నిజానికి పాపులర్ సినిమా పాటల మీద కూడా మనవాళ్లు గతం నుంచీ పెద్ద విమర్శో, విశ్లేషణో పట్టించుకోరు… ఇప్పుడంటే ఓ కొత్త సినిమా పాట రాగానే, అదెంత చెత్తగా ఏడ్చినా సరే, మెయిన్ స్ట్రీమ్ మీడియా దగ్గర్నుంచి టీవీలు, సైట్లు, ట్యూబర్లు ఒకటే డప్పు దంచి కొడుతున్నారు… భాష రాని సిధ్ శ్రీరాంకూ నీరాజనాలు పలుకుతున్నారు… కానీ ఇంతకుముందు అసలు సినిమా పాటను ఓ సాహిత్యంగానే పరిగణించేవాళ్లు కాదు… రాసేవాళ్లు, కంపోజ్ చేసేవాళ్లు, ఆడేవాళ్లు, ఆడించేవాళ్లు, పాడేవాళ్లు, తీసేవాళ్లు కూడా దాన్నలాగే భ్రష్టుపట్టించారు…
కాకపోతే ఆరుద్ర, ఆత్రేయ, వేటూరి, శ్రీశ్రీ, సినారె తదితరులు కొన్ని మంచి పాటలు రాశారు… (వాళ్లు రాసిన చెత్తా గీతాలు కూడా బోలెడు ఉన్నయ్… సినిమా రంగం అంటేనే ఓ పబ్బు, క్లబ్బు, గబ్బు, జబ్బు…) అభిరుచి కలిగిన నిర్మాతలో, దర్శకులో అలా కొన్ని మంచి పాటలు రాయించుకున్నారు, దానికి తగిన మంచి ట్యూన్లు సరేసరి… రాసేవాడికీ, ట్యూన్ కట్టేవాడికీ నడుమ ఓ కనెక్షన్ ఉండేది…
అసలు ఇప్పుడు ఒక పాట రికార్డింగ్ అంటే… ఎవరి పార్ట్, ఎవరి ట్రాక్ వాళ్లు పాడేసి వెళ్లిపోవడమే… దాన్ని ట్యూన్‌లో సరిగ్గా ఇరికించేసి, లిరికల్ వీడియో ఒకటి యూట్యూబ్‌లో వదలడమే… ఇక పాటగాళ్లు, కంపోజ్‌గాళ్లు, రాతగాళ్లు కలిసేదెక్కడ… భావాల్ని, శృతుల్నీ పంచుకునేదెక్కడ..? ఇప్పుడైతే ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ పాటగాళ్లు పాడిన అపశృతుల్ని కూడా సరిచేస్తోందిట… కంప్యూటర్లకు కర్నాటక సంగీతం ఓ లెక్కా ఏం..?
Ads
ఒకానొక కాలంలో… అంటే హిమసమూహాలు కురుస్తున్న ఆ రోజుల్లో… 1979లో బాలచందర్ సినిమా ఒకటి వచ్చింది, సినిమా పేరు గుప్పెడు మనసు… సరిత, శరత్, సుజాత తదితరులు తారాగణం… అప్పట్లో బాలచందర్ సినిమాలు అంటే ఓ క్రేజ్… కథ, కథనం, డెప్త్, పాటలు, నటన… ఏక్‌సేఏక్… ప్రేక్షకుల్ని అలా కట్టిపడేసేవి… గుప్పెడు మనసులో మంగళంపల్లితో ఓ పాట పాడించారు… రాసిందేమో ఆత్రేయ… అది మనసు వేదనకు, తత్వానికి సంబంధించి ఎమోషనల్ సాంగ్…
మనసు అనగానే ఆత్రేయ మనసుపెట్టి రాస్తాడు కదా… అంతే మనసుపెట్టి బాలమురళి పాడాడు… ఆయన పాడిన పాటలే తక్కువ… వాటిల్లో ఇదొకటి, ఆయన పేరు వినగానే తట్టే పాట ఇది… మంద్రంగా, మనసు లోతుల్ని తడుతూ, తడుముతూ, తడిని తట్టిలేపుతూ సాగిపోతుంది… నిజానికి చాలా సింపుల్ ట్యూన్‌తో, సరళమైన పదాలతో ఆ పాట ఉన్నదే ఏడెనిమిది వాక్యాలు… కానీ లోతైన భావంతో ఒకసారి వింటే కొంతసేపు వెంటాడుతుంది అలా…
మౌనమే నీ భాష ఓ మూగ మనసా…
తలపులు ఎన్నెన్నో కలలుగ కంటావు…
కల్లలు కాగానె కన్నీరవుతావు..
ఎందుకు వలచేవో.. ఎందుకు వగచేవో
ఎందుకు రగిలేవో.. ఏమై మిగిలేవో…
కోర్కెల సెల నీవు.. కూరిమి వల నీవు
ఊహల ఉయ్యాలవే మనసా.. మాయల దయ్యానివే
లేనిది కోరేవు.. ఉన్నది వదిలేవు
ఒక పొరపాటుకు యుగములు పొగిలేవు….
తెలుగు సినిమాల్లో వైరాగ్యాన్ని, మనోవేదనను ఆవిష్కరించే పాటలే చాలా చాలా తక్కువ… ఆలోచనలో, వేదనలో ముప్పిరిగొన్నప్పుడు మనసు ఏ భాషలో తల్లడిల్లుతుంది… ఏమీ ఉండదు, మౌనంలోని జారిపోతుంది… అడుగులు అకస్మాత్తుగా ఆగిపోయి, గమ్యమేమిటో తోచనప్పుడూ అంతే… ఉద్వేగం గాఢత పెరిగినా అంతే… అసలు మనసే పెద్ద సమస్య… ఓపట్టాన నిలవనివ్వదు, ఉరకనివ్వదు…
అసలు మన మనస్తత్వాల, మనసు తత్వాల గురించి ఎవరైనా సమగ్రంగా ఏం చెప్పగలరు..? ఏదో ఆత్రేయ వంటి రచయిత అయితే కాస్త పట్టి చూపించగలడు… అదొక ఊహల ఉయ్యాలా, మాయల దెయ్యం అని టక్కున తేల్చేస్తాడు… లేనిది కావాలంటుంది మనసు, ఉన్నది వదిలేస్తుంది, తృప్తి- నిలకడ లేని మనసు ఓ చీకటి గుహ కాకపోతే, చింతలచెలి కాకపోతే మరేమిటి..? అంతే…
ఇదొక నాటకరంగం, తెగిన పతంగం… ఎవరిని ఎందుకు ప్రేమిస్తుందో తెలియదు, ఎందుకు రోదిస్తుందో తెలియదు, చివరకు ఏమైపోతుందో తెలియదు… ఒక పొరపాటు చేసి ఇక ఏడుస్తూనే ఉంటుంది… నిజంగా ఇదేపాట మరొకరు పాడితే ఈ భావం ఇంత బాగా ధ్వనించేదా..? సందేహమే…!! కొన్ని పాటలు కొన్ని గొంతుల నుంచే రావాలి… మనసును ఓ వేదనకు గురిచేస్తూ… నిశ్శబ్దాన్ని ఆలపిస్తూ…!! (నేడు ఆయన వర్ధంతి…)
Share this Article