Bp Padala…. మిడిల్ క్లాస్ మెలొడిస్… హఠాత్తుగా ఆ సినిమా గురించి అందరూ రాస్తున్నారు… కానీ అది వదిలేసి , గుంటూరు పట్టణం, దాన్ని అలుముకొన్న తేట భాష , గమ్మత్తు లయతో కూడిన యాస ( ఆ మాటకొస్తే ప్రతీ యాసా ఓ ప్రత్యేకమైన రాగమని నమ్ముతాను నేను, వినగలిగే విచక్షణ ఉంటే ) , ట్రాఫిక్కుతో గజిబిజి వీధులు, మరీ ముఖ్యంగా శంకర్ విలాస్ తట్టిలేపిన జ్ఞాపకాల తుట్టెలో నుండి జాలువారిన కొన్ని తేనె చుక్కలు …
అప్పట్లో (అంటే మరీ భూమి పుట్టినప్పుడు అని లెక్కలేసుకోకండి , కుంచెం అప్పట్లో అన్నమాట ) ఎంసెట్ కోచింగ్ అంటే హోల్ యూనివర్స్ కి గుంటూరు వరల్డ్ కాపిటల్ అన్నమాట. ధన్ గారి రవి కళాశాల ,రత్తయ్య గారి విజ్ఞాన్ కాలేజీ కొలువు తీరిన బ్రాడీపేట అంటే టెన్ డౌనింగ్ స్ట్రీట్ కంటే ఓ పిసరు ఎక్కువే ఇంజనీరింగ్ కలలు కనే విద్యార్థులకి …సరే, ఓ శుభ రాత్రి గుంటూరు బస్సెక్కి పొద్దున్నే దిగాము ( ఇక్కడ ‘ము’ అంటే నేనే అన్న మాట రామారావు ఇస్టయిల్ ) . అసలే నిద్ర మబ్బు, అందులో ధారాళంగా వాడిన మన అచ్చమైన హైద్రాబాదీ యాస ధాటికి, చెప్పిన అడ్రస్ అర్ధం కాకపోయినా, తలపండిన లోకజ్ఞానంతో తలగుడ్డ ఒక్కసారి దులపరించి, మన స్టూడెంట్ ఫేస్ ,బ్రాడీపేట అన్న ముక్క పట్టుకొని రిక్షా అతను ఓ రూపాయి ఇయ్యండి అనే ఒకే మాటతో విజ్ఞాన్ కాలేజీ దగ్గర లెక్క తప్పకుండా దించాడు, మరేమి మాట్లాడకుండా …
చాంతాడంత లైన్ లో ( అంటే హోల్ ఏపీ ఇంజనీరింగ్ సీట్ల కన్నా ఎక్కువన్న మాట) నిలబడి డబ్బు కట్టిన తర్వాత అమరావతి రోడ్ మీదున్న మా హాస్టల్ కి ప్రయాణం . గడ కర్ర లా నెల్లూరు శ్రీనివాస్ రెడ్డి , గోదావరి చెక్కరకేళి లాంటి నొక్కులఁ జుట్టు కమ్మోళ్ల చక్రవర్తి , సొట్టబుగ్గల chubby cheeks కడప ఆంథోనీ పాల్ నా రూమ్ మేట్స్ . నెల్లూరు పెద్దిరెడ్డి మాట్లాడితే దడ దడ మంటూ సూపర్ ఫాస్ట్ రాజధాని రైలే . నేనా నెల్లూరు యాసలో రెండు ముక్కలు పట్టుకునే లోపల అతను మాట్లాడం ముగించేవాడు . ‘అట్నే అన్నా’ అంటూ ఇటు పాల్ గాడు ,’ఆయ్’ అంటూ అటు చెక్కరకేళి తలూపడము దానికి .
Ads
పుట్టి బుద్దెరిగిన తర్వాత మా ఊరు , హైదరాబాద్లో కొద్దీ మంది స్నేహితులతో తప్ప పరిచయం లేని నాకు వీళ్ళ సంభాషణ డీకోడ్ చేయడానికి ఓ రెండు రోజులు పట్టింది . ఇక రూమ్ దాటి మెస్ లోకి వస్తే 23 జిల్లాల యాసలతో నానాజాతి సమితి రణరంగంలాగా ఉండేది . మళ్ళీ అలాంటి వాతావరణం నాకు మా cbit హాస్టల్ లో కనపడేది . అత్యంత ఆత్మీయ మిత్రులు కూడా చాలామంది తెలంగాణా రాష్ట్రేతరులే . ( రాష్ట్ర విభజన వల్ల ఈతరం పిల్లలకు ఇలాంటి స్నేహితులు దొరికే అవకాశం లేకుండా పోవడం కొద్దిగా మనసును కలుక్కుమనిపించేదే ) .
తల్లిదండ్రులున్న రెండు మూడు రోజులు మూడు శాకాలు , ఆరు స్వీట్లతో హడావుడి చేసిన మా వార్డెన్, వారు వెళ్ళిపోయిన తర్వాత పలుచటి పప్పు ,రోటి పచ్చళ్ళకు దిగడంతో మా పాల్ గాడికి మండు కొచ్చింది , అసలే నాన్వెజ్ లేక బిడ్డడు అల్లాడిపోతున్నాడేమో . యుద్ధభేరి ఎలా మోగించాలా అని తర్జనభర్జన పడి, మా రూమ్ ని వార్ రూమ్ గా మార్చి, మొత్తానికి ఓ బ్రహ్మాస్త్రాన్ని బయటికి తీసాము . బిర్రుగా ఉంటుందని ఓ సగం బీరకాయను కూడా నాకు ఎక్కించి మరీ ముందుకు తోసాడు దుష్ట దుర్మార్గ పాల్ గాడు .
ఇక చూసుకోండి . మనకు అప్పట్లో వచ్చిరాని ( అంటే ఇప్పుడు తోపు అని కాదు ) ఉర్దూలో ” ఏ వంకాయే అచ్చా నహి ” , “దాల్ మే టేస్ట్ నహీ హై ” ” పైసే వాపస్ హోనా ” అంటూ విరుచుక పడటంతో…. పాపం ఆ వార్డెన్ దిమ్మెర పోయి , ఉర్దూలో జవాబియ్యలేక గాబరా పడి , ఆనక తెలుగు మహాసభల్లో తెల్లోడి ఇంగ్లీషులా , కింగ్ జార్జ్ సభలో ఫ్రెంచ్ మాట్లాడే elite లా ప్రివిలేజెడ్ గా ఫీల్ అయ్యి, రోజూ రెండు గుడ్లు , స్వీట్ రూంకి పంపే చీకటి ఒప్పందం చేసుకున్నాడు …
గుంటూరుకొచ్చిన రెండుమూడు రోజులకు అనుకుంటా చాలా ఫేమస్ హోటల్ అని అందరూ అంటుంటే శంకర్ విలాస్ లో పూరి , కుర్మాకు ఆర్డర్ ఇచ్చాను . సర్వర్ పూరీలు , ఆలు మసాలా తెచ్చి పెట్టాడు. కారంగా ఉండే హైదరాబాద్ వెజ్ కుర్మా కి నాలుక అలవాటు పడడంతో , చప్పటి ఆలూతో పూరి దిగడం లేదు . సర్వర్ కి ఎంత చెప్పినా , ఇక్కడ ఇంతే అండీ అంటూ విచిత్రంగా చూస్తూ వెళ్ళిపోయాడు . ఉసూరుమంటూ పూరీ సగంలో వదిలేసి బిల్ కట్టడానికి కాష్ కౌంటర్ దగ్గరికి పోయాను . అంతా గమనిస్తున్న క్యాషియర్ ‘అట్టా ఖాళీ కడుపుతో వెళ్ళమాకు ‘ అంటూ కూర్చోబెట్టి ఇక్కడ ఉల్లి పెసర బాగుంటుంది అని ఒకటి తెప్పించాడు . నేయి తగిలించారేమో అద్భుతంగా ఉంది రుచి . జీవితంలో పెసరట్టు తినడం అది మొదటి సారి . simply fell in love …
ఆ తర్వాత గుంటూరులో ఉన్నన్ని రోజులూ క్రమం తప్పకుండా తినేవాణ్ని . సినిమాలో ఒకచోట శంకర్ విలాస్ బోర్డు కనపడగానే ఇదంతా రీల్ లా తిరిగింది .
రత్తయ్య గారు సీరియస్ గా పరమాణు నిర్మాణం గురించి చెపుతున్నారు . నేను పాల్ గాడు , రెండవ బెంచిలో . ఓ రెండు జెళ్ళ సీత మా ముందు బెంచిలో . అప్పుడప్పుడూ తిరిగి నా వైపు చూస్తోంది . ఇంకేముంది .ఖేల్ ఖతం . దుకాణ్ బంద్ . ప్రోటాన్ల చుట్టూ ఎలెక్ట్రాన్స్ పరిమిత కక్ష్యలో పరిభ్రమిస్తాయి అంటూ రత్తయ్య గారు, రెండు జెళ్ళ చుట్టూ అపరిమిత భ్రమణ పరిభ్రమణాల్లో నేను. ఆల్జీబ్రాలో కాన్స్టాంట్ లా, యురేనియంలో రేడియో ధార్మికతలా, ఆ పేరు ఊరు తెలియని రెండు జెళ్ళసుందరి రోజురోజుకీ నిండిపోతుంది. ఒకరోజు ఇంటర్వెల్ లో పాల్ గాడితో నవ్వుతూ కనిపించింది . కథ కట్ చేస్తే రెండు జెళ్ళ రోజూ చూసేది నా పక్కనున్న సొట్టబుగ్గల chubby cheeksని.
ఆ తర్వాత బలమైన అయానిక్ బంధాల గురించి రత్తయ్య గారు , బలహీన పై బంధాల విషాదంలో నేను … మా వూరు , హైదరాబాద్ తప్ప ఇప్పటివరకూ కూడా వరుసగా 35 రోజులు గడిపింది ఒక్క గుంటూరు లోనే … మిడిల్ క్లాస్ మెలోడీస్ మరోసారి ఆ మూడు దశాబ్దాల కిందటి కౌమారపు మధుర స్మృతుల్ని తవ్వి పోసింది . ఎంత casual గా చదివినా రాష్ట్రంలోనే టాప్ కాలేజీ cbit లో సీట్ వచ్చేంత రాంక్ నూ ఇచ్చింది . అయితే విచిత్రంగా రెండోసారి గుంటూరు వెళ్లే అవకాశం ఇంత వరకూ రాలేదు … వెళ్ళాలి, శంకర్ విలాస్ లో ఉల్లి పెసర గురించి అయినా …!!
Share this Article