చిన్నప్పుడు ఏదో పాఠ్యపుస్తకంలో చదివినట్టు గుర్తు… ఓ పాపులర్ పెద్దమనిషి తాను రోజూ పత్రికల్ని తిరగేస్తాను తప్ప చదవననీ, కానీ ఒకరోజు ఒక రైతుకు ఉత్తమరైతు పురస్కారం ఇచ్చి, తలపాగా బహూకరించిన వార్త మాత్రం తనను బాగా ఆకట్టుకున్నదనీ రాస్తాడు… తోటి రైతుల్లో ఆ తలపాగా తనకు ఎంత గర్వం..? ఆ ఫీలింగే ఆనందాన్ని కలిగించింది అంటాడు… నిజమే… రైతు బతుకులు మరీ ఘోరంగా ఉన్న ఈరోజుల్లో రైతులకు ఆనందాన్ని కలిగించే ఒక చిన్న వార్త అయినా ఎంత సంబరం..? ఆఫ్టరాల్, అందరమూ ఆ కుటుంబాల నుంచి వచ్చినవాళ్లమే కదా…
ఇప్పుడు ఇది ఎందుకు చెప్పుకోవాల్సి వస్తున్నదంటే… ఒక మంచి వార్త తెలుగు పత్రికల్లోనో, కన్నడ పత్రికల్లోనో ప్రముఖంగా కనిపిస్తుందేమోనని వెతికీ వెతికీ నిరాశపడటం..! ఆ వార్త ఏమిటంటే… ఇదీ…
Ads
‘‘మేలైన రకం డబ్బీ బాడిగి మిర్చి… రైతులకు కనకవర్షం కురిపిస్తోంది… వారం రోజులుగా రికార్డు స్థాయిలో ధర పలుకుతున్న బ్యాడిగి కొత్త ఏడాది తొలిరోజున మరో రికార్డు సృష్టించింది… కర్ణాటకలోని హావేరి జిల్లా, శిగ్గావి తాలూకా, పాణిగట్టి గ్రామానికి చెందిన చెన్నప్పగౌడ బ్యాళిగౌడ క్వింటాలు మిరపను 55,239 రూపాయలకు విక్రయించాడు… మార్కెట్ యార్డులో ఆ రైతు రెండు క్వింటాళ్ల మిరపను ఎ.హెచ్.నాసిపుర అనే వ్యాపారికి ఈ ధరకు విక్రయించాడు… గత సోమవారం గదగ్ జిల్లా బెటెగేరి గ్రామ రైతు మల్లికార్జున బసప్ప కరిమిష్టి క్వింటాలు మిరపను రూ.50,111కు విక్రయించడం ఇప్పటి వరకు రికార్డు… నేను పండించిన బాడిగ రకం మిరపకు ఇంత ధర లభించడం నమ్మలేకపోతున్నానంటూ ఆ రైతు సంతోషం వ్యక్తం చేశాడు…’’
ఇది ఈనాడు డిజిటల్లో మాత్రం కనిపించింది… కొన్ని వాట్సపు గ్రూపుల్లో కూడా… అంతే… నిజానికి ఒక రైతు కేవలం రెండు క్వింటాళ్ల మిర్చి అమ్మి లక్ష రూపాయల్ని ఇంటికి తీసుకుపోవడం ఎంత సూపర్ వార్త..? మిర్చికి రికార్డు ధర రావడం కూడా ఎంత మంచి వార్త..? అసలు ఇవి కదా రైతుల్లో కాస్త పాజిటివిటీని నింపేవి… కానీ ప్రచార, ప్రసార సాధనాలు ఎందుుకు ఇలాంటి వార్తలు పట్టని రీతిలో దివాలా తీశాయి..?
ఈ బ్యాడిగి రకం మిర్చికి ఓ ప్రత్యేకత ఉంది… ఇందులో డబ్బీ, కడ్డీ అని రెండు ఉపరకాలు… కడ్డీ అనేది గింజలు తక్కువ, స్పైస్ ఎక్కువ, మసాలా పౌడర్లు, కారం పొడి వ్యాపారులు ఎక్కువగా కొంటారు… కానీ డబ్బీ ఉపరకం చాలా డిఫరెంటు… రంగు, రుచి, వాసనల్లో సూపర్… గింజలు ఎక్కువైనా సరే, స్పైస్ కాస్త తక్కువైనా సరే… ఇందులో నుంచి తీసే ఓలియోరెసిన్ను లిప్ స్టిక్కులు, నెయిల్ పాలిషుల్లో వాడతారు… అందుకే ఇంత ధర… ప్లస్ మసాలా, వంటలకూ ప్రసిద్ధి… కిచెన్ మిర్చి రకాల్లో, వంటల్లో వాడుకోవడానికి బ్యాడిగిని మించింది లేదు… ఈ విశేషాలు ఎలా ఉన్నా… ఒక రైతు ఈ మిర్చి పండించి, 55 వేల రికార్డు ధరను పొందడం వార్త కాకపోవడం మాత్రం అన్యాయం… చెన్నప్పగౌడా… నువ్వు సూపరోయ్…!!
Share this Article