.
Yanamadala Murali Krishna ….. —- జీవన కళలు… బతుకు నేర్పిన పాఠాలు—-
కాలం కన్నా ముందు… సహచరుల కన్నా మరీ మెరుగ్గా ఉంటే…
ఎక్కువ చికాకులు, కష్టాలను ఎదుర్కోవడానికి సిద్ధం కావాలి!
Ads
ఎంబీబీఎస్ తర్వాత ఏదో ఒక పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ చేసి, ఒక సీనియర్ డాక్టర్ దగ్గర పనిచేసి, నా సొంతూరు రామచంద్రపురంలో వైద్యశాల నిర్మించి ప్రాక్టీస్ చేయాలని మొదటి నుండి ఆలోచన ఉండేది.
కానీ, కాకినాడలో మాత్రమే చదువుకోవాలని నిర్ణయించుకోవడంతో మైక్రోబయాలజీ ఎం.డి.లో చేరాను. సాధారణంగా ఇది కొంచెం పెద్ద వయసు వాళ్ళు, మహిళలు మాత్రమే చేరే పెద్దగా ఒత్తిడి లేని విభాగం.
మెడికల్ కాలేజీలో ఉద్యోగాలు, బయట లేబొరేటరీతో ప్రశాంతమైన జీవితం గడపవచ్చు. నా నైజం ఏమో ప్రతి విషయాన్నీ లోతుగా తెలుసుకొని ఆత్మసంతృప్తి పొందడం… నా వేగం, వివేకం, కష్టించే తత్వం నా డిపార్ట్‌మెంట్‌కు సరిపోలేదు.
వసతులు, వనరులు సమృద్ధిగా ఉంటే అద్భుతమైన పరిశోధన అవకాశాలు ఉన్న ప్రాథమిక రంగం ఇది. కానీ ఏమీ లేక, ఊరికే ఒక డిగ్రీ చేయడం నాకు మహా ఇబ్బందిగా ఉండేది. నాలోని చురుకుదనం, వివేకం దాదాపు అందరికీ అసూయ కలిగించేవి. వారు ఏదో విధంగా నన్ను ఇబ్బంది పెట్టాలని చూసేవారు.
నిజానికి, ఆదివారాలతో సహా అన్ని సెలవు రోజులూ నేను పనిచేశాను. తోటివారి పని నుండి రికార్డ్ అసిస్టెంట్ల పని వరకు, ప్రొఫెసర్ పని వరకు అవిశ్రాంతంగా శ్రమించాను. ల్యాబ్ వర్క్‌లో నేను పనిచేస్తుంటే, ఎవరూ సహాయం చేయలేనంత వేగంగా ఉండేది నా పని.
డిపార్ట్‌మెంట్ చరిత్రలో ఏ పోస్ట్ గ్రాడ్యుయేట్ చెప్పనన్ని ఎక్కువ సంఖ్యలో ఎంబీబీఎస్ స్టూడెంట్స్‌కు క్లాసులు చెప్పాను. అయినా, నాపై ఓర్వలేనితనం దాదాపు అందరిలో కనిపించేది. నన్ను ఎలాగైనా ఫెయిల్ చేయాలని మా ప్రొఫెసర్‌కు చాలా పట్టుదలగా ఉండేది.
ఎండి మైక్రోబయాలజీకి మూడు రోజుల ప్రాక్టికల్స్ పరీక్షలు ఉంటాయి. అదే ఎంఎస్ సర్జరీకి, దాదాపు మిగతా అన్ని పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీలకు ఒకేరోజు ప్రాక్టికల్స్ ఉంటాయి. వారిని ఎవ్వరినీ సర్జరీ చేసి చూపించమని అడగరు.
అయితే, మేము మాత్రం ఇచ్చిన రక్తం లేదా చీము వంటి నమూనా నుండి బాక్టీరియాని పెంచి, ఏ మందులతో అదుపు చేయవచ్చో చూపించాలి. దీనికి రెండు రోజులు పడుతుంది. మూడో రోజు పిడగోజీ అనబడే టీచింగ్ మరియు మౌఖిక పరీక్ష (వైవా) ఉంటాయి.
నాకు బళ్లారి నుండి ఒక ఎక్స్‌టర్నల్ వచ్చారు. ఆయన మరీ ఎక్కువ సబ్జెక్ట్ తెలిసిన ప్రొఫెసర్. టైప్- 1 డయాబెటిక్ (రోజుకు రెండుసార్లు ఇన్సులిన్ ఇంజెక్షన్ తీసుకోవాలి), భార్యతో సఖ్యత ఉండదు అని అన్నారు. ఎవరినీ పాస్ చేయడం ఆయనకు ఇష్టం ఉండదు. స్టూడెంట్ కన్నీళ్లు పెట్టుకోవాలి… అది ఆయనకో సరదా!
(నేను పిజి అయ్యాక కొన్నేళ్ల తర్వాత ఆయన ఎగ్జామినర్‌గా వస్తుంటే, స్టూడెంట్స్ ఆయనను ఎదుర్కోవడం అసాధ్యమని, ఆయన ఎగ్జామినర్‌గా ఉంటే పరీక్షలకు హాజరు కాబోము, మార్చాలి అని ఆందోళన చేసి విజయం సాధించారు)…
నేను నా పరీక్షలలో చాలా ప్రశాంతంగా, అద్భుతంగా చేశాను. ఆయనను ఎదుర్కోవడం నాకు చాలా సరదాగా అనిపించింది. మూడో రోజు ఉదయం సెషన్ 1:40కి పూర్తయ్యాక, ఫ్రెష్ అయ్యి, లంచ్ చేసి 2 గంటలకల్లా ఫలాని క్లిష్టమైన అంశం మీద అన్ని టీచింగ్ ఎయిడ్స్‌తో అరగంట క్లాస్ చెప్పడానికి సిద్ధంగా ఉండమన్నారు.
డిపార్ట్‌మెంట్‌లో ఆ అంశానికి సంబంధించి ఎనిమిది ఓహెచ్‌పి షీట్స్ ఉంటే తీయించి, ఎడమ చేతితో స్పూన్‌తో భోజనం చేస్తూ, మరో ఆరు షీట్స్ రాసుకొని ప్రొజెక్టర్ రెడీ చేయమని చెప్పాను (ఆ రోజుల్లో ట్రాన్స్‌పరెంట్ ప్లాస్టిక్ షీట్స్‌పై రంగుల మార్కర్ పెన్నులతో రాసి ప్రొజెక్టర్ నుండి తెల్లని తెరపై వేసి క్లాస్ చెప్తూ ఉండేవాళ్ళం… ఇప్పటి పవర్ పాయింట్ ప్రజెంటేషన్‌లా… అదో విలాసం!).
ఆ నా పురమాయింపు తెలిసి బళ్లారి ఎగ్జామినర్ ఆశ్చర్యపోయారు. అందరికంటే మంచి టీచర్‌ని అయిన నేను క్లాస్ చెప్పడం చూసి 7 నిమిషాలకే “బాగుంది… ఆపి, కూర్చో… వైవా మొదలు పెడదాం” అన్నారు. అక్కడ నుండి మొదలు… రెండున్నర గంటల పాటు ఆయన అడిగిన ఏ ఒక్క ప్రశ్నను వదలకుండా సమాధానం చెప్పాను.
ఆయన కెరీర్‌లో ఎప్పుడూ చూడనంతటి గొప్ప స్టూడెంట్ అని నా గురించి తర్వాత కాలంలో మా డిపార్ట్‌మెంట్ నుండి వాళ్ళ కాలేజీకి ఎగ్జామినర్‌గా వెళ్లిన ఒక ప్రొఫెసర్‌తో అన్నారని ప్రాక్టీస్‌లో బాగా రాణిస్తున్న నాతో ఆ ప్రొఫెసర్ అన్నారు.
తర్వాత ఒకసారి నేను మా డిపార్ట్‌మెంట్‌కు వెళ్తే, నా పరీక్షల సమయంలో సెలవులో అమెరికాలో కూతురు దగ్గర ఉన్న మా ప్రొఫెసర్ ఒకరు డిపార్ట్‌మెంట్‌లోని అందరినీ పిలిచి ఇదిగో మొన్న బరంపురం వెళ్ళినప్పుడు మురళీకృష్ణకి ఎగ్జామినర్‌గా వచ్చిన మా వైజాగ్ కొలీగ్ కలిశారు. ఇంత గొప్ప స్టూడెంట్ మీ డిపార్ట్‌మెంట్‌లో ఉన్నందుకు నువ్వు చాలా అదృష్టవంతురాలివి, అతను ఒక అద్భుతం అన్నారు.
మీ మీ పరిధిలో కష్టపడి అతని అంతటి గొప్ప స్థాయి కాకున్నా మంచి పేరు తెచ్చుకోండి అని చెప్పారు. ఇంత చేసిన నేను యూనివర్సిటీ బెస్ట్ ఆల్ రౌండర్‌గా అన్ని విధాలా అర్హుణ్ణి. అయినా కనీసం డిస్టింక్షన్ వంటివి కూడా ఇవ్వకుండా, సాదాసీదాగా పాస్ మార్కులు వేశారని బాధపడి, నా ఎం.డి. డిగ్రీని మూడేళ్ల తర్వాత పోస్ట్‌లో తెప్పించుకున్నాను…
అప్పటికే ఎయిడ్స్ వైద్య నిపుణునిగా నేను ప్రాక్టీస్ పెట్టి దాదాపు మూడేళ్లు అయింది….. డాక్టర్ యనమదల మురళీకృష్ణ, ఎం.డి., సాంక్రమిక వ్యాధుల నిపుణులు, కాకినాడ. 2 మే 2020.
Share this Article