంటే అన్ని సీన్లు కొత్తగా కనెక్టవుతాయి…
అంతులేని ఆనందంతో జయప్రద చేతిని ముద్దాడటం, ఆమె తనను ప్రేమిస్తున్నదనే భావనతో అర్థంతరంగా కారు దిగి, ఓ బండరాయిపై కూర్చుని ఆ ఫీలింగ్ ఆస్వాదించడం, జయప్రద నొసటన బొట్టు కారిపోకుండా అరచేయి అడ్డుపెట్టడం, తల్లి శవం దగ్గర నాట్యం, నాట్యంలో హావభావాలు ఏమిటో శైలజకు చేసిచూపించడం, ఖైరతాబాద్ గణేష విగ్రహం ఎదుట బాధతో నాట్యం చేయడం.., ఎన్ని..? ఎన్నెన్ని..?
Ads
నిజానికి ఆయా సీన్లకు సంబంధించి విశ్వనాథ్ దర్శకత్వ ప్రతిభ కావచ్చు, ఆయా నటీనటుల నటప్రతిభ కావచ్చు… కానీ బీజీఎం ప్రతి సీనూ ఎలివేట్ చేసింది… బీజీఎం అంటే ఎలా ఉండాలో డీఎస్పీ, తమన్, అజనీష్ వంటి సుప్రసిద్ధ సంగీత దర్శకులు కూడా సాగరసంగమం చూసి మరోసారి నేర్చుకోవాలి…
అన్నింట్లో హైలైట్ సీన్ ఏమిటీ అంటే..? జయప్రద బీచులో కమలహాసన్‌ను కలవడానికి పరుగెత్తి రావడం… ఎందుకంటే అప్పటికే ఆమె వివాహిత… ఏవో కారణాలతో మొగుడు దూరంగా ఉంటాడు… జీవితం నిస్సారంగా గడిచిపోతున్నప్పుడు కమలహాసన్ ఓ కొత్త వెలుతురులా ప్రవేశిస్తాడు…
ఇద్దరిదీ సేమ్ అభిరుచి, కమలహాసన్ ఆమె గతం తెలియక ఐ లవ్ యూ, ఐ విల్ మ్యారీ యూ అని ఫోన్‌లో ప్రపోజ్ చేస్తాడు… ఆమెలో మథనం… ఏం చేయాలి..? గాలికదుపు లేదు, కడలికంతు లేదు అనే పాటలో భావనలా… కిందామీదా పడుతుంది… చివరకు కమలహాసన్‌కు వోకే చెప్పడానికి పరుగెత్తి వస్తుంటుంది…
కానీ ఆమె గతం తెలిసి, ఆమెను ప్రేమిస్తున్నట్టు ఎందుకు చెప్పానా అనే మథనంతో… తను అప్పటికే ఆ బాధతో బీచులో నర్తించీ నర్తించీ అలిసిపోయి కూర్చుంటాడు… తన వైపు పరుగెత్తి వస్తూ, హఠాత్తుగా మధ్యలో తన భర్తను చూసి చటుక్కున ఆగిపోతుంది… నిజంగా సరైన దర్శకుడి చేతిలో పడాలే గానీ జయప్రద సూపర్బ్ యాక్ట్రెస్…
సినిమాలో ఇదే పెద్ద ట్విస్టు… గతాన్ని మరిచిపోయి, తనను ప్రేమించేవాడికి వోకే చెప్పాలని మనసులో ఖరారు చేసుకుని వస్తూ… మధ్యలో ఆ గతమే ఎదుట నిలబడేసరికి… ఓవైపు ప్రేమికుడు, మరోవైపు భర్త… గుడ్ బీజీఎం, గుడ్ యాక్షన్… కమలహాసన్‌ను మించిపోయింది జయప్రద ఆ సీన్‌లో…
ఆ ఇద్దరు దంపతులకు ఈ ప్రేమికుడు రైల్వే స్టేషన్‌లో వీడ్కోలు చెప్పే సీన్‌లో జయప్రద, కమలహాసన్ పోటాపోటీ నటన అసలు… అక్కడ బీజీఎం అయితే చెప్పక్కర్లేదు… మొత్తం కథలో ఉద్వేగాల మోతాదు మరీ ఎక్కువైనట్టు అనిపించినా సరే… కొందరికి ఆ కథాకథనాలు నచ్చకపోయినా సరే… స్థూలంగా సినిమా అనేక కోణాల్లో ఈరోజుకూ ఓ ఆణిముత్యమే..!!
Share this Article