నోటికొచ్చింది కూయడం, అబ్బే మేమలా కూయలేదు, మా కూతలకు మీడియా వేరే అర్థాలు క్రియేట్ చేసింది, తప్పుడు బాష్యం చెప్పింది అంటూ కొత్త కూత అందుకోవడం రాజకీయ నాయకులకు అలవాటే కదా… మీడియా కూడా అలాగే ఉండాలా..? రాజకీయ నాయకులకు క్రెడిబులిటీ మన్నూమశానం ఏదీ ఉండదు కాబట్టి చల్తా… కానీ మీడియా… అదీ నోటికొచ్చింది రాసేయొచ్చా..?
ఒకసారి విశ్వసనీయత పోయాక ఆ మీడియా వార్తల్ని ఇంకెవడైనా నమ్ముతాడా..? చదువుతాడా..? కనీసం తప్పుడు వార్తలు ప్రచురిస్తే, తప్పని తేలాక కూడా కనీసం క్షమాపణ చెప్పే హుందాతనం కూడా కనిపించడం లేదు ఈమధ్య… (కొన్నాళ్లుగా ఈనాడు, ఆంధ్రజ్యోతి జగన్ మీద అనేక స్టోరీలు నోటికి ఏది తోస్తే అది రాశాయి… అచ్చంగా బురద జల్లడమే పని… కాకపోతే జగన్ ఘోరంగా ఓడిపోయాడు కాబట్టి యెల్లో స్టోరీల కపటం కొట్టుకుపోయింది తాజాగా…)
మిడ్-డే అని ఓ పత్రిక… కాస్త పేరున్నదే… మొన్న ఏమని రాసింది..? (16వ తేదీ 6వ పేజీ)… శివసేన ఎంపీ బంధువొకరు కౌంటింగ్ హాలుకు వచ్చి తన మొబైల్ ఫోన్‌తో ఓటీపీ జనరేట్ చేసి, ఈవీఎం ఓపెన్ చేశాడని రాసింది… శిరీష్ వక్తానియా అనే రిపోర్టర్ తను అక్కడే ఉన్నట్టు, తన ముందే జరిగినట్టు రాసిపారేశాడు… గతంలో యూట్యూబ్ న్యూస్ చానెల్ నడిపేవాడేమో… ఇదీ ఆ వార్త…
Ads
ఈ వార్త ఆధారంగా పోలీసులు ఓ కేసు పెట్టేసి, ఆ మొబైల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నారు… అక్కడికి రిటర్నింగ్ ఆఫీసర్ అదేమీ లేదు మొర్రో అని మొత్తుకుంటూనే ఉన్నాడు… నిజానికి ఈవీఎంలు విడివిడిగా పనిచేసే యూనిట్లు… ఏ నెట్‌వర్క్‌కూ అనుసంధానమై ఉండవు… కానీ ఓటీపీ కథ ఒకటి జరూరుగా వండి వడ్డించింది పత్రిక… అసలు దరిద్రం అది కాదు… ఇక ఆ వార్తను ఆధారంగా చేసుకుని దేశంలోని చిన్నాచితకా పత్రికలన్నీ దాన్ని తమ భాషల్లో అర్జెంటుగా అనువదించేసుకున్నయ్…
అసలే ఎలన్ మస్కుడు ఏదో కూశాడు కదా ఈవీఎంలన్నీ హ్యాకబులే అని… ఇక ఇదొకటి దొరికింది… ఇంకేం, మొత్తం మీడియా వార్తల్ని కుమ్మేసింది… అసలు నిర్లిప్తంగా, నిద్రాణస్థితిలోనేే ఉండే మన ఎన్నికల కమిషన్‌కు ఎందుకోగానీ చురుక్కుమంది… ఒరేయ, నీ వార్తకు ఆధారాలు చూపించు, లేకపోతే బుక్ చేస్తా, లోపలేస్తా అన్నట్టుగా ఏదో నోటీస్ జారీచేసింది…
దాంతో ఎప్పటిలాగే… అన్ని తప్పుడు వార్తలకు ఏదో కనీకనిపించకుండా ఖండన వేస్తుంటారుగా… అలాగే… అబ్బే, ఓటీపీ వాడలేదు అని పోల్ ఆఫీసర్ చెప్పినట్టు ఓ సింగిల్ కాలమ్ వార్త వేసి, దాని దిగువన తప్పు వార్త పట్ల చింతిస్తున్నాం అని చిన్నగా పబ్లిష్ చేసింది… రాసిన భాష, ప్రచురించిన తీరు ఎలా ఉన్నా సరే, లెంపలేసుకున్నట్టే కదా…
పత్రిక ప్రచురించింది కేవలం చింతిస్తున్నాం అనే… క్షమాపణ కాదు..! మరి ఈ వార్త ఆధారంగా రెచ్చిపోయి, యథాతథంగా అచ్చేసి, పరువు కోల్పోయిన మిగతా మీడియా సంస్థలు ఏం చేయాలి..? ఏమీ చేయవు… తలదించుకోవు, ఇంకేదో సమస్య మీదకు పాఠకుడి దృష్టిని అర్జెంటుగా మళ్లించేస్తాయి… మాయ, గారడీ విద్యలో మీడియా పర్‌ఫెక్ట్ కదా ఎప్పుడైనా, ఎక్కడైనా..!!
Share this Article