.
Paresh Turlapati …… “ముసలవ్వా ! రోడ్డు దాటలేకపోతున్నావా ? నేను సాయం చేస్తా పద ” ఆమె దగ్గరికొస్తూ అడిగారు సీనియర్ జర్నలిస్ట్
“అవును నాయనా! కొద్దిగా సాయం చేసి రోడ్డు దాటించవా?” అంది ముసలవ్వ
రోడ్డు దాటించడానికి ముసలవ్వ చేతిని పట్టుకున్న జర్నలిస్ట్ ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు !
ఎందుకో వళ్ళంతా జలదరించింది
ముసలవ్వ చేతిలో ఆయన చేయి బిగుసుకుపోతుంది
అప్పుడు చూసాడు ఆయన ముసలవ్వ ముఖంలోకి, అసలు ముఖమేదీ..?
కరెంట్ షాక్ కొట్టినట్టు అదిరిపడ్డాడు
Ads
*. *. *
ఉత్కంఠ రేపే సీనియర్ జర్నలిస్ట్ యదార్థ అనుభవం ఏంటో తెలుసుకోవాలంటే రీలు ఇరవై సంవత్సరాలు వెనక్కి తిప్పాలి
సమయం అర్థరాత్రి ఒంటిగంట ఇరవై నిమిషాలు
నంద్యాల మహానంది ఘాట్ మీదుగా ఫారెస్ట్ ఏరియాలో మంత్రాలయం వైపు మెటాడోర్ వ్యాన్ దూసుకుపోతుంది
వ్యాన్ లో ముందు వెైపు డ్రైవర్ ..పక్కన జర్నలిస్ట్ కూర్చుని ఉండగా వెనక జర్నలిస్ట్ అన్నయ్య వదిన పిల్లలు ఉన్నారు
అర్థరాత్రి కావడంతో అందరూ నిద్రలో కునికిపాట్లు పడుతున్నారు
దట్టమైన అడవి దారి కావడంతో వాహనాలు కూడా పెద్దగా తిరగడం లేదు
ఇంతలో డ్రైవర్ సడెన్ బ్రేక్ వేశాడు
ముందు సీట్లో ఉన్న జర్నలిస్ట్ ఉలిక్కిపడి కళ్ళు తెరిచి ‘ డ్రైవర్ ఏమైంది? ‘ అని కంగారుగా అడిగారు
” సార్! ఎవరో ముసలవ్వ రోడ్ దాటటానికి అవస్థ పడుతూ మధ్యలోనే ఆగిపోయింది” అద్దంలో రోడ్ ముందు ఆగిన ముసలవ్వను చూపిస్తూ టెన్షన్ గా చెప్పాడు డ్రైవర్
జర్నలిస్ట్ మెల్లిగా వ్యాన్ దిగి ముసలవ్వ దగ్గరికొచ్చి పైన చెప్పిన మాటలు అన్నప్పుడు అనుకోని సంఘటన జరిగింది
రోడ్ దాటించడానికి ముసలవ్వ చేతిని పట్టుకున్న జర్నలిస్ట్ కు ఏదో అపశకునం తోచింది
మెల్లిగా ఆయన చేయి ముసలవ్వ చేతిలో బిగుసుకుంటుంది
కీడు శంకించిన జర్నలిస్ట్ ముసలవ్వ పట్టు విడిపించుకుంటూ ఆమె ముఖంలోకి చూసి కెవ్వు మని భయంతో కేక పెట్టారు
ఆ ముసలవ్వ తల కనిపించడం లేదు
కింద మొండెం మాత్రమే కనిపిస్తోంది
తల ప్లేసులో చెంగు గాలికి వేలాడుతోంది
ఈ లోపు ఈయన కేక విని వ్యాన్లో ఉన్న ఆయన అన్నయ్య గబగబా వ్యాన్ దిగి తమ్ముడి చేతిలో తన మెళ్ళో ఉన్న రాఘవేంద్ర స్వామి తాయెత్తు ఉన్న తాడు పెట్టారు
ఒక్కసారిగా వ్యాన్ డ్రైవర్ శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం అంటూ బిగ్గరగా ఆంజనేయ దండకం చదవడం మొదలుపెట్టాడు
మెల్లిగా ముసలవ్వ చేయి పట్టు సడలింది
కళ్ళు తెరిచి చూసేలోపే చీకట్లో మాయం అయ్యింది
బతుకు జీవుడా అనుకుంటూ అందరూ వ్యాన్ లోకి ఎక్కి వాయు వేగంతో ముందుకు కదిలారు
వ్యాన్ లో కూర్చున్న తర్వాత ఆ జర్నలిస్టు కు అనుమానం వచ్చింది
ఏదో భ్రమలో తనకు మాత్రమే అలా అనిపించిందా?
లేకపోతే తాను చూసింది నిజమేనా?
కానీ చేయి చూసుకుంటే కమిలిపోయి చిన్న చిన్న గాట్లు కనిపిస్తున్నాయి
భ్రమ అయితే చేయి ఎందుకు కమిలిపోయింది?
డౌట్ వచ్చి అన్నయ్యను.. డ్రైవర్ ను అడిగితే వాళ్ళు కూడా ఇదే ఫీలింగ్ చెప్పారు
ఇరవై కిలోమీటర్ల ముందుకెళ్ళిన తర్వాత రోడ్డు పక్కన చిన్న లాంతరు కనిపించడంతో ఆగి చూస్తే ఓ వ్యక్తి టీ కాస్తూ కనిపించాడు
అతడి పేరు సైదా
భయం నుంచి తేరుకోవడానికి వేడి వేడిగా టీ తాగుతూ జరిగిన సంఘటన అతడికి చెప్పారు
అప్పుడు సైదా ,
” సార్! మీకు కనిపించిన ముసలవ్వ వెనక చిన్న స్టోరీ ఉంది..ఈ దగ్గర్లోనే విలేజ్ లో ముసలవ్వకు ఉన్న స్థలం కొంతమంది కబ్జా చేసి ఆమెను హ*త్య చేశారు.. ఆశ్చర్యం ఏంటంటే కబ్జా చేసిన వాళ్ళు ఆ స్థలంలో బిల్డింగ్ కడితే కుప్పకూలిపోయింది.. అప్పట్నుంచీ ఆ స్థలం జోలికి ఎవరూ పోవడం లేదు.. నిజానికి ఆ ముసలవ్వ ఎవర్నీ ఏమీ చేయదు.. ఎవరైనా స్థలం జోలికి వస్తే మాత్రం మ*ర్దరైపోతున్నారు.. అదో మిస్టరీ..మీకులానే నలుగురైదుగురు నాకు ఇదే విషయం చెప్పారు..ఈ ఫారెస్ట్ లో ఉండే చెంచులకు కూడా ఈ సంగతి తెలుసు ” అని అసలు విషయం చెప్పాడు
జీవితంలో మర్చిపోలేని ఆ సంఘటన గురించి తల్చుకుంటూ బిక్కు బిక్కుమంటూ మంత్రాలయం చేరుకున్నారు
ఈ యదార్ధ సంఘటనలో సీనియర్ జర్నలిస్ట్ పేరు పత్రి వాసుదేవన్ గారు
వీరు ఇండియాన్ ఎక్స్ప్రెస్ లో సుదీర్ఘ కాలం జర్నలిస్ట్ గా పని చేసి ఇప్పుడు ఎలక్ట్రానిక్ మీడియాలో చక్కటి డిబేట్లు నిర్వహిస్తున్నారు
ఆ మధ్య నేను రాసిన అడవిలో అర్థరాత్రి స్టోరీలోలాగా గతంలో తనకూ ఇలాంటి అనుభవమే ఎదురైంది అంటూ Patri Vasudevan గారు తనకు ఎదురైన పై అనుభవం గురించి ఇందాక నాకు చెప్పారు
నాకు చాలా ఇంట్రెస్టింగ్ అనిపించి వారి అనుమతితో అరుదైన ఆ అనుభవాన్ని ఇలా అక్షరాల్లో పెట్టా
Thank you sir for sharing your Exciting Experience
అన్నట్టు చెప్పడం మరిచా,
అన్నిటికన్నా ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే శ్రీ ఆంజనేయం దండకం పూర్తి కంఠతః పఠించిన డ్రైవర్ ముస్లిం !
Share this Article