Balaraju Kayethi …. ఒక వ్యక్తి ఎదిగితే ఓర్వలేని గుణాలు..
రాజకీయ నాయకుల మీద కోపాలు.. రాజకీయ దురుద్ధేశ్యాలు.. పీఏల మీద రుద్దడం.. రాద్దాంతాలు చేయడం..
మూడు నాలుగు రోజులుగా మంత్రి సీతక్క పీఏ సుజిత్ రెడ్డి మీద చాలా ఛానెళ్లు, వార్తా పత్రికలు కథనాలు రాస్తున్నాయి..
Ads
తప్పులేదు.. ఎవరి డ్యూటి వారు చేయాల్సిందే..
ఇసుక అక్రమ రవాణా.. గురించి ఒక్కసారి చర్చిద్దాం..
ఇసుక దందా జరగనిది ఏ ప్రభుత్వంలో.. ఏ ప్రభుత్వం వచ్చినా ఇంతో అంతో ఖచ్చితంగా నడుపుతారు..
ఇంకా దొడ్డుగా చెప్పాలంటే అసలు ఇసుక అనగానే అంత పెద్ద స్మగ్లింగ్ గా ఎందుకు చూస్తారో అర్థం కావడం లేదు..
ఇసుకతో ఇండ్లే కడుతారు కదా.. నిర్మాణాలే చేస్తారు.. కదా.. బాంబులైతే తయారు చేయరు కదా.. దీనికి ఇంత పెద్ద బూచీ దేనికి..
పీఏలు అన్నప్పుడు.. అప్పుడప్పుడు ఏదైన మాట సాయం చేయమంటే ఒక్కోసారి మంత్రి నోటీస్ లో లేకుండా కూడా ఫోన్ చేస్తారు.. వీలుంటే చూడండి.. ఏమైన తప్పు జరిగితే మొదటి సారి .. క్షమించి జరిమానా విధించి పంపండి లేదా.. మరేదో చెబుతారు..
సుజిత్ రెడ్డి రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ ప్రాంత వాసి.. నేను చాలా మందికి ఫోన్ చేసి తెలుసుకున్న.. ఇతను ఎటువంటి వారు అని..
ఒక్కరంటే ఒక్కరు వ్యతిరేకంగా మాట్లడలేదు.. అటువంటి గుణం కాదు అని చెబుతున్నారు..
సరే ఏదైనా మనకేంటి కానీ.. ఇక్కడ మాత్రం కాంగ్రెస్ ప్రభుత్వం మీద బురద జల్లేందుకు.. మంత్రి సీతక్క కు ఈ బురద అంటించేందుకు.. పీఏ సుజిత్ రెడ్డిని ఒక పావుగా వాడుకుంటున్నట్లు.. బలి పశువును చేస్తున్నట్లు అర్థమవుతుంది. దీనికి తోడు సీఎం రేవంత్ రెడ్డి సర్కార్ ఇసుక దందాను ప్రారంభించింది అని చెప్పడానికి సీతక్క పీఏ సుజిత్ రెడ్డిని బలి చేయడానికి ప్రయత్నాలు బలంగా జరుగుతున్నయని తెలుస్తుంది.
సర్కార్ వచ్చి రెండు నెలలు దాటలేదు… అంతలోనే పీఏ సుజిత్ రెడ్డి ఒక వ్యవస్థను ఏర్పాటు చేసుకోని.. ఇసుక స్మగ్లింగ్ మొదలు పెట్టాడా..
సుజిత్ రెడ్డి డబ్బు మీద అత్యాశ ఉంటే.. సీతక్క దగ్గర అధికారం లేక ముందు నుంచి ఎందుకు పని చేస్తాడు.. ఏ అధికార పార్టీ ఎమ్మెల్యేనో.. మంత్రినో చూసుకోని విధుల్లో చేరిపోయేవాడు కధా..
సుజిత్ రెడ్డిపై పథకం ప్రకారమే.. రాజకీయ కుట్ర కోణంలో ఆరోపణలు జరుగుతున్నాయనిపిస్తుంది..
అధికారంలో ఉన్నప్పుడు ఎవరైనా మాట సాయం అడిగి ఉంటే ఉండవచ్చు కానీ.. ఏకంగా పీఏనే ఇసుక దందానే నడిపిస్తున్నంటూ తప్పుడు ఆరోపణలు చేస్తూ.. సుజిత్ రెడ్డి భుజాలపై తుపాకి పెట్టి.. సీతక్కను కాల్చాలని చూస్తున్నారు.
ఏది ఏమైనా సీతక్క కూడా కేవలం ఆరోపణలకు భయపడో.. ఇబ్బంది పడో.. ఏండ్లుగా సేవ చేసిన సుజిత్ రెడ్డిని దూరం పెట్టడం కూడా సబబు కాదు.. ఖమ్మం సంఘటనపై సమగ్ర విచారణ జరిపి.. బాధ్యులపై చర్యలు తీసుకోవాలి కానీ.. ఏం విషయాలు నిరూపణ కాకముందే ఒక సామాన్య కుటుంబానికి చెందిన వ్యక్తిని, ఒక పీఏను బలి చేయడం సరికాదని నా వ్యక్తిగత భావన..
సుజిత్ రెడ్డి గురించి మాత్రం చాలా మంది మంచిమాట చెబుతున్నారు కాబట్టి స్పందిస్తున్నాను. తప్పుగా భావించోద్దు.. ఏ పార్టీ అధికారంలో ఉన్న ఇసుక దందా.. అక్రమ రవాణా కొత్తేమీ కాదు.. మొదలు కాదు.. ఆఖరు కాదు…
(ఇక్కడ చిన్న క్లారిటీ… గత ప్రభుత్వంలో మంత్రులు, ఎమ్మెల్యేల పీఏలు, పీఎస్‌లు కూడా మంత్రుల్లాగే అథారిటీ చలాయించారు… అందరూ కాదు, మెజారిటీ… బీఆర్ఎస్ కుంగుబాటుకు వంద కారణాలుంటే అందులో ఒకటి వీళ్ల పెత్తనాలు… ప్రజాప్రతినిధుల్ని ప్రజలకు దూరం చేసిందే వీళ్లు… కలవకుండా అడ్డుపడ్డ సైంధవులు… అందుకని ఇక్కడ మంత్రి సీతక్కను ఆమె పీఏ భుజాల మీద తుపాకులు పెట్టి కాల్చాలనే రాజకీయ ప్రయత్నాలు ఉండవచ్చుగాక… కానీ కాంగ్రెస్ మంత్రులు, ఎమ్మెల్యేలు జాగ్రత్తగా వ్యవహరించాలని ఇది ఓ సూచిక… అదేసమయంలో సుజిత్ రెడ్డి వంటి పీఏలను బలిపశువుల్ని చేసినంత మాత్రాన పెద్దగా సిట్యుయేషన్‌లో మార్పేమీ రాదు… సో, పైన పబ్లిష్ చేసిన ఓ మిత్రుడి అభిప్రాయం నాణేనికి మరోవైపు, అది రియాలిటీ… పీఏలు, పీఎస్‌ల పాత్ర మీద ఓ డిబేట్ అవసరం… ఇది అందుకే పబ్లిష్ చేయడం.. అధికారం వచ్చిన రెండు నెలలకే ఈ మరకలు దేనికని రేవంత్ ప్రభుత్వం ఈ కఠినమైన నిర్ణయం తీసుకుని ఉండవచ్చు, దాన్నీ తప్పుపట్టలేం…. – ముచ్చట)
Share this Article