నిజమే… చిన్నదే కావచ్చుగాక పొరపాటు… లేదా తప్పు… కానీ ఎవరూ గమనించలేకపోయారు… పవన్ కల్యాణ్ ఎన్నికల ఎమరాల్డ్ గ్రీన్ ట్రక్కు పేరు వారాహి అని చదివి, ఈ వారాహి ఎవరని సెర్చుతుంటే… అనుకోకుండా సాయి వంశీ అనే ఫేస్‌బుక్ మిత్రుడి వాల్ మీద కనిపించింది ఇది… ఇది కూడా వరాహరూపానికి సంబంధించిన పరిశీలనే…
అసలే కాంతార సినిమాలోని వరాహరూపం సినిమా వివాదం వార్తలు రోజూ చదువుతున్నామా..? ఇప్పుడు ఇది మరో వరాహం టాపిక్… ఏకంగా విష్ణువు వరాహవతారం టాపిక్… విషయం ఏమిటంటే..? దశావతారం సినిమా తెలుసు కదా… అందులో ముకుందా ముకుందా అనే పాట ఉంటుంది… అందులో మత్స్యమల్లె నీటిని తేలి వేదములను కాచి, కూర్మరూప ధారివి నీవై భువిని మోసినావే అని కథానాయకి అసిన్ పాడుతూ ఉంటుంది… ఏవో కృష్ణుడికి సంబంధించిన తోలుబొమ్మలాట ప్రదర్శిస్తూ…
అసలు కూర్మావతారంలో మోసింది మంధర పర్వతాన్ని కదా… భువిని మోయడం, అంటే భూమిని తన పంటి కోరల మధ్య మోసింది వరాహావతారంలో కదా… మరి ఇలా రాశారేంటి..? తెలుగులోనే అనుకుంటే తమిళంలోనూ అలాగే ఉంది… సినిమాలో ఆ సన్నివేశంలో కూడా వరాహవతారం ఫోజే చూపిస్తారు… మరి కూర్మావతారం అని రాయడమేంటి..? ఇవీ ప్రశ్నలు… (పాట పలుసార్లు విన్నాను, కానీ ఈ తప్పు తట్టలేదు, అందుకే డౌటొచ్చి మళ్లీ మళ్లీ ఆ పాట యూట్యూబ్‌లో విని, తప్పును కన్‌ఫమ్ చేసుకోవల్సి వచ్చింది…)
Ads
నిజానికి తమిళం నుంచి తెలుగులోకి అనువదిస్తుంటే… ఆ ట్యూన్‌లో పొదగడానికి ఏమీ పదాలు దొరక్కపోతే, నోటికి ఏదొస్తే అది రాసిపారేస్తుంటారు అనువాద రచయితలు… కానీ ఇక్కడ మూలంలోనే తప్పు దొర్లింది… నిజానికి చిన్న, చాలా చిన్న తప్పు… కానీ అది దశావతారం సినిమా… కమల్ హాసన్ పది పాత్రలు పోషించిన సినిమా… చాలాసేపు వైష్ణవ, శైవ ఘర్షణలు చూపించబడిన సినిమా… అలాంటప్పుడు కీలకమైన విష్ణు అవతారాల వర్ణన సమయంలో ఈ తప్పులు ఏమిటి..? పైగా సినిమా మొత్తం చిన్న తప్పులతో ప్రపంచం ఎలా వినాశనం ముంగిట్లో నిలబడిందీ అనేదే కథ…
తమిళంలో పాటలు రాసింది వాలి, వైరముత్తు… బయట మస్తు నీతులు చెప్పేవాళ్లు… వైరముత్తు మీద మిటూ మూమెంట్ సమయంలో సింగర్ చిన్మయి శ్రీపాద బోలెడు ఆరోపణలు కూడా చేసింది… ప్రత్యేకించి ఈ ముకుందా పాట రాసింది వాలి… తమిళంలో బోలెడు పాటలు రాసిన సాహిత్యకారుడు, పర్‌ఫెక్షనిస్ట్ అంటారు… మరి ఇదేమిటో…!! ఈ పాటలకు సంగీత దర్శకుడు హిందీ కంపోజర్ హిమేష్ రేషమ్మియా… (ఇండియన్ ఐడల్‌లో కనిపిస్తాడు కదా… తనే…) తనకు ఎలాగూ తమిళం రాదు, తెలుగు రాదు… అనువాద రచయిత ఎవరో గానీ, గుడ్డిగా తమిళపాటను తెలుగులోకి తర్జుమా చేశారు గూగుల్ అనువాదంలాగా… నేపథ్య సంగీతం దేవిశ్రీప్రసాద్…
ఎవరూ ఈ తప్పును పట్టుకోలేదా..? లేదా ఏమవుతుందిలే అని వదిలేశారా..? ఆఫ్టరాల్ చిన్న తప్పే కదా అంటారా…? ఏదో సరదాగా చెప్పుకునే చిన్న స్టోరీయే… కోట్లకుకోట్లు ఖర్చు పెడతారు కదా, వందల మంది పనిచేస్తుంటారు కదా… ఇలాంటివి ఎందుకు గమనించరు..? అసలు ప్రివ్యూల్లో, రష్ చూసేటప్పుడు, పాటల్ని సింక్ చేసేటప్పుడు ఇవేవీ ఎవరి గమనంలోకి రావా..? వచ్చినా ఎవ్వడూ కిక్కుమనడా..? మనకెందుకు, తప్పులని చెబితే పెద్ద తలకాయలతో తిప్పలు అనుకుని..? ఈ ప్రశ్నలు అప్పుడప్పుడూ వేధిస్తుంటయ్… ఆ ప్రశ్నే ఈ కథనం కూడా…!!
Share this Article