Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

అందం అంటే..? ఏ రూపు..? ఏ వర్ణం..? కొలమానాలేమిటి..?

February 23, 2025 by M S R

.

భారతదేశంలో మొహానికి పూసుకునే పౌడర్లు, స్నోలు, గ్లోలు, వైటెనింగ్ క్రీములు, యాంటీ ఏజింగ్ క్రీములు, ఇతర సౌందర్య సాధనాల మార్కెట్ విలువ ఏటా పది శాతానికి పైబడి పెరుగుతోంది. ఇది ఆయా ఉత్పత్తులు తయారు చేసే హిందూస్తాన్ యూనీలీవర్, ఇమామి, జాన్సన్ అండ్ జాన్సన్ లాంటి పెద్ద కంపెనీల కాకి లెక్క. చిన్నా చితకా లోకల్ సౌందర్యసాధనల విలువ కూడా కలిపితే సున్నాలు లెక్కపెట్టడం కష్టం!

ఏటా పదిహేను వేల కోట్ల రూపాయలు ఒక్క మన మొహాలకు కొట్టుకుంటున్న సున్నాల విలువ. పూతలు, రాతలు, చల్లుళ్ళు, స్ప్రేలు, గిల్లుళ్ళు, కలరింగులు, కోటింగులు, కోతలు, వాతలు…కలిపి మొత్తం మీద భారత్ లో అన్ని రకాల అందాల మార్కెట్ విలువ సంవత్సరానికి అక్షరాలా లక్ష కోట్ల రూపాయలట.

Ads

“ఎలుగు తోలు తెచ్చి యెన్నాళ్లు ఉతికినా
నలుపు నలుపే కాని తెలుపు కాదు
కొయ్యబొమ్మ దెచ్చి కొట్టినా పలుకునా
విశ్వదాభిరామ వినురవేమ!”

శతాబ్దాల క్రితమే వేమన కాలానికే ఫెయిర్ అండ్ లవ్లీ లాంటివాడెవడో నల్లటి ఎలుగు తోలును తెల తెల్లటి హంస తోలుగా మారుస్తానని దండోరా వేయించి ఉంటాడు. అదివిని వేమన ఈ పద్యం చెప్పి ఉంటాడు! (ఎలుక తోలు తెచ్చి- అని ఎక్కువమంది వాడుతున్నారు. ఇదివరకు ఎలుగుబంటి తోలు కప్పుకునేవారు. కాబట్టి వేమన ప్రస్తావించినది ఆ ఎలుగు తోలే తప్ప అది ఎలుక తోలు కాదని పండితుల నిర్ణయం)

తెల్ల తోలు మీద మన వ్యామోహం ఈనాటిది కాదు. పెళ్లి సంబంధాల ప్రకటనల్లో పబ్లిగ్గా కారు తెలుపు అమ్మాయికి- బస్సు తెలుపు అబ్బాయి మాత్రమే కావలెను- అని ఇప్పటికీ తెల్లతోలు సంబంధ ప్రకటనలే వస్తున్నాయి. ఈ విషయంలో మనది తోలు మందం వ్యవహారం.

“ఆత్మశుద్ధి లేని యాచారమది యేల
భాండశుద్ధి లేని పాకమేల?
చిత్తశుద్దిలేని శివపూజలేలరా?
విశ్వదాభిరామ! వినుర వేమ! ”
అని కూడా వేమనే అన్నాడు. పైకి కనిపించే అందం కాకుండా ఆత్మ శుద్ధి లేదా అంతః సౌందర్యం గురించి పాపం వేమన ఎంతగానో గుండెలు బాదుకున్నాడు.

వేమనకు రివర్సులో పౌడర్లు, స్నోలు, ఫేస్ క్రీములు తయారు చేసేవారు కూడా తమ ఉత్పత్తులు వాడకపోతే మీ మొహం మా మొహంలా అఘోరిస్తుందని గుండెలు బాదుకుంటున్నారు.

ఆమధ్య అమెరికాలో నల్ల జాతి పౌరుడు ఫ్లాయిడ్ ను ఒక తెల్లజాతి పోలీసు అధికారి గొంతు నులిమి చంపాడు. ఐ కాంట్ బ్రీత్ అన్న ఫ్లాయిడ్ మరణ వాంగ్మూలమే “బ్లాక్ లైవ్స్ మ్యాటర్” అన్న స్లోగన్ తో ప్రపంచవ్యాప్తంగా వర్ణ దురహంకారం మీద ఉద్యమంగా మారింది.

ఈ నేపథ్యంలో సౌందర్య సాధనాల ప్రకటనల్లో ప్రపంచవ్యాప్తంగా నలుపును అవమానించే మాటలను తొలగించాలన్న డిమాండ్లు ఊపందుకున్నాయి. నెమ్మదిగా కంపెనీలు దారికొస్తున్నాయి. భారత దేశంలో ఆయా ఉత్పత్తుల పేర్లు, ప్రకటనల్లో తెలుపును తొలగించి పాజిటివ్ బ్యూటీ అన్న మాటను తగిలిస్తున్నారు. పాజిటివ్ బ్యూటీని తెలుగులో సకారాత్మక అందం అనాలా? ధనాత్మక అందం అనాలా?

పాజిటివ్ అందానికి ఇంకే అర్థం వస్తుందో? యాడ్ ఏజెన్సీ అనువాద పండితులు పాజిటివ్ అందాన్ని ఎలా అనువధిస్తారో వేచి చూడాలి. సింపుల్ గా సహజ సౌందర్యం అనవచ్చు. అలా అంటే ఇక యాడ్ మేకర్ క్రియేటివిటీకి విలువేముంటుంది?

“దంతంబుల్ పడనప్పుడే తనువునందారూఢియున్నప్పుడే
కాంతాసంఘము రోయనప్పుడె జరాక్రాంతంబు కానప్పుడే
వింతల్ మేన చరించనప్పుడె కురుల్ వెల్వెల గానప్పుడే
చింతింపన్ వలె నీ పదాంబుజములన్ శ్రీకాళహస్తీశ్వరా!”

అన్నాడు ధూర్జటి. వయసు పెరిగేకొద్దీ పళ్లు ఊడడం, శరీర కాంతి తగ్గడం, ముడుతలు పడడం, జుట్టు తెల్లబడడం, రోగాలు పలకరించడం, మన మొహం మనమే గుర్తు పట్టలేనంతగా మారిపోవడం సహజం. ఎన్ని యాంటీ ఏజింగ్ క్రీములు మొహానికి దట్టించినా- వయసును ఆపగలమా?
అరవైలో ఇరవై వయసు ఎవరికైనా వచ్చేనా?

తెరమీద కనపడేవారికి అందమే పెట్టుబడి. అందమే ఆనందం. అందమే పరమావధి. వయసు ఇరవై దగ్గర ఆగిపోయినట్లు కనిపించడానికి వారు లిటరల్ గా నానా గడ్డి తప్ప…రెగ్యులర్ ఆహారం తినలేరు. రోజంతా జిమ్ముల్లో చెమటలు చిందిస్తూ…సైజ్ జీరో బిరుదు సాధించి…లేని నడుముతో బతికి ఉన్నట్లు నిరూపించుకోవాల్సి ఉంటుంది. మంచి నీళ్లు తాగినా షుగర్, కొలెస్ట్రాల్ వచ్చే ప్రమాదం ఉందని అనుక్షణం జాగ్రత్తగా ఉండాలి.

వయసు పెరిగి-
పెదవి వంకర పోతే… కోయించుకుని వెంటనే సరిదిద్దుకోవాలి.
మూతి వంకరపోతే… వెంటనే ప్లాస్టిక్ సర్జరీ చేయించుకోవాలి.
నలుపెక్కితే… వెంటనే చర్మం ఒలిపించుకుని… తెల్ల చర్మం తొడుక్కోవాలి.
పొట్ట లావెక్కితే పర పర రంపం పెట్టి కోయించుకోవాలి.

జుట్టు నెరవకూడదు.
పళ్లు ఊడకూడదు.
కళ్లకు చత్వారం రాకూడదు.
ఒళ్లు ఒంగకూడదు.
అరవైల్లో ఇరవై ఉక్కిరి బిక్కిరి చేస్తూ…బుగ్గలు చిదిమితే పాల కేంద్రం పెట్టుకోవాలి.
చెంపలు అద్దాలు కావాలి.
జీవితం అనునిత్యం అందాల్లో బందీ కావాలి.

అందాన్ని ధ్యానించాలి. శ్వాసించాలి. తపించాలి. అందం కోసం చచ్చిపోవాలి.

ఆ అందం అసూయపడే సౌందర్యసాధనాల మార్కెట్ ను పెంచుకోవడానికి ఉపయోగపడేవే అందాల పోటీలు. కొన్ని దశాబ్దాల క్రితం హైదరాబాద్ లో అందాల పోటీలు నిర్వహించారు. సమాజంలో అభ్యుదయవాదులనుండి వ్యతిరేకత వచ్చింది. ఆ సందర్భంలో గోరటి వెంకన్న అందాల పోటీలకు వ్యతిరేకంగా… అసలు అందమంటే ఏమిటో చెబుతూ ఒక పాట రాసి… పాడాడు.

“కంచరేగి తీపి వోలె లచ్చువమ్మో…..
నీ కంఠమెంత మధురమే లచ్చువమ్మ…

పారే యేరు అలలమీద పండు వెన్నెల రాలినట్టు… ఊరే  ఊట సెలిమెలోన తేటనీరు ఒలికినట్టు…
వెండి మెరుపుల నవ్వునీదే…లచ్చువమ్మో…..
నీది ఎంతసక్కని రూపమే లచ్చువమ్మ…

అన్నట్లు-
మే నెలలో హైదరాబాద్ లో మిస్ వరల్డ్ పోటీలట. 140 దేశాలనుండి సుందరీమణులు వేంచేస్తారట.

… అయినా పారే ఏటి అలలమీద పండువెన్నెలలు రాలే సందర్భాల్లో;
ఊటబావుల్లో తేనె నీరు ఉబికే సందర్భాల్లో;
ముగ్గులు వేసే మునివేళ్ళ మీద సూర్యుడు గోరింట పొద్దయి పండే సందర్భాల్లో;
దారిలో పల్లేరు ముళ్ళు మల్లెలయ్యే సందర్భాల్లో;
సూర్యుడి ఎండకు మేఘాలు గొడుగు పట్టే సందర్భాల్లో;
గొంతు విప్పి పాట పాడితే వాలిన కంకులు లేచి నిలుచునే సందర్భాల్లో;
జీవన సౌందర్యం జగతికి అందమైన సందర్భాల్లో…ఆనందమైన సందర్భాల్లో…ఈ అర్ధనగ్న పూర్ణనగ్న అందాల పోటీల గురించి మాట్లాడుకోవడమే అసందర్భం!

-పమిడికాల్వ మధుసూదన్
9989090018

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • అమరావతిపై ద్వేషం, విషం… మరీ ఈ డర్టీ ముద్రలతోనా..?!
  • నో నో… కల్వకుంట్ల శైలిమ రాజకీయాల్లోకి అస్సలు రాకపోవచ్చు..!!
  • అమెరికా మీద చైనా అగ్రిటెర్రర్ కుట్ర… ఆ ఫంగస్ దానికోసమేనా..?
  • అప్పు పుట్టని దురవస్థ నుంచి…. వన్ ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థ దాకా…
  • జుట్టు సెట్ చేయాలంటే కనీసం లక్ష… ఇదొక సక్సెస్ స్టోరీ…
  • కథ, స్క్రీన్ ప్లే, మాటలు, పాటలు, సంగీతం, ఫోటోగ్రఫీ, దర్శకత్వం, నటన…
  • రాజకీయ నాయకులతో కృష్ణ కబడ్డీ… తరువాత తనే పాలిటిక్స్‌లోకి…
  • అచ్చు శ్యాంసింగరాయ్‌ కథలాగే… ఆ సినిమాల్లో ప్రస్తావించిన స్టోరీయే..!!
  • మెగాస్టార్‌ కనిపిస్తే చాలు, ఈ కెమెరా రెచ్చిపోయేది… ఓ విశేషబంధం..!
  • జైనబ్… అఖిల్‌కన్నా 9 ఏళ్లు పెద్ద… ఐతే ఏంటట..? ఆమెకు తెలియదా..?!

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions