ఒక సినిమాను థియేటర్‌లో చూస్తుంటే సీన్లు చకచకా కదిలి వెళ్తుంటే… వాటి విశేషం, అర్థం గట్రా మన మెదడుకు ఎక్కేలోపు మరో సీన్ వచ్చేస్తుంది… మరో డైలాగ్ ఏదో వినిపిస్తుంది… సినిమా బాగున్నట్టు అనిపిస్తుంది గానీ బుర్రలో రిజిష్టర్ కావు సరిగ్గా… టీవీల్లో కూడా అంతే… కానీ ఓటీటీ యుగం వచ్చాక బెటర్…
కొన్నిసార్లు వెనక్కి వెళ్లి, డైలాగ్ విని, ఆ సీన్ చూసి, ఇంకా పర్‌ఫెక్ట్‌గా ఎంజాయ్ చేయగలం… లేదా మైనస్ పాయింట్లు కూడా పట్టుకోగలం… నాలుగైదేళ్ల క్రితం వచ్చిన మిషన్ మంగళయాన్ సినిమాను ఎయిర్ ఇండియా ఫ్లయిట్‌లో చూడబడ్డాను… గతంలో చూసిందే, కానీ ఈసారి చాలా బాగనిపించింది… ఈమధ్య సౌత్ సినిమాల ముందు బాలీవుడ్ సినిమాలు కొరగాకుండా పోయాయనే విమర్శలు, అభిప్రాయాలు వింటున్నాం కదా, దానికి ఎవరో ఓ హిందీ పెద్దాయన బాలీవుడ్‌ను తక్కువ అంచనా వేయవద్దు ప్లీజ్ అని చేసిన వ్యాఖ్య కూడా గుర్తొచ్చింది…
నిజం… సామాజిక అంశాల్ని టచ్ చేస్తూ వచ్చే కొన్ని తమిళ, మలయాళ సినిమాలు తప్ప సౌత్ సినిమాల్లో ప్రయోగాలు, ప్రయోజనాలు గట్రా ఏముంటయ్..? మరీ తెలుగు సినిమాలైతే దారుణమే కదా… నరుకుడు, బీభత్సం, నెత్తుటి ధారలు, సూపర్ హీరోయిజం, లాజిక్కులకు అందని ఫైట్లు, సర్కస్ ఫీట్ల గెంతులు, నడుమ ఐటమ్ సాంగ్స్, వెకిలితనం, అశ్లీలం ఎట్సెట్రా… (కుర్చీ మడతపెట్టి పాటలో మహేశ్ బాబు చూపించే హ్యాండ్ సిగ్నల్స్ గుర్తుతెచ్చుకొండి ఓసారి… పాటతోపాటు అంతటి పెద్ద హీరో తన చేష్టల పట్ల జాగ్రత్త వహించకపోతే ఎలా..? పైసా వసూల్ సినిమా పాటలో బాలకృష్ణ కూడా అంతే… పుష్పలో ఒకటీరెండు సీన్లు కూడా… చెబితే బోలెడు…)
Ads
మిషన్ మంగళయాన్‌లో ఆ దుర్వాసనలు, ఛాయలు ఒక్కటంటే ఒక్కటి లేదు… కమర్షియల్ కోణంలో గాకుండా తాము అనుకున్న లైన్, కంటెంట్ స్ట్రెయిట్‌గా, ఆసక్తికరంగా ప్రజెంట్ చేసే విషయంలో బాలీవుడ్ చాలాా ముందుంది… మొన్నటి శామ్ బహదూర్ గురించీ చెప్పుకున్నాం కదా… ఆర్మీ, పాట్రియాటిక్ కంటెంట్ కూడా బాగా వస్తోంది… మిషన్ మంగళయాన్‌కు 70 కోట్ల దాకా ఖర్చు చేస్తే 300 కోట్ల దాకా వసూళ్లు వచ్చినయ్… జనం కూడా ఆదరించారు… నిజానికి ఈ సినిమాను నారీశక్తి, మన వైజ్ఞానిక శక్తిని బలంగా ఫోకస్ చేయడానికి ఇంకా జనంలోకి తీసుకువెళ్తే బాగుండు అనిపించింది…
వాస్తవంగా మనం ఖగోళ జ్ఞానంలో ఆది నుంచీ తోపులమే… అది మనం మరోసారి చాటుకోవడానికి మార్స్ సక్సెస్ ఉపయోగపడింది… అమెరికా, చైనా, రష్యాలకు చేతకానిది మనం చేసి చూపించాం, అదీ చౌకగా… దాన్ని బలంగానే ప్రొజెక్ట్ చేసింది సినిమా… కానీ ఎందుకు ఈ సినిమా గురించి చెప్పుకోవాలీ అంటే… పర్‌ఫెక్ట్ స్క్రిప్ట్… ఒక వ్యక్తిత్వ వికాస పాఠంలాగా మార్చాడు రచయిత… మన హోమ్ సైన్స్, సగటు ఇల్లాలికి తెలిసిన అంశాల్నే అంతటి ఖగోళ ప్రయోగాలకు వర్తింపచేసిన తీరును రచయిత కన్విన్సింగుగా, జనానికి ఖగోళ, రాకెట్ సైన్స్ ఎక్కించేలా చెప్పగలిగాడు…
ఉదాహరణకు… బాగా కాగే నూనె, హఠాత్తుగా గ్యాస్ అయిపోతుంది… కానీ అదే వేడిలో కొన్ని పూరీలు గోలించేస్తాం… దాని ఆధారంగా తక్కువ ఇంధనంతో మన పీఎస్ఎల్వీ (అంతకుముందే జీఎస్ఎల్వీ ఫెయిల్ చాప్టర్ ఉంటుంది) ని భూకక్ష్యను దాటించే తీరును మంచి ఇమేజీలతో సహా ప్రొజెక్ట్ చేశాడు దర్శకుడు… ఎవరో ఓ విలన్ ‘పూరీ సైన్స్’ అని వెక్కిరిస్తాడు కూడా… రాత్రి మిగిలిన అన్నాన్ని పడవేయం కదా, పొద్దున ఫ్రైడ్ రైస్ చేస్తుంది గృహిణి, చంద్రయాన్2 కోసం ఆర్డర్ చేసిన ట్రాన్స్‌పాండర్లు, కెమెరాలు గట్రా ఇలాగే మంగళయాన్‌కు వాడతారు… ఇది కిచెన్ సైన్స్ మాత్రమే కాదు, అందుబాటులో ఉన్న వనరుల సద్వినియోగం…
అన్నింటికీ మించి సైన్స్ మాత్రమే మతమని బలంగా నమ్మే అక్షయ కుమార్ ఈ ప్రాజెక్టుకు హెడ్… తనకు డిప్యూటీ విద్యాబాలన్, ఎవరూ పెద్దగా పట్టించుకోని వివిధ విభాగాల సైంటిస్టులుగా తాప్సి, సోనాక్షి, నిత్య ఎట్సెట్రా… అందరూ తమ పాత్రల్లో దూరిపోయారు తప్ప వీసమెత్తు ఓవరాక్షన్ లేదు… 9 టు 5 పనిచేయడం వేరు, ఒక పనిని ఓన్ చేసుకోవడం వేరు అనే జీవితసూత్రాన్ని కూడా సినిమాలో బాగా ప్రజెంట్ చేయడానికి ఆ సైంటిస్టుల వ్యక్తిగత ఇష్యూస్‌ను కూడా కథకు జోడించారు… అది బాగుంది… పాడుబడిన మార్స్ మిషన్ వింగ్‌లోకి వెళ్లాక అక్షయ్ డిప్రెషన్ చూపిస్తూ అల్లిన సీన్ చూడాల్సిందే… ఓహ్, మార్స్ మీద లైఫ్ కూడా ఉన్నట్టుంది అంటూ…
మీరు మనుషులుగా పుట్టడం వరకూ వోకే, కానీ సైంటిస్టులుగా ఎప్పుడు పుట్టారు అనే ప్రశ్న, సమాధానాలుగా చిత్రాలు బాగున్నయ్… నెగెటివ్ ధోరణిలో ఉన్నవాళ్లను మోటివేట్ చేసుకోవడం, ఓన్ చేసుకోవడం… ఉదాహరణకు నిత్యా మేనన్ గర్భిణి, వర్క్ సైట్‌నే ఆమెకు అనుకూలంగా మారుస్తారు… ఓసారి తాప్సి భర్త అంటాడు… నేను బోర్డర్‌లో కాల్పుల్లో గాయపడ్డాను, నాకు సేవ చేయడానికి ప్రాజెక్టు వదిలేశావు, సరే, కానీ నా ప్లేసులో నువ్వు ఉంటే నేను మాత్రం బోర్డర్ వదిలిరాను… దేశం జెండాను ఖగోళంలో ఎగరేసే ప్రాజెక్టు కూడా ఓ యుద్ధమే… ఇలా చాలా డైలాగ్స్, సీన్స్, కంటెంట్ కనెక్టవుతాయి… మిషన్‌కు మామ్ పేరు, ఇస్రోకు వేరే డెఫినిషన్ గట్రా కూడా బాగుంటయ్…
అంతెందుకు.,. విలన్‌కు హీరో థాంక్స్ చెబుతాడు చివరలో… బలమైన ప్రతిపక్షం లేకపోతే, ఎప్పటికప్పుడు పగ్గాలేసి వెనక్కి లాగకపోతే… ఇంకా బలంగా సక్సెస్ వైపు పరుగు తీయాలని, ఆలోచించాలని ఎందుకు అనిపిస్తుంది… మాలో ఆ కసిని మేల్కొల్పింది మీరే అంటాడు… ఇలా చాలా… చంద్రయాన్ ఫెయిల్ సమయంలో మోడీ ఇస్రో ఛైర్మన్ శివన్‌ను ఓదారుస్తున్న సీన్ ప్రజల్లోకి బాగా వెళ్లింది… శివన్ వెంట మన దేశం, సోషల్ మీడియా, మీడియా నిలబడ్డాయి…
సైన్స్ అంశాలపై ఇప్పటితరం బాగా ఆసక్తి చూపిస్తోంది… సంక్లిష్టమైన స్పేస్ సైన్స్‌ను సరళంగా, మన నిత్య జీవితానికి జోడిస్తూ కథ రాసుకోవడంలో ఈ సినిమా రచయిత, దర్శకుడు సక్సెస్ దాదాపు మిషన్ మంగళయాన్ సక్సెస్ లాంటిదే… సినిమాను ఇంకా నెమరేసుకునేకొద్దీ కొత్త రుచులు, అంశాలు నాలుకకు తగులుతూనే ఉన్నయ్… ఇలాంటి పాత్రలు చేయడంలో అక్షయ్ ఎప్పుడూ ముందంజలోనే ఉంటాడు… అందుకని ఈ సినిమాకు సంబంధించి మరోసారి హేట్సాఫ్ అక్షయ్… ఏమాత్రం సినిమా హీరో వేషాల్లేని రియల్ హీరో పాత్ర ఇది…!!
మనం దిక్కుమాలిన ఆదిపురుష్ వంటి గ్రాఫిక్స్ చికాకు భరించినవాళ్లమే కదా… గ్రాఫిక్స్ ఎంత జుడిషియస్‌గా వాడుకోవాలో కూడా ఈ సినిమా చెబుతుంది… హాట్ స్టార్‌లో ఉంది… ఇప్పటికీ దీన్ని చూడనివాళ్లు ఓసారి చూడాల్సిన సినిమా… ముందే చెప్పుకున్నట్టు ఓ సీరియస్ ప్రశ్న… మన సౌత్ ఇండస్ట్రీకి ఈ సినిమాలు ఎందుకు చేతకావు..?! (చెప్పనే లేదు కదా, ఈ పాత్రల ఒరిజినల్ సైంటిస్టులనూ పరిచయం చేశారు చివరలో… జయహో నారీశక్తి…)
Share this Article