Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

ఎవరో సరిగ్గానే చెప్పారు… హోమం చేసినా చేతులు కాలుతాయని!

November 10, 2026 by M S R

.

మంచి చేయాలన్నా భయమేనా? ఉచిత అంబులెన్స్‌కూ దుర్వినియోగం దెబ్బ! ఎవరో సరిగ్గానే చెప్పారు… హోమం చేసినా చేతులు కాలుతాయని!

మంచి చేయాలనే ఆలోచన రావడం ఒక ఎత్తు. ఆ మంచి పదిమందికీ ఉపయోగపడేలా ఆచరణలో పెట్టడం మరో ఎత్తు. కానీ ఆ మంచి ప్రయత్నాన్ని కాపాడుకోవడం మాత్రం అన్నింటికంటే కష్టమేమో! బ్లింకిట్ అంబులెన్స్ ఉదంతం చూస్తే ఇదే అనిపిస్తుంది.

Ads

సుమారు రెండేళ్ల క్రితం జొమాటో వ్యవస్థాపకుడు దీపిందర్ గోయల్ ఒక మంచి ఆలోచనకు కార్యరూపం ఇచ్చాడు. ఎటర్నల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో బ్లింకిట్ అంబులెన్స్ సేవలను ప్రారంభించాడు. అత్యవసర పరిస్థితుల్లో ఉన్నవారికి పది నిమిషాల్లో అంబులెన్స్ అందుబాటులోకి తీసుకురావడం, అందుకు ఒక్క రూపాయి కూడా వసూలు చేయకపోవడం ఈ కార్యక్రమం వెనుక ఉన్న లక్ష్యం. వ్యాపారంలో లాభనష్టాలు చూసుకునే ఒక సంస్థ, ప్రజల ప్రాణాలకు సంబంధించిన సేవను ఉచితంగా అందించడానికి ముందుకు రావడం అభినందించాల్సిన విషయమే.

అయితే ఈ మంచి ప్రయత్నానికి కూడా మన దగ్గర అనుకోని అనుభవాలు ఎదురయ్యాయి. ఇటీవల దీపిందర్ గోయల్ వెల్లడించిన వివరాల ప్రకారం… గత రెండేళ్లలో బ్లింకిట్ అంబులెన్స్ సుమారు 42 వేల కేసులకు స్పందించింది. ఇందులో దాదాపు 20 వేల కేసులు అత్యవసర వైద్య సేవలకు సంబంధించినవి. మిగిలిన కేసుల్లో రొటీన్ చెకప్‌ల కోసం ఆసుపత్రులకు వెళ్లడం, సాధారణ వైద్య అవసరాలు, ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయిన తర్వాత ఇంటికి వెళ్లడం వంటి ప్రయాణాలు కూడా పెరిగాయి.

blinkit

ఇక్కడే అసలు సమస్య మొదలైంది. ప్రాణాపాయ స్థితిలో ఉన్న రోగిని ఆసుపత్రికి చేర్చాల్సిన అంబులెన్స్.. సాధారణ ప్రయాణాలకు కూడా అందుబాటులో ఉండటంతో అత్యవసర సమయాల్లో దాని సేవలు అవసరమైన వారికి అందకపోయే ప్రమాదం ఏర్పడింది. ఒక అంబులెన్స్ రొటీన్ చెకప్ కోసం వెళ్లిందంటే, అదే సమయంలో మరోచోట ప్రాణాలతో పోరాడుతున్న రోగికి అది అందుబాటులో ఉండదు. అందులో డ్రైవర్ మాత్రమే ఉండడు. శిక్షణ పొందిన పారామెడిక్ సిబ్బంది, వైద్య పరికరాలు కూడా ఉంటాయి. అంటే ఒక సాధారణ ప్రయాణం కోసం మొత్తం అత్యవసర వైద్య వ్యవస్థనే కొంతసేపు దూరం పెట్టినట్టవుతుంది.

దీంతో దీపిందర్ గోయల్ కీలక నిర్ణయం తీసుకున్నాడు. ఇకపై అత్యవసర వైద్య సేవలకు అంబులెన్స్ ఉచితంగానే అందుతుంది. కానీ అత్యవసరం కాని ఆసుపత్రి ప్రయాణాలు, ఇంటికి తరలించడం వంటి సేవలకు రూ.2,500 ఛార్జీ వసూలు చేస్తారు. ప్రయాణం పూర్తయిన తర్వాత ఈ మొత్తం తీసుకుంటారు. ఇది జరిమానా కాదు. సాధారణ ప్రైవేట్ అంబులెన్స్ ఛార్జీలకు అనుగుణంగా నిర్ణయించిన రుసుము. ఆ డబ్బు కూడా అంబులెన్స్ సేవలను నిర్వహిస్తున్న ఎటర్నల్ ఫౌండేషన్‌కే వెళ్తుంది.

గోయల్ తీసుకున్న ఈ నిర్ణయం వెనుక ఉన్న ఆవేదనను అర్థం చేసుకోవాలి. ఉచితంగా సేవలు అందించాలనే సంకల్పం ఉంది. అందుకు అవసరమైన పెట్టుబడి పెట్టే సామర్థ్యం ఉంది. కానీ ఆ సేవ ఎవరికి అందాలనే కనీస విచక్షణ వినియోగదారుల్లో లేకపోతే పరిస్థితి ఏమిటి?

ఇది ఒక్క బ్లింకిట్ అంబులెన్స్ సమస్య మాత్రమే కాదు. మన దగ్గర ఉచితంగా ఏదైనా అందుబాటులోకి వస్తే దాన్ని ఎలా ఉపయోగించుకోవాలనే ఆలోచన కంటే, దాని ద్వారా మనకు ఎంత ఖర్చు మిగులుతుందనే లెక్క మొదలవుతుంది. కొన్ని వందల రూపాయల క్యాబ్ ఖర్చు ఆదా చేసుకోవడానికి అంబులెన్స్‌ను ఉపయోగించుకోవడం, సాధారణ ప్రయాణానికి అత్యవసర సేవలను ఆశ్రయించడం.. ఇలాంటి ధోరణి చివరకు ఎవరికి నష్టం చేస్తుంది?

ఒక్కసారి ఆలోచించండి. ఇంట్లో ఒక వృద్ధుడికి అకస్మాత్తుగా గుండెపోటు వచ్చింది. వెంటనే అంబులెన్స్ అవసరం. కానీ దగ్గరలో ఉన్న అంబులెన్స్ మరొకరిని సాధారణ చెకప్ కోసం ఆసుపత్రికి తీసుకెళ్లింది. ఈలోగా నిమిషాలు గడిచిపోయాయి. ప్రాణాపాయ స్థితిలో ఉన్న రోగికి సాయం ఆలస్యమైంది. ఇలాంటి పరిస్థితి వస్తే బాధ్యత ఎవరిది?

ఇక్కడ మరో కోణం కూడా ఉంది. ఒక సంస్థ ప్రజలకు ఉచిత సేవ అందించాలనుకున్నప్పుడు, దాన్ని దుర్వినియోగం చేసే కొందరి కారణంగా నిజంగా అవసరమైన వారికి ఆ సేవ దూరమైతే, చివరకు ఉచిత సౌకర్యాలనే పరిమితం చేయాల్సి వస్తుంది. రేపు ఇలాంటి సేవలు ప్రారంభించాలనుకునే మరో పారిశ్రామికవేత్త కూడా ఒకటికి రెండుసార్లు ఆలోచించవచ్చు. మంచి చేయాలనే ఆలోచనకు ముందే దాని దుర్వినియోగాన్ని ఎలా అడ్డుకోవాలనే లెక్కలు వేసుకోవాల్సి వస్తుంది.

మంచి చేయాలనుకునే చేతులను ప్రోత్సహించాల్సిన సమాజం.. ఆ చేతులు వెనక్కి వెళ్లిపోయేలా ప్రవర్తిస్తే అంతకంటే దురదృష్టం ఏముంటుంది?

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • ఎవరో సరిగ్గానే చెప్పారు… హోమం చేసినా చేతులు కాలుతాయని!
  • రావణుడు ఎవరు..? వైకుంఠద్వారం దగ్గర అసలు కథ మొదలు..!!
  • ట్రంపు క్యాంపుపై డెమొక్రాట్ల దాడి మొదలు- ఒక అభిశంసన తీర్మానం!!
  • మూడో భార్యకూ పవన్ కల్యాణ్ విడాకులు- మొక్కవోని ‘ఆదర్శం’..!!
  • Nvidiaలో ఏం జరుగుతోందో అర్థం కావడం లేదా? అసలు కథ ఇదీ..!
  • సీతమ్మ పుట్టినిల్లు… నేపాల్ వాస్తు శిల్పం… తెరపై మరో ఆసక్తికర కోణం!
  • మన స్టారాధిస్టారులు – తెరపై భీకరమైన ‘నరుకాసురులు’…
  • రామాయణంలో పిడకల వేట & గుడ్డు మీద ఈకలు పీకడం!
  • నేలపై కూర్చున్నా చేతిలోనే కంచం! మారిన మన భోజన సంస్కృతి!!
  • మోషన్ పిక్చర్ కాదు, ఎమోషన్ పిక్చర్ – ఆయువుపట్టు, జటాయువుపట్టు

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions