Sai Vamshi…. హీరోల రీరిలీజ్ సినిమాలు – ఓ ‘జలికట్టు’ కాన్సెప్ట్ ….. జూన్ 10న బాలకృష్ణ గారి పుట్టినరోజు. ఆ రోజు ‘నరసింహనాయుడు’ సినిమా రీరిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. పోయినేడాది ఆయన పుట్టినరోజున ‘చెన్నకేశవరెడ్డి’ రీరిలీజ్ చేశారు. ఈ సంగతులు విన్నప్పుడు బాలకృష్ణ గారికి స్టార్‌డమ్ తెచ్చిన ‘మంగమ్మ గారి మనవడు’, తెలుగులో తొలి సైంటిఫిక్ చిత్రం ‘ఆదిత్య 369’ లాంటి సినిమాలు రిలీజ్ చేయొచ్చు కదా అనిపించింది. మొన్న మార్చిలో చిరంజీవి గారి ‘గ్యాంగ్ లీడర్’ సినిమా రిలీజ్ చేశారు. చిరంజీవి కెరీర్లో బోలెడన్ని మేలైన సినిమాలు, పాత్రలు ఉన్నాయి. ‘మగమహారాజు’లో బాధ్యతాయుతమైన యువకుడు, ‘విజేత’లో కుటుంబం కోసం త్యాగం చేసే చిన్న కొడుకు, ‘స్వయంకృషి’లో చెప్పులు కుట్టే సాంబయ్య, ‘రుద్రవీణ’లో ఊరి బాగు కోసం, మద్యపాన నిషేధం కోసం తపించే సూర్యం.. ఎన్ని లేవు! కానీ ‘గ్యాంగ్ లీడర్’ ఎందుకు వేశారు అనే ఆలోచన నాది. అఫ్‌కోర్స్ ‘గ్యాంగ్ లీడర్’ చక్కటి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్. అది నేను కాదనను.
చెన్నకేశవరెడ్డి, నరసింహనాయుడు సినిమాల్లో బాలకృష్ణ గారు గొప్ప నటన ప్రదర్శించారు. ఆ విషయంలో నాకేమీ సందేహం లేదు. కానీ ఆయన పుట్టినరోజు నాడు ‘ఆదిత్య 369’ లాంటి సినిమా రీరిలీజ్ చేస్తే ఇప్పటి పిల్లలకు కొంతలోకొంత సైన్స్ మీద ఆసక్తి కలిగే అవకాశం ఉండొచ్చు. తెలుగులో ఇలాంటి సినిమా ఒకటి వచ్చింది అనే జ్ఞానం రావచ్చు. శ్రీకృష్ణదేవరాయల గురించి తెలియొచ్చు. జె.వి.సోమయాజులు, గొల్లపూడి మారుతీరావు, అమ్రీష్ పురి లాంటి దివంగత నటులను గుర్తు చేసుకోవచ్చు. ఇళయరాజా గారి సంగీతంలో బాలు, జానకి గార్లు పాడిన అద్భుతమైన పాటలు థియేటర్లో వినొచ్చు అనిపించింది.
అయితే, Star Heros Films Re-release Concept గురించి ఆలోచించాక నా ఊహలన్నీ అనవసర విషయాలని అనిపించింది. ‘ఆదిత్య 369’ గొప్ప సినిమానే కావచ్చు గాక, కానీ అందులో మూడు చోట్ల మాత్రమే ఫైట్లు ఉన్నాయి. ‘చెన్నకేశవరెడ్డి, నరసింహనాయుడు’ సినిమాల్లో పరుచూరి బ్రదర్స్ రాసే టైప్ డైలాగులు ఆదిత్య 369లో లేవు. సింగీతం గారు దాన్నొక కథగా చూపారు తప్పించి బాలకృష్ణ గారి Heroic Elevation కోసం ఏ సన్నివేశమూ తీయలేదు. ఈ కారణంగానే ఆ సినిమా రీరిలీజ్ కాదు. కాజాలదు.
Ads
సరే! చెన్నకేశవరెడ్డి, నరసింహనాయుడు సినిమాల దగ్గరికి వద్దాం! అవేమీ కొత్త సినిమాలు కాదు. జెమిని టీవీలో బోలెడన్ని సార్లు చూసినవే! యూట్యూబ్‌లో కూడా అందుబాటులో ఉన్నాయి. అయినా సరే మళ్లీ థియేటర్‌కి వెళ్లడం ఎందుకు? Theatre Experience కోసమా? అంతకంటే అధ్వానమైన మాట మరొకటి లేదు. థియేటర్ అనుభవం అనేది సినిమాని థియేటర్‌లో ఎంజాయ్ చేయడం కోసం. కానీ రీరిలీజ్ సినిమాల్లో జరిగే అనుభవాలు అలా లేవు. అరుపులు, గోల, కేకలు.. కుదిరితే సీట్లు విరగ్గొట్టడం, నిప్పు పెట్టడం. ఇది ఇప్పుడు నడుస్తున్న రీరిలీజ్ సినిమాల Theatre Experience ట్రెండ్.
రీరిలీజ్ సినిమాల థియేటర్లకు అక్కడక్కడా కొందరు మందు తాగి వస్తున్నారు. లోపల నిషా, చుట్టూ జనం. అలాంటి వాళ్లను రెండు గంటలపాటు మౌనంగా కూర్చుని సినిమా చూడమంటే ఏం చూస్తారు? వాళ్లకి అరవాలని ఉంటుంది. ఎగిరి ఏదో ఒకటి చేయాలని ఉంటుంది. వాళ్లని చూసి మరింత మంది రెచ్చిపోతారు. పిచ్చెక్కిపోతారు. అభిమానులు(?) అలా అరిచి గీపెట్టి, అల్లరి చేసి, మంటలు పెట్టాలంటే సినిమాలో వీలైనంత హీరోయిజం ఉండాలి. డైలాగులు కావాలి. ప్రతి నిమిషానికి గొంతు చించుకుని అరిచేందుకు అవసరమైన మాస్ మసాలా కావాలి. ‘జల్లికట్టు’ సినిమా క్లైమాక్స్‌లో తమ కోపం తీర్చుకునేందుకు అందరూ ఒకరి మీద ఒకరు పిరమిడ్‌లా పడ్డట్టు, అభిమానులు తమ లోపలి ఆవేశం తీర్చుకునే వేదిక కావాలి. అదే ఈ రీరిలీజ్ ట్రెండ్. ఆ లక్షణాలు ‘ఆదిత్య 369’లో ఏ కోశానా లేవు. ‘రాసలీల వేళ.. రాయబార మేల’ అని బాలు గారు పాడితే ఎవరికి కావాలి? అదే గాయకుడు ‘లక్సు పాప.. లక్సు పాప’ అని పాడుతూ ఉంటే ఆ కిక్కే వేరు. థియేటర్ ఊగిపోతుంది. ఆ కిక్కు కోసమే జనం రీరిలీజ్ సినిమాలకు వెళ్తారని నా అభిప్రాయం.
కాబట్టి ఈ రీరిలీజ్ ట్రెండ్‌కి కావాల్సింది గొప్ప సినిమాలు కాదు. వీలైనంతగా అభిమానుల ఒత్తిడిని పోగొట్టే అల్లరి సినిమాలు. అదే బాలకృష్ణ గారు నటించిన ‘పాండురంగడు’, ‘శ్రీరామరాజ్యం’ సినిమాలు రీరిలీజ్ చేయరు. చేసినా ఎవరూ రారు. కాబట్టి థియేటర్ యజమానులు వాటి జోలికి పోరు. అభిమానులకు కూడా తమ హీరో నటించిన గొప్ప సినిమాలు, వాటిలోని గొప్ప నటన చూద్దామని ఉన్నట్టు నాకైతే తోచదు. ఇంకా గట్టిగా మాట్లాడితే, రీరిలీజ్ అయ్యే సినిమాల్లో తమ హీరో గురించి తప్ప మరే విషయమూ వారికి పట్టదు. ‘నరసింహనాయుడు’ సినిమా నిర్మాత ఎవరు, దర్శకుడు ఎవరు అడిగితే చాలా మంది బాలకృష్ణ అభిమానులే చెప్పలేరు.
ఏ హీరోల అభిమానులనూ తక్కువ చేయడం నా ఉద్దేశం కాదు. వీరాభిమానం పేరిట కొందరు వ్యక్తులు థియేటర్లో సీట్లు చించి, మంటలు పెట్టి, నానా యాగీ చేసి తమ Psychological Stressని నైసుగా ఎలా పోగొట్టుకుంటున్నారో చెప్పడమే నా ఉద్దేశం.
PS: హీరోల పుట్టిన రోజులకేనా రీరిలీజ్‌లు? శ్రీదేవి, జయప్రద, జయసుధ, విజయశాంతి, రాధిక, రాధ.. వీళ్ల పుట్టిన రోజులకు రీరిలీజ్‌లు చేయరా? మహానటి సావిత్రి అంటూ సంబరపడ్డాం కానీ ఏనాడైనా ఆమె పుట్టిన రోజునాడు రీరిలీజ్ ప్లాన్ చేశామా? ఓహ్.. వాళ్లు హీరోయిన్లు కదా! అతిగా ఆశించకూడదేమో?
Share this Article