.
నిన్న కనిపించిన వార్తే… ఇంట్రస్టింగు… మహాకుంభమేళాకు రోజూ కోట్లాది మంది పుణ్యస్నానాలకు పోటెత్తుతున్నారు కదా… ఐనా వాయు కాలుష్యం లేదు, కారణమేంటి..?
గతంలోకన్నా ఈసారి భక్తుల తాకిడి చాలా ఎక్కువగా ఉంది… రవాణా సౌకర్యాలు మెరుగుపడటంతోపాటు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం కలిసి మునుపెన్నడూ లేని రీతిలో వసతి సౌకర్యాలను డెవలప్ చేయడం ప్లస్ వ్యయప్రయాసలకు వెరవకుండా దూరాభారం లెక్కచేయకుండా జనం భక్తియాత్రలకు వెళ్లడానికి మక్కువ పెంచుకోవడం కారణాలు కావచ్చు…
Ads
ఈసారి 45 కోట్ల మంది హాజరవుతారని కదా అంచనా… 2 లక్షల కోట్ల ఆదాయాన్ని అంచనా వేస్తున్నారు కూడా… సరే, ఆ సంఖ్యల మాటెలా ఉన్నా… కాలుష్యం మాటేమిటి..?
కనిపించిన వార్త ఏం చెబుతున్నదంటే..? జపనీస్ టెక్నిక్ కారణంగానే కాలుష్యం దిగజారిపోలేదు అని… ఈసారి భక్తుల తాకిడిని ముందే ఊహించిన యోగీ ప్రభుత్వం రెండేళ్ల క్రితమే ఓ కసరత్తు స్టార్ట్ చేసింది… ప్రయాగరాజ్‌కు సంబంధించిన మున్సిపల్ కార్పొరేషన్ మియవాకి అనే జపనీస్ టెక్నాలజీ, పద్ధతితో ప్రయాగరాజ్ పరిసరాల్లో చిట్టడవుల్ని పెంచారు…
నగరంలో పదిచోట్ల 18.5 ఎకరాల ఖాళీ భూముల్లో 5 లక్షలకు పైగా 63 రకాల మొక్కల్ని నాటారు… దానికైన ఖర్చు దాదాపు 6 కోట్లు… అవిప్పుడు ఏపుగా పెరిగి ఎక్కువ ఆక్సిజన్‌ను వాతావరణంలోకి పంప్ చేస్తున్నాయి… తక్కువ ప్రదేశంలో ఎక్కువ మొక్కల్ని నాటడమే ఈ మియవాకి టెక్నిక్… (అకిర మియవాకీ అనే జపనీస్ వృక్ష శాస్త్రవేత్త డెవలప్ చేసిన విధానం ఇది… జపాన్‌లో బాగా సక్సెసయింది…)
ఆ 63 రకాల మొక్కల్లో కూడా మర్రి, రావి, వేప, చింత, ఉసిరి, రేగి, వెదురు తదితరాలు ఉన్నాయి… వీటిని ఏపుగా పెంచి, మూడేళ్లపాటు నిర్వహించే బాధ్యతను కూడా ప్రైవేటు ఏజెన్సీకి ఇచ్చారు… ఇదీ వార్త సారాంశం… గుడ్, వెరీ గుడ్…
ఇక్కడ ఈ ప్రాజెక్టును బట్టి అన్ని రాష్ట్రాలూ, అన్ని నగరాలూ నేర్చుకోవాల్సిన నీతి ఏమిటంటే..? ప్రతి నగరంలోనూ బోలెడు ఖాళీ స్థలాలున్నాయి… ప్రభుత్వ భూములున్నాయి… ప్రత్యేకంగా హార్టీకల్చర్, అర్బన్ ఫారెస్ట్ విభాగాలున్నాయి…
ప్రతి మున్సిపాలిటీకి బోలెడంత బడ్జెట్లున్నాయి… మరి అదే మియవాకి టెక్నిక్ ఎందుకు ఫాలో కాకూడదు… 6 కోట్ల చొప్పున అలవోకగా ఖర్చు చేయగల మున్సిపాలిటీలు వందల్లో ఉన్నాయి… నగరాలకు అసలు అది సమస్యే కాదు… ఎటొచ్చీ ప్రభుత్వాలకు, నగరపాలక సంస్థలకు, బాధ్యులైన ఉన్నతాధికారగణానికి సంకల్పశుద్ధి అవసరం…
మూసీ సుందరీకరణ, పునరుజ్జీవం పేరిట వేల కోట్లను ఖర్చు చేసే బదులు… మూసీకి అటూఇటూ లక్షల చెట్లను ఈ మియవాకి టెక్నిక్‌తో పెంచితే… మూసీలోకి వ్యర్థాల పంపింగును అరికట్టగలిగితే… మరిన్ని భారీ అత్యాధునిక ఎస్టీపీ యూనిట్లు పెట్టగలిగితే… ఎంత ఖర్చు సరిపోతుంది..? ఎవరైనా ఆలోచిస్తున్నారా..?! సియోల్ వెళ్లొచ్చారు సరే, ఓసారి ప్రయాగరాజ్ వెళ్లిరండి… పుణ్యం, పురుషార్థం, ఆ చిట్టడవుల పరిశీలన ఒకేసారి..!!
Share this Article