వరాహరూపం అనే కాంతార సూపర్ హిట్ పాట వస్తోంది Spotify లో… విభిన్నమైన మేళకర్త రాగం… దానిపై వివాదం, కోర్టు చిక్కులు తదితర దృశ్యాలు మదిలో గిర్రున తిరుగుతూ, ఆదివాసీ గులిగ దేవుడు సహా విష్ణు వరాహ అవతారం కూడా మధ్యలో గుర్తొస్తూ ఉంటే…
దేవుడికి వరాహ మొహం తగిలించి మరీ పూజించే మనం దేవతల్లో ఎవరినైనా జంతు మొహాలతో పూజిస్తామా..? అనే ఒక ప్రశ్న పుట్టుకొస్తుంది హఠాత్తుగా… అవును, పూజిస్తాం… ఏడుగురు హిందూ మాతృక దేవతల్లో ఒకరు వారాహి… అంటే వరాహ రూపిణీ… శక్తి స్వరూపిణి…
ఇవి మదిలో మెదులుతూ వుండగానే నిన్న పవన కళ్యాణుడు ఆవిష్కరించిన వారాహి యుద్ద ట్యాంక్, యుద్ద శకటం, శతఘ్ని కనిపించ సాగింది… అచ్చు సినిమాల్లో చూపించేలా చిత్రీకరణ… ఫోటోలు… నిజానికి పవన కళ్యాణుడు అనే నటుడు కం నాయకుడు సొంతంగా తయారు చేయించుకున్న క్యారవాన్ కం ఎన్నికల ప్రచార రథం…
Ads
రథం తయారైంది కాబట్టి ఇక జనంలోకి నిరంతర బస్సుయాత్ర లేదా రథయాత్ర అనుకోవడానికి వీల్లేదు… తను ఒప్పుకున్న సినిమాలు చేయాల్సి ఉంది… పైగా తనకు ఈరోజుకూ సినిమా వేరు, రాజకీయాలు వేరు అని తెలియదు… ఫ్యాన్ వేరు కార్యకర్త వేరు అనీ గుర్తించడు… తనకు వీళ్ళే వాళ్ళు…
తన చుట్టూ పొలిటికల్ సీనియర్స్ లేదా సిద్ధాంతకర్తలు ఎవరూ ఉండరు… ఎవరూ ఏమీ చెప్పరు… చెప్పినా వినడు… వేల పుస్తకాల పఠన అనుభవం కదా, సినిమా దేవుడు కదా, వినడాన్ని ఇష్టపడడు… తన ఆందోళనల్లో కూడా నాటకీయత, ప్రసంగాల్లో హై పిచ్ ఆవేశం… ఒక మిస్టీరియస్ పొలిటీషియన్… కం నటుడు..!
ఈ వారాహి రూపకల్పన కూడా ఓ సినిమాటిక్ అడుగు… దాన్ని చూస్తుంటే ఒక యుద్ద వాహనంలాగే ఉంది… ఎన్నికలు కూడా యుద్ధమే కదా అని అంటే ఏమీ చెప్పలేం… నిజానికి ఇది చూడగానే నక్సల్స్ ప్రాబల్య ప్రాంతాల్లో కూంబింగ్ కోసం పోలీసులు ప్రత్యేకంగా రూపొందించిన * మైన్ ప్రూఫ్ వెహికిల్ * గుర్తొచ్చింది… సేమ్ లుక్కు… (మందు పాతర్ల నుంచి రక్షణ కోసం ఆ వెహికిల్)… నిజానికి ఆ కలర్ మిలిటరీ వాహనాలకు మాత్రమే వాడతారని ఒక టాక్…
సినిమాల్లో , ఇండస్ట్రీలో రాజకీయాలు ఉండవచ్చుగాక… రాజకీయాలు సినిమా కాదు… ఇది ఒక సీరియస్ కార్యాచరణ… రాజకీయాల్లో సినిమాటిక్ ధోరణులు జనం ఆసక్తిగా చూస్తారు గానీ అవి లీడర్ గా నిలబెట్టలేవు… వైఎస్ వారసత్వం ఉన్నా సరే జగన్ ను 2014 లో జనం యాక్సెప్ట్ చేయలేదు… మొండిగా జనంలోనే తిరిగాడు, ఉన్నాడు, కొట్లాడాడు… ఆ తర్వాతే జనం ఆమోదం తెలిపి 151 సీట్లు ఇచ్చారు…
ఈ వయస్సులో కూడా చంద్రబాబు కిందా మీదా పడుతూ తిరుగుతూనే ఉన్నాడు… మొన్నటి ఎన్నికల్లో తన వైఫల్యానికి పవన కళ్యాణుడు సరైన రీతిలో విశ్లేషణ, మథనం చేసుకుని లేదా చేయించుకుని ఉంటే ఇప్పటికే ఒక కొత్త కేరక్టర్ చూసేవాళ్ళం… లేదు, తను మారలేదు… మారలేడు… మారడు కూడా..!!
Share this Article