అప్పుడప్పుడూ వార్తలు చదువుతుంటాం… ఫలానా అటెండర్ పోస్టులకు పీహెచ్‌డీలు చేసినవాళ్లు కూడా అప్లయ్ చేశారు అని…! మరేం చేయాలి..? ఉద్యోగాలు తక్కువ, నిరుద్యోగం ఎక్కువ, ఏదో ఒక కొలువు కావాలి, అది సర్కారు కొలువైతే లైఫ్ లాంగ్ సేఫ్, రిస్క్ లెస్… అది నిజమే గానీ… అసలు కొలువులకు కనీసార్హతలు ఉంటయ్ గానీ, గరిష్ట అర్హత అనేది ఉంటుందా..? అంటే… ఈ క్వాలిఫికేషన్ దాటకూడదు అంటే అది గరిష్ట అర్హత… ఫలానా క్వాలిఫికేషన్ కంపల్సరీ అంటే అది కనీసార్హత… ఎహె, ఇదేం పిచ్చి ప్రశ్న… మినిమం క్వాలిటిఫికేషన్ కావాలి అంటారు తప్ప, ఆపైన ఎంత చదువుకుని ఉంటే ఏమిటట..? నిజానికి కనీసార్హతను మించి చదువుకుంటే మంచిదేగా అంటారా..? కాదు, కాదు… సపోజ్, ఒక అటెండర్ జాబ్‌కు టెన్ ప్లస్ టూ చదివినవాళ్లు చాలు అని అర్హత పెట్టారనుకుందాం… ఓ డిగ్రీవాడే ఎగరేసుకుపోయాడు అనుకుందాం… కానీ కేవలం అటెండర్ పోస్టుకు సరిపడా మాత్రమే సరిపడా చదువుకున్న మరో నిరుద్యోగి అవకాశాన్ని ఎక్కువ చదువుకున్నవాడు తన్నుకుపోయాడు అనేది ఇప్పటి వాదన… నమ్మడం లేదా..? అయితే ఈ నోటిఫికేషన్ చదవండి…
రిజర్వ్ బ్యాంకుకు ఆఫీస్ అటెండెంట్లు కావాలి… జాగ్రత్తగా ఓసారి చదవండి… కేవలం టెన్త్ చదివినవాళ్లు మాత్రమే అర్హులు… అంతకుమించి గ్రాడ్యుయేషన్, ఆపైన చదివితే అనర్హులు అని స్పష్టంగా రాశారు… ప్లస్ లోకల్ భాషలో చదవడం, రాయడం, మాట్లాడటం తెలిసి ఉండాలి… పరీక్ష పెట్టి, వడబోసి, చివరకు మిగిలినవాళ్లను తీసుకుంటారు… అదీ రిజర్వేషన్ రోస్టర్ ప్రకారం… ఇదీ నోటిఫికేషన్… అంటే ఇప్పుడు తేలిందేమిటి..? ఏ కొలువుకు ఎంత చదువు చాలో, వాళ్లనే తీసుకుంటారు… ఎక్కువ చదివి ఉంటే గెటౌట్… అంతే… అంటే ఎక్కువ చదువుకోవడం కూడా శాపమేనా అని హాశ్చర్యపోకండి… అవును… సాధారణంగా అటెండర్లు గట్రా పోస్టులే ఎక్కువ ఉంటాయి కదా, మనకున్న మంచి చదువుతో దాన్ని సంపాదించడం ఈజీ కదా అనుకుంటున్నారేమో ఇన్నాళ్లూ… నో, కుదరదు… తక్కువ చదువుకున్నవాళ్లతో ఎక్కువ చదువుకున్నవాళ్లకు పోటీ ఏమిటసలు..? దేనికైనా సమఉజ్జీలు ఉండాలి కదా… పోనీ, ఆ విద్యార్హతనే పెంచవచ్చు కదా అంటారా..? అదీ కుదరదు, చిన్న కొలువులకు పెద్ద అర్హతలు ఖరారు చేస్తే సహజ న్యాయసూత్రాల్ని ఉల్లంఘించినట్టు అవుతుంది…
Ads
ఆమధ్య ఒకాయన ఏం చేశాడంటే..? తన ఉన్నత చదువును దాచిపెట్టి ఏదో చిన్న కొలువుకు, చిన్న చదువు సర్టిఫికెట్తో అప్లయ్ చేశాడు, కొలువు వచ్చింది… డ్యూటీలో చేరాడు… ఆ తరువాత కొన్నాళ్లకు తను కావల్సిన చదువుకున్నా బాగా ఎక్కువ చదివాడు అనే సంగతి బట్టబయలైంది… వాళ్లు కొలువు నుంచి పీకేశారు… మనవాడు కోర్టుకెక్కాడు… కోర్టు కూడా ఏమన్నదో తెలుసా..? తన ఉన్నత విద్యార్హతను ఉద్దేశపూర్వకంగా దాచిపెట్టడం తప్పే అంటూ కొలువు నుంచి పీకేయడమే కరెక్టు అంది… మరి పెద్ద కొలువులు రావు, పెద్ద చదువులు పనికిరావు, ఏం చేయాలి..? జవాబులేని ప్రశ్న…! ఏ జాతి అయినా బాగా చదువుకొండిరా అంటుంది… ఎంకరేజ్ చేస్తుంది… ఇక్కడ రివర్స్…!!
Share this Article