దీన్నే బలుపు అంటారు… మరీ ఇంత హార్ష్ కామెంటా అని తిట్టుకున్నా సరే… జనం సొమ్ముతో లక్షల కోట్లకు ఎదిగి, ప్రపంచ ధనికుల్లో ఒకడిగా నిలిచినా సరే, ముఖేష్ అంబానీ జనానికి ఏమీ తిరిగి ఇవ్వడు అనే విమర్శ చాన్నాళ్లుగా ఉన్నదే కదా… చివరకు తన కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబులిటీ నిధుల వ్యయం కూడా సరిగ్గా చేయడు అంటారు… ఒక విప్రో అజీమ్ ప్రేమ్‌జీ, ఒక టాటా రతన్, ఒక హెచ్‌సీఎల్ శివ నాడార్… ఇలా ఎందరో తమ సంపాదనను సమాజానికే తిరిగి ఇస్తుంటారు, వారితో పోలిస్తే ఒక ముఖేష్ నథింగ్… తను ప్రపంచ నంబర్ వన్ ధనికుడిగా ఎదిగినా సరే…
కొందరు ధనిక వ్యాపారులు, పారిశ్రామికవేత్తలు తమ వందలు, వేల కోట్ల సంపదను వదిలేసి ఆధ్యాత్మిక మార్గంలోకి వెళ్లి, అన్నీ సన్యసించి, సాత్విక సాధు జీవనంలోకి వెళ్లుతున్న వార్తలు బోలెడు చదివాం… ఒక అసలు విషయానికి వద్దాం… రాజుల సొమ్ము పైత్యం పాలు అని ఓ కొత్త సామెత మెట్ గాలా అనే వరల్డ్ లెవల్ ఫ్యాషన్ షోకు అక్షరాలా వర్తిస్తుంది… ఏటా చేస్తారు… ఏమీలేదు, రాజుల సొమ్ము రాణుల అలంకరణలకు, అట్టహాసాలకు, ఆడంబరాలకు హారతికర్పూరం అన్నట్టుగా… అక్షరాలా అది పైత్యమే…
సింపుల్ ఉదాహరణలు చెప్పుకుందాం… ఇషా అంబానీ ప్రదర్శించిన ఓ డ్రెస్ చూస్తారా..? ఇదుగో…
Ads
ఈ శారీ గౌన్ కిలోమీటర్ పొడవు కనిపిస్తోంది కదా… అంతా హ్యాండ్ ఎంబ్రాయిడరీ… రకరకాల సీజన్ల పూలు కాన్సెప్టు… ఆ ఈవెంట్ కాన్సెప్టు ఆహా ఓహోల జోలికి పోవడం లేదిక్కడ… ఈ గౌన్ తయారీకి అక్షరాలా 10 వేల గంటలు పట్టింది… ఎందరు పనిచేశారో లెక్క తెలియదు… ఖరీదు అంచనా వేయలేం… ముఖేష్ చిన్న కొడుకు ప్రివెడ్‌కే కొన్ని వందల కోట్లు తగలేశారు కదా… ఈమె తన ఫ్యాషన్లకు కూడా వందల కోట్లు ఇలా ఖర్చు పెట్టేస్తూ ఉంటుంది… సరే, కొంతమందికి ఉపాధి, కళాసృష్టి సమకూరాయి అంటారా..? చివరకు ఒరిగేది ఏమిటి..? ఫోటోలు తీస్తారు, ఇన్‌స్టాలో పెడతారు, అంతే…
ఇదే ఈవెంట్‌లో నటి ఆలియా భట్ తొలిసారి పాల్గొంది… పేరుకు ఇది శారీ… ఎంత పొడుగు ఊడుస్తుందో చూశారు కదా… దీని ఖరీదు మాటెలా ఉన్నా 163 మంది 1905 గంటలు కష్టపడ్డారుట… రంగురంగుల రాళ్లు, ముత్యాలు ఎట్సెట్రా పొదిగారు… అదేదో కాన్సెప్టు అన్నారు… ఇషా అంబానీలాగే ఈమెకు కూడా డబ్బు ఏం చేసుకోవాలో అర్థం కావడం లేదు… ఈమెకూ డబ్బు చేసింది…
మనవాళ్లు కూడా ఈ ఈవెంటులో పాల్గొంటారండోయ్… హైదరాబాద్ ప్రముఖ వ్యాపారవేత్త సుధారెడ్డి (మేఘా కృష్ణారెడ్డి భార్య) కూడా ఈ ఈవెంట్‌లో పాల్గొంది… ఈమె నెక్లెస్, ఈమె డ్రెస్ కూడా వింతగానే కనిపిస్తోంది… అవున్లెండి, ఫ్యాషన్ అంటేనే అంత కదా… ఇలాగే ఏయే సెలబ్రిటీ ఎంత డబ్బు తగలేసి, ఏ ఫ్యాషన్ డ్రెస్ వేసుకుంది వంటి వార్తలు బోలెడు కనిపిస్తున్నాయి మీడియాలో… డబ్బు చేసిన వాళ్లు బోలెడు ఖర్చుతో చేసే అట్టహాసపు పెళ్లిళ్లలో కనీసం మరుపురాని భోజనాలైనా పెడతారు వేల మందికి… ఈ మెట్ గాలా వంటి దిక్కుమాలిన ఫ్యాషన్ ఈవెంట్లలో ఆ చిన్న సార్థకత కూడా ఉండదు… ఎస్, సంపాదనను, సంపదను తమ కోసం తెలివిగా ఖర్చుచేసుకోవడంతోపాటు సొసైటీకి కూడా కాస్త ఉపయోగపడేలా ఖర్చుచేయడం అనేది కూడా ఓ పెద్ద ఆర్ట్… ఎటొచ్చీ మన తలతిక్క సెలబ్రిటీలు, ధనికవర్గాలకు ఆ కళలో బొత్తిగా ప్రవేశం లేదు…! కాదు, అదంటే వాళ్లకు ఎలర్జీ..!!
Share this Article