Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

ఎలాగైతేనేం… తెలుగు రాష్ట్రాల్లో మళ్లీ ఓ బ్రాహ్మణ మంత్రి… దుద్దిళ్ల శ్రీధర్ బాబు…

December 10, 2023 by M S R

Nancharaiah Merugumala….. శ్రీధర్‌ బాబు ప్రమాణం చేసేదాకా రెండు తెలుగు రాష్ట్రాల్లో బ్రాహ్మణ మంత్రి లేకపోవడం, ఇప్పుడు దక్కడం మంథని నియోజకవర్గం ఘనతకు నిదర్శనం…

……………………………………

‘సింథాల్‌ ఇచ్చే వాగ్దానం నిలబెట్టుకునేది సింథాల్‌ ఒక్కటే’ అనే మాటలు మా తరం ‘యువకులకు’ 1960లు, 70ల్లో కనిపించేవి, వినిపించేవి. సింథాల్‌ అనే ఒంటి సబ్బు వ్యాపార ప్రకటనతో ఈ మాటలు జోడించి అప్పట్లో జనాన్ని ఆకట్టుకునేది బహుళ ఉత్పత్తుల కంపెనీ గోద్రెజ్‌. మంథని ఎమ్మెల్యే దుద్దిళ్ల శ్రీధర్‌ బాబు మంగళవారం మంత్రిగా ప్రమాణం చేసినప్పుడు పై సింథాల్‌ వాక్యం గుర్తుకొచ్చింది.

Ads

దాదాపు పదేళ్ల క్రితం అంటే 2014 జనవరి 2న మంత్రి పదవికి మంథని ఎమ్మెల్యే అయిన శ్రీధర్‌ బాబు రాజీనామా చేశాక ఆయనలాగా తెలుగు బ్రాహ్మణ కుటుంబంలో పుట్టిన ఏ నాయకుడూ మంత్రి కాలేకపోయాడు. అంటే, ఓ తెలుగు రాష్ట్ర కేబినెట్లో అప్పుడప్పుడూ ఒక బ్రాహ్మణ ఎమ్మెల్యేకు మాత్రమే కేటాయించే మంత్రి పదవి ఇన్నాళ్లు శ్రీధర్‌ గారి కోసం ఖాళీగా పడి ఉందనుకోవాలి.

బీఆరెస్‌ నేత కేసీఆర్‌ తొమ్మిదిన్నరేళ్ల పాలనలో తన మంత్రివర్గంలోకి బ్రాహ్మణ చట్టసభ సభ్యుడు ఎవరికీ అవకాశం ఇవ్వలేదు. పొరుగునున్న మరో తెలుగు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్‌లో సైతం రాష్ట్ర విభజన తర్వాత సీఎం అయిన టీడీపీ నేత ఎన్‌ చంద్రబాబు నాయుడు మంత్రివర్గంలో బ్రాహ్మణ నేతకు చోటు ఇద్దామనుకున్నా 2014 ఎన్నికల్లో తెలుగుదేశం తరఫున ఈ కులంలో పుట్టిన నాయకుడు ఎవరూ గెలవలేదు. అసలు టికెటే ఈ కులస్తుడు ఎవరికీ ఇవ్వలేదు. అప్పట్లో ప్రతిపక్షమైన వైఎస్సార్‌ కాంగ్రెస్‌ తరఫున బాపట్ల నుంచి కోన రఘుపతి ఒక్కరే ఈ కులం నుంచి ఏపీ అసెంబ్లీకి ఎన్నికయ్యారు.

జగన్‌ కేబినెట్లోనూ బ్రామ్మలకు చోటేది?

………………………………………….

2019లో చంద్రబాబు బ్రామ్మలకు ఎవరికీ టీడీపీ టికెట్‌ ఇవ్వలేదు. వైఎస్సార్సీపీ తరఫున ఇద్దరు బ్రాహ్మణ నేతలు ( విజయవాడ సెంట్రల్‌ నుంచి మల్లాది విష్ణు, బాపట్ల నుంచి కోన రఘుపతి) అసెంబ్లీకి ఎన్నికయ్యారు గాని వైఎస్‌ జగన్‌ తన కేబినెట్లో వారెవరికీ చోటివ్వలేదు. కేబినెట్‌ హోదా ఉందని చెప్పే ఏపీ డెప్యూటీ స్పీకర్‌ పదవిని రఘుపతికి ఇచ్చారు. 2022లో అదీ ఊడగొట్టారు.

ఇక కల్వకుంట్ల వారి విషయానికి వస్తే–ఆయన మాటల ప్రకారం కేసీఆర్‌కు బ్రాహ్మణులంటే విపరీత గౌరవం. అవకాశమొచ్చినప్పుడల్లా తాను చదవిన దుబ్బాక ప్రభుత్వ పాఠశాల తెలుగు టీచర్‌ మృత్యుంజయ శర్మ గారి గురించి పదేపదే శ్లాఘిస్తూ మాట్లాడతారు. పాదాభివందనం చేస్తారు. కరీంనగర్‌ జిల్లాకు చెందిన బ్రాహ్మణ ప్రముఖుడు కెప్టెన్‌ వి.లక్ష్మీకాంతరావును రాజ్యసభకు పంపించారు. ఆయన కొడుకు వొడితెల సతీశ్‌ కుమార్‌ ను 2014, 18లో రెండుసార్లు హుస్నాబాద్‌ నుంచి తెలంగాణ అసెంబ్లీకి ఎన్నికయ్యే అవకాశమిచ్చారు. యూపీలో పుట్టిపెరిగిన బ్రాహ్మణ రిటైర్డ్‌ ఐఏఎస్‌ రాజీవ్‌ శర్మ, ఇంకా మెదక్‌ జిల్లాకే చెందిన కేవీ రమణాచారి వంటి బ్రాహ్మణులకు పదవులు ఇచ్చిన కేసీఆర్‌ బుర్రలోకి రెండు చట్ట సభల్లోని బీఆరెస్‌ బ్రాహ్మణ సభ్యుల్లో (సతీశ్, దేశపతి శ్రీనివాస్‌) ఒక్కరికైనా తన మంత్రివర్గంలోస్థానం ఇచ్చే ఆలోచన రాలేదు.

బ్రాహ్మణ నేతలకు మర్యాద, మన్ననతోపాటు పదవులు ఇచ్చేది కాంగ్రెస్‌ పార్టీయే

………………………………………………………………………………………..

తెలుగునాట బ్రాహ్మణ నేతలకు సముచిత స్థానం ఇచ్చేది నిజంగా జాతీయపక్షాలైన కాంగ్రెస్, బీజేపీలే. గుంటూరు జిల్లాలో మూలాలున్న జీవీఎల్‌ నరసింహారావును బీజేపీ రెండేళ్ల క్రితం రాజ్యసభకు పంపించింది. అలాగే, ఆంధ్రప్రదేశ్‌ అవతరించాక రెడ్ల సంఖ్యాబలం రాజకీయాల్లో గణనీయంగా పెరిగిన తర్వాత కూడా మంథని మంత్రి పీవీ నరసింహారావును నాటి ప్రధాని ఇందిరాగాంధీ ఏపీ ముఖ్యమంత్రిని చేసింది.

రాజీవ్‌ మరణానంతరం 1991లో పాములపర్తి వారిని ప్రధానమంత్రిని చేసిందీ కాంగ్రెస్‌ పార్టీయే. ఇక్కడ మరో ముఖ్య విషయం చెప్పుకోవాలి. గోదావరి సమీపంలోని ఉమ్మడి కరీంనగర్‌ జిల్లా మంథని అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఇప్పటికి 16సార్లు జరిగిన ఎన్నికల్లో 12 సార్లు బ్రాహ్మణ కాంగ్రెస్‌ నేతలే ఎన్నికయ్యారు. ఇక్కడి నుంచి నాలుగుసార్లు గెలిచిన పీవీ గారు మంత్రి, ముఖ్యమంత్రి అయ్యారు. మూడుసార్లు గెలిచిన శ్రీధర్‌ బాబు గారి తండ్రి దివంగత దిద్దిళ్ల శ్రీపాదరావు గారు హస్తినలో ప్రధానిగా, కాంగ్రెస్‌ అధ్యక్షుడిగా ఉన్న పీవీ నరసింహారావు గారి దయతో ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ స్పీకర్‌ పదవిని 1991 ఆగస్టులో సంపాదించగలిగారు.

పీపుల్స్‌ వార్‌ దాడిలో శ్రీపాదరావు కన్నుమూశాక మంథని కాంగ్రెస్‌ అభ్యర్థిగా ఆయన కొడుకు శ్రీధర్‌ ఇప్పటికి ఐదుసార్లు గెలిచారు. వైఎస్‌ కేబినెట్లో 2009లో మంత్రిగా చేరిన శ్రీధర్‌ బాబు 2014 జనవరి వరకూ రాష్ట్ర కాంగ్రెస్‌ కేబినెట్లలో మంత్రిగా కొనసాగారు. ఆంధ్రప్రదేశ్‌ పునర్విభజన చట్టం–2014పై నాటి అసెంబ్లీలో చర్చ జరుగుతుండగా శ్రీధర్‌ నిర్వహించే శాఖల్లో ఒకటైన శాసనసభ వ్యవహారాలను ముఖ్యమంత్రి ఎన్‌.కిరణ్‌ కుమార్‌ రెడ్డి వెనక్కి తీసుకున్నారు. దాంతో నొచ్చుకున్న శ్రీధర్‌ రాజీనామా చేశారట. ముందే చెప్పుకున్నట్టు దేశంలో వ్యవసాయాధారిత కులాల నేతల ఆధిపత్యంలోని ప్రాంతీయపక్షాలు బ్రాహ్మణ నేతలకు తగిన ప్రాతినిధ్యం ఇచ్చిన సందర్భాలు తక్కువే. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో తెలంగాణలో బ్రాహ్మణ నేతలకు జనంలో ఉండే గౌరవమర్యాదలు కోస్తా, రాయలసీమ జిల్లాలతో పోల్చితే మొదట్నించీ కాస్త ఎక్కువే.

గుంటూరు బ్రాహ్మణుడైనా హైదరాబాదులో వీబీ రాజుగారి ప్రాభవం

……………………………………………………………………………

గుంటూరు జిల్లా బాపట్లలో పుట్టిన వల్లూరి బసవరాజు (వీబీ రాజు) అనే నియోగి బ్రాహ్మణ కాంగ్రెస్‌ నేత 19 ఏళ్ల వయసులో 1933లో హైదరాబాద్‌ వచ్చి స్థిరపడ్డారు. కోస్తాంధ్రలో మూలాలున్నా– కాంగ్రెస్‌ పార్టీలో ఆయన తెలివైన నేతగా ఎదిగారు. 1952 హైదరాబాద్‌ స్టేట్‌ తొలి, ఆఖరి అసెంబ్లీ ఎన్నికల్లో వీబీ రాజు గారు సికింద్రాబాద్‌ స్థానం నుంచి కాంగ్రెస్‌ టికెట్‌పై ఎన్నికయ్యారు. ఆ తర్వాత ఆయన నగరంలోని ఆసిఫ్‌ నగర్‌ (1957), సిద్దిపేట (1967) నుంచి ఏపీ శాసనసభకు కాంగ్రెస్‌ అభ్యర్థిగా విజయం సాధించి కాంగ్రెస్‌ కేబినెట్లలో రెవిన్యూ సహా అనేక కీలక శాఖలు నిర్వహించారు. ఏపీఎస్‌ ఆర్టీసీ చైర్మన్‌ పదవిని రెండేళ్లు నిర్వహించడంతోపాటు ఆయన రెండుసార్లు కాంగ్రెస్‌ తరఫున రాజ్యసభకు ఎన్నికయ్యారు.

అప్పట్లో ఆయన జిత్తులమారి తెలివితేటలు చూసిన రాజకీయ పండితులు ‘‘ మంత్రివర్గాల లోపల వీబీ రాజు, మంత్రి పదవి లేకుండా కేబినెట్‌ బయట మర్రి చెన్నారెడ్డి ఉంటే కాంగ్రెస్‌ ప్రభుత్వాలకు చిక్కులు తప్పువు,’ అని వ్యాఖ్యానించేవారు. ఆంధ్రా మూలాలున్న వీబీ రాజు మరి తెలంగాణ ప్రాంతంలో కాంగ్రెస్‌ నేతగా అన్ని పదవులు సంపాదించడం– అప్పట్లో కాంగ్రెస్‌ అధిష్ఠానం అండతో తెలుగు బ్రామ్మణ నేతలు ప్రదర్శించిన రాజకీయ సామర్ధ్యానికి నిదర్శనం. మంథని మాదిరిగా వరుసగా నాలుగుసార్లు (పీవీ) లేదా మూడుసార్లు (దుద్దిళ్ల శ్రీపాదరావు, శ్రీధర్‌ బాబు) బ్రాహ్మణ అభ్యర్థిని గెలిపించిన అసెంబ్లీ నియోజకవర్గం ఏదీ కోస్తా, రాయలసీమలో లేదంటే తెలంగాణలో బ్రాహ్మణులకు ఇంకా లభిస్తున్న మర్యాద, మన్నన ఎంతో అర్ధమౌతుంది.

తెలుగునాట చివరి బ్రాహ్మణ లోక్‌ సభ ఎంపీ ఉండవల్లే మరి!

………………………………………………………………….

అలాగే, రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ చివరిసారిగా లోక్‌సభకు ఎన్నికైన బ్రాహ్మణ నేత ఉండవల్లి అరుణ్‌ కుమార్‌ కావడం కూడా తెలుగునాట రాజకీయాల్లో అడుగంటుతున్న ఈ వర్గం ప్రాధాన్యానికి అద్దంపడుతోంది. 2009లో చివరిసారి రాజమండ్రి నుంచి ఉండవల్లి ఎన్నికైన తర్వాత ఏ జాతీయపక్షం తరఫునా ఈ వర్గం నాయకుడెవరూ తెలుగు ప్రాంతాల నుంచి పార్లమెంటులో అడుగుపెట్టలేదు. ఏదేమైనా రెండు తెలుగు రాష్ట్రాల బ్రాహ్మణ సమాజానికి దుద్దిళ్ల శ్రీధర్‌ బాబు ఒక్కరే మంత్రి కావడం విశేషం.

పాకశాస్త్రంలో ప్రావీణ్యం ఉన్న వేలాది మంది వంట బ్రామ్మలను అందించిన మంథని ప్రాంతం గొప్పతనం ఇది. కేరళలో తమిళనాడు సరిహద్దున ఉన్న పాలక్కాడులో (పాతపేరు పాల్ఘాట్‌) స్థిరపడిన తమిళ బ్రాహ్మణ అయ్యర్లు పెద్ద సంఖ్యలో కనిపిస్తారు. ఇదే ప్రాంతానికి చెందిన (విద్యా బాలన్, ఆమె కజిన్‌ ప్రియమణి కూడా పాలక్కాడు తమిళయ్యర్లే)…

మాజీ సీఈసీ టీఎన్‌ (తిరునెళ్లై నారాయణ అయ్యర్‌) శేషన్‌ తమ కులస్తుల గురించి ఓ సందర్భంలో మాట్లాడుతూ, ‘ పాలక్కాడ్‌ తమిళ బ్రాహ్మణ అయ్యర్లు– అయితే వంటవాళ్లో లేదా వంకర బుద్ధులున్న దుష్టులు (క్రుక్స్‌ ఆర్‌ కుక్స్‌) అయి ఉంటారు,’ అని వ్యాఖ్యానించారు. మంథని బ్రాహ్మణులకు మాత్రం శేషన్‌ గారి వ్యాఖ్య వర్తించదు. అయితే, దుద్దిళ్ల శ్రీధర్‌ ఎమ్యెల్యేగా ఉండగానే తెలంగాణ కేడర్‌కి చెందిన ప్రస్తుత సీనియర్‌ ఐఏఎస్‌ శైలజా రామయ్యర్‌ ను పెళ్లాడడం–మంథనికి, తమిళ బ్రాహ్మణులకు ఉన్న బంధాన్ని గుర్తుచేస్తోంది….

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • ధర్మస్థలపై ఏదో భారీ కుట్ర… ఆమె కూతురు ఓ అబద్ధం… ఓ కల్పిత కథ..!!
  • చివరకు పండుగల స్పెషల్ షోలలోనూ అవే రోత స్కిట్లా..?!
  • ఈ సీరీస్‌లో నిజం ఏదైనా ఉందీ అంటే… అది ఆ డిస్‌క్లెయిమర్ మాత్రమే…
  • కేటీయార్ వింత పొలిటికల్ ధోరణి..! రాను రాను ఓ సైద్ధాంతిక శూన్యత..!?
  • మేఘమా దేహమా మెరవకే ఈ క్షణం… ఆహా… ఏవీ నాటి ఆర్ద్ర గీతాలు…?
  • ఎవరి పదవి ఊడబీకాలన్నా… ఏదో ఓ కేసులో అరెస్టు చేస్తే సరి ఇక..!!
  • అదే కథ, అదే పాత్ర… విజయచందర్ సూపర్ హిట్… నాగార్జున ఫ్లాప్…
  • కాళేశ్వరంపై బీఆర్ఎస్ క్యాంప్ ఆపసోపాలు… నానా విఫల సమర్థనలు…
  • కాంతారా బీజీఎం మోతల వెనుక ఈ ఆఫ్రికన్ గిరిజన వాయిద్యం..!
  • సింగరేణి మట్టి కూడా బంగారమే… అత్యంత విలువైన ‘రేర్ ఎర్త్ మినరల్స్’…

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions